Congress Padayatra : బాసర నుంచి కాంగ్రెస్ సీనియర్ల మరో పాదయాత్ర - పార్టీ కోసమేనన్న రేవంత్ !
బాసర నుంచి కాంగ్రెస్ సీనియర్లు మరో పాదయాత్ర ప్రారంభించారు. అయితే పోటీ యాత్ర కాదని..పార్టీ కోసమేనని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.
Congress Padayatra : తెలంగాణ కాంగ్రెస్ కార్యక్రమాల అమలు ఇంచార్జ్ మహేశ్వర్ రెడ్డి విడిగా పాదయాత్ర ప్రారంభించడం కాంగ్రెస్‌లో కలకలం రేపింది. ఆయన పాదయాత్రకు హాత్ సే హాత్ జోడో యాత్ర అని కాకుండా సేవ్ కాంగ్రెస్ అన్నట్లుగా ప్రచారం చేసుకోవడంతో వివాదం అయింది. సీఎల్పీ నేత భట్టి విక్ర మార్క, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డితోపాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అదిలాబాద్ జిల్లాలోని బాసర నుంచి హైదరాబాద్ వరకు మొదటి విడతగా దాదాపు 10 రోజుల పాటు ప్రజా సమస్యలపై పోరు యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. బాసర లోని సరస్వతి ఆలయంలో పూజలు నిర్వహించి యాత్రను మొదలు పెట్టారు. టీపీపీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ నియోజకవర్గంలో యాత్రను ప్రారంభించి.. హుజూర్ నగర్ నియోజక వర్గంతో పాటు నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని కొన్ని నియోజక వర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు.
ఇది రేవంత్ రెడ్డి పాదయాత్రకు పోటీగా నిర్వహిస్తున్నారన్న ప్రచారం ప్రారంభమయింది. అయితే ఈ పాదయాత్ర పార్టీ పరంగానే జరుగుతోందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు పాదయాత్ర చేసినా అది పార్టీ అభీష్టం మేరకే ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ సీనియర్ నేతలందరూ కచ్చితంగా యాత్ర చేయాల్సిందేనని తెలిపారు. మహేశ్వర్ రెడ్డి పాదయాత్ర చేసినా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పాదయాత్ర చేసినా.. అది పార్టీ ప్రయోజనాలకేనని స్పష్టం చేశారు. యాత్ర చేయనివారిపై చర్యలు ఉంటాయని అన్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి చేపడుతున్న హాత్ సే హాత్ జోజో యాత్ర.. రాహుల్ గాంధీ చెప్పినట్లుగా జరగడం లేదని.. రేవంత్ రెడ్డి సొంత పాదయాత్రలా జరుగుతోందని మహేశ్వర్ రెడ్డి .. కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ థాక్రే ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అందరూ పాదయాత్ర చేయవచ్చని.. థాక్రే సర్ది చెప్పారు.
హైకమాండ్ ఆదేశాల మేరకు అందరూ పాదయాత్రలు చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా ఉమ్మడి నల్లగొండలో యాత్ర చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. పాదయాత్రలు పార్టీలో ఒకరిద్దరికే పరిమితం చేయకుండా.. పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా ఎంత మంది నాయకులు యాత్రలు చేసినా ఫర్వాలేదని, కానీ కాంగ్రెస్‌కు నష్టం చేసే విధంగా వ్యవహారించొద్దని అధిష్టానం సూచనలు చేసింది. రాహుల్ గాంధీ జోడో యాత్ర స్ఫూర్తితో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజక వర్గాల వారిగా యాత్రలు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది.
రేవంత్ రెడ్డి పాదయాత్రకు సహజంగానే స్పందన ఎక్కువగా ఉంది. ఆయన మాస్ లీడర్ కావడంతో ఆ ప్రభావం కనిపిస్తోంది. కొంత మంది సీనియర్ నేతలు కూడా రేవంత్ కు మద్దతు ప్రకటించారు. మరికొంత మంది మాత్రం పోటీ పాదయాత్ర చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవడంతో సమస్య ప్రారంభమయింది.