Central Team: హైదరాబాద్ చేరుకున్న కేంద్రబృందం, మొరపెట్టుకున్న వరద బాధితులు!
Central Team: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో కేంద్రబృందం పర్యటించింది. రెండు రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Central Team: రాష్ట్రంలో గత కొంత కాలంగా కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల సర్వం కోల్పోయిన ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర బృందం. గత రెండ్రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తిరిగిన అధికారులు నిన్న రాత్రిపూట హైదరాబాద్ కు చేరుకున్నారు. రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులు, తీసుకున్న సహాయక చర్యల గురించి కేంద్ర బృందం అధికారులకు వివరించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఈనెల 20 వ తేదీన హైదరాబాద్ కు చేరుకొని రెండు బృందాలుగా విడిపోయి వివిధ జిల్లాల్లో వేర్వేరుగా పర్యటించారు.
రెండు బృందాలుగా మారి రాష్ట్రంలో పర్యటన..
ఈ రెండు బృందాలు రాష్ట్ర విపత్తుల నిర్వహణా శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో కలసి ఒక బృందం నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించగా, మరో బృందం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రార్డీ కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించి నష్టాలను అంచనా వేశాయి. జిల్లాల్లోని వివిధ గ్రామాల్లో ఈ బృందాలు స్వయంగా పర్యటించి పరిస్థితులను పరిశీలించాయి. భారీ వర్షాలు వరదల వల్ల నీటిపారుదల వ్యవస్థకు జరిగిన నష్టం, దెబ్బతిన్న రోడ్ల పరిస్థితి, వివిధ శాఖలకు జరిగిన నష్టాన్ని స్వయంగా చూశాయి.
కష్టాలు చెప్పుకొని కన్నీరుమున్నీరైన ప్రజలు..
వర్షం ధాటికి ఇళ్లు కోల్పోయిన ప్రజలు.. కేంద్రం బృందం అధికారులకు తమ పరిస్థితి చెప్పుకొని కన్నీరుమున్నీరు అయ్యారు. అలాగే అన్నదాతలు కూడా తమ పంట మొత్తం నీట మునిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల పంట నీట మునిగినట్లు అధికారులు గుర్తించారు. చాలా ప్రాంతాల్లో రైతులు ముందుస్తు పంటలు వేయడం వల్ల.. ఆధిలోనే చాలా నష్టపోయినట్లు తెలుసుకున్నారు. అయితే తమ రాష్ట్రానికి వచ్చిన ఊరూరా తిరిగి స్వయంగా ప్రస్తుత పరిస్థితిని పరిశీలించినందుకు కేంద్ర బృందానికి చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ కృతజ్ఞత తెలిపారు.
ప్రాణనష్టం లేకుండా చేయడం అభినందనీయం..
కాగా, భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పటికీ సంబంధిత జిల్లా పాలనా యంత్రాంగాలు ఎన్డీఆర్ఎఫ్ తదితర విభాగాల సమన్వయంతో కృషిచేసి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అడ్డుకోవడాన్ని కేంద్రబృందం అధికారులు.. రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని అభినందించింది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల ఏర్పడ్డ పరిస్థితులను స్వయంగా చూసి అంచనా వేయడంపట్ల కేంద్ర ప్రతినిధి బృందానికి సీఎస్ సోమేశ్ కుమార్ కృతజ్ఞత తెలిపారు.
రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ప్రభుత్వ అధికారులలో కేంద్ర హోమ్ శాఖ జాయింట్ సెక్రటరీ సౌరవ్ రే, డిప్యూటీ సెక్రటరీ పి పార్తీబన్, డైరెక్టర్ కె. మనోహరన్, డైరెక్టర్ రమేష్ కుమార్, దీప్ శేఖర్, శివ కుమార్ కుష్వాహా, ఏ. కృష్ణ ప్రసాద్ తదితరులు ఉన్నారు.