Telangana Elections News: తెలంగాణలో కర్నాటకం! అక్కడి పాలనా తీరే ఇక్కడ కాంగ్రెస్ ప్రచార ఎజెండా
తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం పక్కకుతిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ - బీజేపీ వ్యూహాలు
Telangana Latest News: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కర్ణాటక రాష్ట్రం కేంద్రబిందువు అయింది. కన్నడ ఓటర్ల తీర్పు తెలంగాణలో ప్రత్యర్థి ఎవరో నిర్ణయించింది. అప్పటి వరకు బీఆర్ఎస్ కు (BRS News) ప్రత్యామ్నాయం బీజేపీనే అన్న చందంగా ఉన్న తెలంగాణ రాజకీయాలు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఒక్కసారిగా మారిపోయాయి. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ (BRS Vs BJP) కాస్తా.. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా (BRS Vs Congress) మారాయి. అంతే కాదు, కర్ణాటక ఎన్నికల్లో ఐదు హామీలు గుప్పించిన కాంగ్రెస్ తెలంగాణలో ఆరు గ్యారంటీ హమీలు అంటూ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లింది.
కర్ణాటక ఎన్నికల్లో హంగ్ వస్తుందని బీఆర్ఎస్ పార్టీ జేడీఎస్ కు మద్ధతు ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలు సైతం అక్కడి ఎన్నికల్లో తెలుగు వాళ్లు ఉన్న చోట ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కర్ణాటక నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకకు చెందిన 5 గురు మంత్రుల, 40 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యులుగా నియమించింది. ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ తెలంగాణ ఎన్నికల ప్రచారం చేశారు.
మరోవైపు కర్ణాటక బీజేపీ నేతలు కర్ణాటకలో పాలనను వదిలేసి తెలంగాణ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టిపెట్టిందని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి , కర్ణాటక ప్రభుత్వం ఏటీఎంలా మారిందని దయ్యబడుతున్నారు. ఏది ఏమైనా తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యతను కన్నడ కాంగ్రెస్ నేతలు నెత్తిన ఎత్తుకున్నారు. మరో వైపు కర్ణాటక బీజేపీ నేతలు సైతం ఈఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన 5 హమీలు ఫెయిలయ్యాయని ప్రచారం చేస్తున్నారు. జేడీ ఎస్ నేత మాజీ సీఎం కుమార స్వామి కర్ణాటకలో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం విశేషం.
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేయడం తెలంగాణలో ఓ సన్సేషన్ గా మారింది. ఈ ప్రెస్ మీట్ ను బీఆర్ఎస్ పార్టీనే పెట్టించిందని తెలంగాణ పీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి ధ్వజమెత్తడం తెలిసిందే. మరో వైపు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సహా ముఖ్యనేతలు హరీశ్ రావు, కేటీఆర్ వంటి నేతలు ప్రతీ సభలోను కర్ణాటకలో హమీలు ఫెయిలయ్యాయని నమ్మవద్దని ప్రచారం చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో తెలంగాణ ఆత్మగౌరవం, స్వయం పాలన, అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాల పైన జరగ్గా.. ఈ దఫా ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ హమీల అమలు తీరుపై ప్రధానంగా చర్చ సాగడం విశేషంగా చెప్పుకోవాలి. కర్ణాటక ఫలితాలే ఇక్కడా రిపీట్ అవుతాయని కాంగ్రెస్ చెబుతుంటే, తెలంగాణాలో హ్యాట్రిక్ కొడతామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని అప్పుడుతామే కింగ్ మేకర్ అవుతామన్న ఆశలో అటు బీజేపీ - ఇటు ఎం.ఐ.ఎం లు ఉన్నాయి. తెలంగాణ వాదంతోనే ఇప్పటి వరకు రాజకీయాలు చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఈ కర్ణాటక ఫార్ములా అనేది చికాకు తెప్పిస్తోంది. కర్ణాటకలో కరెంటు కోతలు, ఐదు గ్యారంటీ హమీలు అమలు కావడం లేదని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇందు కోసం అక్కడి రైతులు, ప్రజల ద్వారా సోషల్ మీడియా వేదిక తో ఇక్కడి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. రానున్న రోజుల్లో కర్ణాటక బీజేపీ నేతలు, జేడీఎస్ ముఖ్యనేతలు కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రచార హోరుకు అడ్డకట్ట వేసేందుకు రంగంలోకి దిగుతారన్న ప్రచారం సాగుతోంది ఇదిలా ఉంటే తెలంగాణలో ఈ కర్ణాటక అంశాలు ఎందుకు అన్న చర్చ మరో వైపు సాగుతోంది.
- వై.సుధాకర్ రావు, అసిస్టెంట్ ఎడిటర్ (ఇన్‌పుట్)