V Hanumnatha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కంటతడి - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై సంచలన ఆరోపణలు
Telangana News: లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ లో సీట్ల కోసం అసంతృప్తి రేగుతోంది. తనకు ఎంపీ సీటు రాకుండా డిప్యూటీ సీఎం భట్టి అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆరోపించారు.
V Hanumantha Rao Sensational Comments on Bhatti Vikramarka: లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress)లో సీట్ల కాక మొదలైంది. ఇప్పటికే ఎలాగైనా సీట్లు దక్కించుకునేలా ఆశావహులు, అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (V.Hanumantha Rao) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై (Bhatti Vikramarka) సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తనకు ఎంపీ సీటు రాకుండా భట్టి అడ్డుపడుతున్నారని కంటతడి పెట్టుకున్నారు. 'భట్టి విక్రమార్క నాకు ఖమ్మం లోక్ సభ సీటు రాకుండా చేస్తున్నారు. మొదట సీటు ఇస్తామన్నారు. ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు. భట్టి నాకు ద్రోహం చేస్తున్నారు. సీటు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో నాకు తెలియడం లేదు. ఈ రోజు పార్టీ భట్టి విక్రమార్క ఈ స్థానంలో ఉన్నారంటే అందుకు నేనే కారణం. ఆయన్ను ఎమ్మెల్సీని చేసింది నేనే. నా కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లో లేరు. సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ నాకు న్యాయం చేయాలి. గత ఎనిమిదేళ్లుగా నాకు ఎలాంటి పదవీ ఇవ్వలేదు. క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ లేదు. స్టార్ క్యాంపెయిన్ లో చోటు లేదు. అయినప్పటికీ తనకు ప్రజల్లో అభిమానం ఉంది. ఎవరు తనకు వ్యతిరేకంగా చేసినా ఆ భగవంతుడు ఉన్నాడు.' అని వీహెచ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని వీహెచ్ అన్నారు. తాను లోకల్ కాదు అని అంటున్నారని.. రేణుకా చౌదరి, నాదెండ్ల భాస్కర్, రంగయ్యనాయుడు లోకలా? అని ప్రశ్నించారు. పార్టీ కోసం పదవులు ఆశించకుండా పని చేసిన తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం లోక్ సభ సీటు తనకు కేటాయిస్తే కచ్చితంగా గెలుస్తానని అన్నారు. 'బీసీల ఓట్లు కాంగ్రెస్ కు అవసరం లేదా.?. ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే నేను తప్పుకొంటాను. లేకపోతే ఖమ్మం నుంచి పోటీకి నేనే అర్హుడిని. నేను పార్టీ కోసం పనిచేశాను. చనిపోయే వరకూ పార్టీలోనే ఉంటాను. నా వయసు నాకు అడ్డంకి కాదు.' అని వీహెచ్ వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడ్డారని.. ఆయనే సీఎం కావాలని తాను భావించానని అందులో తప్పేముంది.? అని వీహెచ్ ప్రశ్నించారు. రేవంత్ హెలికాఫ్టర్ లో తిరిగితే.. తాను కార్లలో తిరిగి ప్రచారం చేశానని గుర్తు చేశారు. భారతదేశంలో వీహెచ్ అంటే తెలియని వారుండరని.. ఖమ్మం ప్రజలు తనను కోరుకుంటున్నారని చెప్పారు. తాను పార్టీకి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని తనకు ఎంపీ సీటు ఇవ్వాలని కోరారు.
కాగా, తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను.. 4 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇటీవల అభ్యర్థులను ప్రకటించింది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, నల్గొండ స్థానానికి కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి పోరిక బలరాం నాయక్ ల పేర్లను ఖరారు చేసింది.
Also Read: RS Praveen Kumar: బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తుపై వీడిన సందిగ్ధత, మాయావతి అంగీకారంతో లైన్ క్లియర్