Telangana Panchayat Elections: ముగిసిన ప్రచారం.. ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు, మద్యం దుకాణాలు బంద్! రేపు పోలింగ్
తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం గడువు నేడు (మంగళవారం) సాయంత్రం 6 గంటలకు ముగిసింది. గత కొద్ది రోజులుగా పంచాయతీల్లో ప్రచారాన్ని హోరెత్తించిన నేతలు సైలెంట్ అయ్యారు.

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం గడువు నేడు (మంగళవారం) సాయంత్రం 6 గంటలకు ముగిసింది. గత కొద్ది రోజులుగా పంచాయతీల్లో ప్రచారాన్ని హోరెత్తించిన నేతలు సైలెంట్ అయ్యారు. 11వ తేదీన తొలి విడత పోలింగ్ జరగనుండటంతో, ఈ రెండు రోజులు ఓటర్లను ప్రలోభపెట్టే వ్యూహాలకు పదును పెట్టే అవకాశం ఉంది. తమ అభ్యర్థుల గెలుపుకు వారి మద్దతుదారులు ఈ దిశగా ఇప్పటికే గ్రామాల్లో చర్చలు పెడుతున్నారు. 11వ తేదీ (గురువారం) జరగనున్న పోలింగ్‌కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
4,235 పంచాయతీలకు తొలి విడత పోలింగ్
మొదటి విడతలో మొత్తం 189 మండలాలు, 4,235 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. ఈ పోలింగ్ ప్రక్రియ కోసం 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తొలి విడతలో ఓటు హక్కు వినియోగించుకునేది వీరే..
4,235 పంచాయతీల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. ఇందులో మొత్తం 56 లక్షల 19 వేల 430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుష ఓటర్లు 27 లక్షల 41 వేల 70 మంది; మహిళా ఓటర్లు 28 లక్షల 78 వేల 159 మంది; ఇతర ఓటర్లు 201 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
పోలింగ్ రోజే కౌంటింగ్
తొలి విడతలో 395 గ్రామ పంచాయతీలకు సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 11వ తేదీన పోలింగ్ మధ్యాహ్నంతో ముగియనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే, అదే రోజు మధ్యాహ్నం నుండి ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంతరం విజేతల పేర్లను ప్రకటిస్తారు.
మద్యం దుకాణాలు బంద్
తొలి విడత పోలింగ్ జరిగే పంచాయతీల్లో పోలింగ్ శాంతియుతంగా జరిగేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు, నేటి సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి (గురువారం) సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు.





















