KCR on Cloud Bursting: భద్రాచలం వరదలపై కేసీఆర్ కొత్త అనుమానం, క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగిందని వ్యాఖ్యలు
KCR On Cloud Bursting: వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలంలో కేసీఆర్ పర్యటించారు. అనంతరం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు.
గోదావరి వరదలకు కారణం కుట్ర జరిగి ఉండవచ్చని సీఎం కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. క్లౌడ్ బరస్ట్ అనే విధానంతో ఇతర దేశాల వాళ్లు మన దేశంలో అక్కడక్కడ ఈ పని చేసి ఉంటారని ఆరోపించారు. కావాలనే పని చేసి ఉన్నారని, గతంలో కశ్మీర్ లో లద్దాఖ్, లేహ్‌లో చేశారని, తర్వాత ఉత్తరాఖండ్‌లోనూ క్లౌడ్ బరస్ట్ చేశారని గుర్తు చేశారు. ఈ మధ్య గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోనూ క్లౌడ్ బరస్ట్ చేశారని మనకు సమాచారం వచ్చిందని కేసీఆర్ అన్నారు. మొత్తానికి వాతావరణంలో సంభవించే ఇలాంటి ఉత్పాతాల వల్ల ప్రభావితం అయ్యే ప్రజల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు.
భద్రాచలం వద్ద గోదావరిలో 50 ఫీట్ల నీటి మట్టం వచ్చినా ఆలయ పరిసరాల్లో ఉన్న కాలనీలు నీట మునుగుతున్నాయని కేసీఆర్ అన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం కావాలని ఆశించారు. ఈసారి కడెం ప్రాజెక్టు కూడా తీవ్రమైన వరద ప్రభావంతో భయంకర పరిస్థితికి చేరుకుందని అన్నారు. ఆ ప్రాజెక్టు స్థాయికి మించి వరద నీరు వచ్చిందని గుర్తు చేశారు.
ఈసారి మానవ నష్టం జరగకుండా అధికారులు పని చేసినందుకు ప్రత్యేకంగా కలెక్టర్‌కు, ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు. 25 వేల మంది ప్రజలను, 7 వేల 200 కుటుంబాలను జిల్లా యంత్రాంగం పునరావాస కేంద్రాలకు తరలించారని అన్నారు. వరదల ప్రభావం పూర్తయ్యే వరకూ ఈ పునరావాస కేంద్రాలను కొనసాగించాలని సూచించారు. కొన్ని వాతావరణ అంచనా సంస్థలు ఈ నెల 29 వరకూ ప్రతి రోజూ వర్షం వచ్చే సూచనలు ఇస్తున్నాయని, కాబ్టటి, అప్పుడే ప్రజలను ఇళ్లకు పంపకుండా పునరావాస కేంద్రాల్లోనే కొనసాగించాలని సూచించారు.
వెయ్యి కోట్లతో శాశ్వత కాలనీలు నిర్మిస్తాం - కేసీఆర్
భద్రాచలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన కాలనీలు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రస్తుతం 70 అడుగుల వరకూ చేరిందని భవిష్యత్తులో 80, 90 అడుగులకు చేరినా ఇబ్బంది లేకుండా, ఈ కాలనీల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. రూ.వెయ్యి కోట్లతో 2 నుంచి 3 వేల ఇళ్లు ఎత్తైన ప్రదేశంలో నిర్మిస్తామని ప్రకటించారు. గతంలో గంగా నది వరదల సమయంలో నష్ట నివారణ చర్యల్లో భాగంగా చేపట్టిన సాంకేతిక విధానాలను అవలంబించాలని సూచించారు. అవసరమైతే ఐఐటీ ప్రొఫెసర్ల సాయం తీసుకోవాలని నిర్దేశించారు. మొత్తానికి భవిష్యత్తులో వరద సమస్య లేకుండా చేస్తామని చెప్పారు.
వరద సాయం ప్రకటన
తక్షణ సాయం కింద వరద బాధితులకు రూ.10 వేలు సాయం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా మరో రెండు నెలల పాటు కుటుంబానికి ఉచితంగా 20 కిలోల బియ్యం అందజేస్తామని చెప్పారు.