Banakacharla Dispute: బనకచర్ల పాపం కేసీఆర్‌దే.. అదే కనుక జరిగితే కేసీఆర్, హరిష్‌రావులను ఉరితీయాలి: సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు చేసిన పాపాలతోనే గోదావరి నీళ్ల కేటాయింపులో రేపు తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Banakacharla Issue: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టుపై అఖిల పక్ష ఎంపీల సమావేశం తర్వాత విడిగా ప్రెస్‌మీట్ పెట్టిన రేవంత్ బీఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కేసీఆర్, హరీష్‌లపై విరుచుకుపడ్డారు. వాళ్లిద్దరూ చేసిన పాపాలకు వాళ్లని ఉరితీసినా తప్పులేదంటూ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బనకచర్ల మూలకారకుడు కేసీఆర్
ఆంధ్రప్రదేశ్ ఇవాళ బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించడానికి మూల కారకుడు మాజీ సీఎం చంద్రశేఖర్రావే... అంటూ రేవంత్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్న ౩వేల టీఎంసీల వరద జలాల ప్రస్తావన ముందు తీసుకొచ్చిందే కేసీఆర్ అని.. ఆ వాదన ఆధారంగానే ఏపీ బనకచర్ల తీసుకొచ్చిందన్నారు. “ తెలంగాణ ఏర్పడిన తరువాత కేంద్రప్రభుత్వం 21-9-2016 అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో మొట్టమొదట గోదావరిపై 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని ఆనాటి సీఎం కెసీఆర్ ప్రతిపాదన ఇచ్చారు. ఆ సమావేశంలో హరీష్ రావుగారు కూడా పాల్గొన్నారు. ఈ మీటింగ్ మినిట్స్ ను రిఫరెన్స్ గా చూపి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు బనకచర్లను గుదిబండగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు సమబంధించి అఫీషియల్ డాక్యుమెంట్స్ మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం” అంటూ ఆ మినిట్స్ కాపీని అందించారు.
రాయలసీమను రతనాలు సీమ చేస్తా అనలేదా..?
గోదావరి జలాల విషయంలో ఒకసారి కాదు.. నాలుగైదు సార్లు కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని రేవంత్ విమర్శించారు. బేసిన్లు లేవు.. భేషజాలు లేవు అంటూ నాడు మెహర్భానీలు చూపించి ఇప్పుడు.. వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. మళ్లీ 13 ఆగస్టు 2019 లో రాయలసీమను రతనాల సీమ చేస్తామని ఆనాటి తెలంగాణ సీఎం కెసీఆర్ ప్రకటించారు. గోదావరి జలాలలను రాయలసీమకు తరలించాలని కెసిఆర్, జగన్ ప్రగతి భవన్ లో నాలుగుసార్లు సమావేశమయి నిర్ణయం తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల సిఎంల భేటీ వివరాలను ఆనాటి మంత్రులు ఈటెల రాజేందర్ , బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు.” రేవంత్ చెప్పారు.
మిమ్నల్ని ఉరితీసినా తప్పులేదు.
అపెక్స్ కౌన్సిల్‌లో కేసీఆర్ వ్యాఖ్యలు చేసినప్పుడు హరీష్ రావు కూడా ఉన్నారు. అప్పుడు నీళ్లు ఉన్నాయని చెప్పి.. ఇప్పుడేమో.. మోసపు మాటలు చెబుతున్నారన్నారు. “గోదావరి- బనకచర్ల విషయంలో 2016 లో కెసీఆర్, చంద్రబాబు మాట్లాడుకున్న అంశాల సాకుతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుకువెళుతోంది బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని కెసీఆర్ ఆనాడు మాట్లాడారు .ఏపీ చేపట్టేది 200 టీఎంసీ ప్రాజెక్టు కాదు 300 టీఎంసీల కోసం ఆనాడు కెసీఆర్ 400 టీఎంసీలు తీసుకోవచ్చని అంగీకరించారు”. కేసీఆర్, హరీశ్ రావు చేసిన పాపాలతోనే గోదావరి నీళ్ల కేటాయింపులో రేపు తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి… అదే జరిగితే కేసీఆర్, హరీశ్ రావులను ఉరితీయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు
చంద్రబాబూ మీ వల్ల కాదు..
ప్రధాని మోదీతో తనకున్న పరిచయాలు వాడుకుని బనకచర్లకు చంద్రబాబు అన్ని అనమతులు సాధించగలరు అనుకుంటే అది ఆయన భ్రమేననన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాక్షేత్రంలో తమ హక్కుల కోసం ఎలా పోరాడాలో తమకు తెలుసంటూ చంద్రబాబు పై విమర్శలు చేశారు. బనకచర్ల అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానితో సహా అందరి అపాయింట్మెంట్ తీసుకుని కలిసి తెలంగాణ సమస్యలను వివరిస్తామని చెప్పారు. “చంద్రబాబు గారు.. దూరం పెంచుకుంటే సమస్య పరిష్కారం కాదు.. మోదీ దగ్గర అనుమతులు తెచ్చుకున్నంత మాత్రాన మీ ప్రాజెక్టులు పూర్తికావు. కృష్ణా, గోదావరి బేసిన్ లపై మా తెలంగాణ ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసీ ఇవ్వండి మిగిలిన నీరును మీరు ఎలాగైనా వాడుకోండి” అన్నారు
లీగల్ ఫైట్‌కు అయినా రెడీ
పొలిటికల్ ఫైట్ లో న్యాయం జరగకపోతే లీగల్ ఫైట్ చేద్దామని... ఈ విషయంలో మనందరం కలిసికట్టుగా ముందుకు వెళదాం అంటూ అంతకు ముందుకు ఎంపీల సమావేశంలో చెప్పారు. బనకచర్లపై నిర్వహించిన తెలంగాణ ఆల్ పార్టీ ఎంపీల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డికి, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు స్వల్ప వాగ్వాదం జరిగింది. బనకచర్లపై ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ విషయాన్ని ప్రస్తావించడాన్ని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభ్యంతరం చెప్పటంతో ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. దీంతో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వాకౌట్ చేశారు.





















