MLC Kavitha: 'TSPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలి' - చంద్రబాబు బాటలో సీఎం రేవంత్ నడుస్తున్నారంటూ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
BRS Mlc Kavitha Comments: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు వస్తోన్న TSPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలని డిమాండ్ చేశారు.
BRS Mlc Kavtitha Comments on CM Revanth Reddy: అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ (Congress) నేతలు అబద్ధాలు చెప్పడం మానడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మండిపడ్డారు. బంజారాహిల్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ ఎన్నడూ 'జై తెలంగాణ' అని అనలేదని.. రాష్ట్ర గీతం గురించి ఆయన మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం తనలా ఉందని సీఎం అంటున్నారని.. తాను కూడా తెలంగాణ ఆడబిడ్డనే కదా.? అని ప్రశ్నించారు. 'బీఆర్ఎస్ హయాంలో డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డిని (Mahendar Reddy) అప్పుడు రేవంత్ రెడ్డి దూషించారు. మహేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా ఆయన్ను తప్పించి, న్యాయ విచారణ కు ఆదేశించాలి. ఈ విషయమై త్వరలోనే గవర్నర్ ను కలుస్తా' అని తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఆంధ్రా వ్యక్తిని ఎలా నియమించారు.? అని నిలదీశారు. వాళ్లు తెలంగాణ యువతకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రాజకీయాలకు సంబంధమున్న వారిని కమిషన్ సభ్యులుగా నియమించబోమని సీఎం అన్నారని గుర్తు చేశారు. టీడీపీలో పని చేసిన రజని కుమారిని కమిషన్ సభ్యురాలిగా ఎలా నియమించారు.? అని అన్నారు. విద్యుత్తు సంస్థలో ఆంధ్రా అధికారుల పెత్తనమేంటని? ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసును వాదించిన న్యాయవాదులకు సీఎం అందలం ఎక్కించారని ఆరోపించారు. గురువు చంద్రబాబు బాటలో నడుస్తున్న శిష్యుడు సీఎం రేవంత్ రెడ్డి అని.. ఆయనలో పచ్చ రక్తం ప్రహిస్తోందని మండిపడ్డారు.
సింగరేణి ఉద్యోగాలపై
సింగరేణి ఉద్యోగ మేళా సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై కవిత కౌంటర్ ఇచ్చారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పోగొట్టింది కాంగ్రెస్సే అని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో 20 వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చామని.. జీఎం స్థాయిలో చేయాల్సిన పనిని సీఎం చేస్తున్నారని మండిపడ్డారు. కొత్తగా 400 ఉద్యోగాలు ఇచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తమ హయాంలో ఇచ్చినట్లుగా చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. సింగరేణిలో ఉద్యోగాల సంఖ్యను పెంచేందుకు గత బీఆర్ఎస్ సర్కారు ప్రయత్నించిందని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలోనే సింగరేణి ఉద్యోగాల్లో కోత విధించారని ఆరోపించారు.
'చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తోందా.?'
రాష్ట్రంలో కరెంట్ కోతలు మొదలయ్యాయని కవిత మండిపడ్డారు. విద్యుత్ సంస్థల్లో ఆంధ్ర వాళ్లను డైరెక్టర్లుగా ఎందుకు నియమించారని ప్రశ్నించారు.?. చంద్రబాబు డైరెక్షన్ లో తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నట్లుందని ఆరోపించారు. అర్హత లేని వ్యక్తులను సలహాదారులుగా నియమించారని.. తెలంగాణ అసెంబ్లీకి ఏపీ అడ్వైజర్ ఎందుకని నిలదీశారు. గతంలో సలహాదారులే వద్దన్న సీఎం ఇప్పుడు వారిని ఎలా నియమిస్తున్నారని నిలదీశారు. రేవంత్ రెడ్డి తరఫున ఓటుకు నోటు కేసు విచారించిన లాయర్లకు ప్రభుత్వం తరఫున జీతాలిస్తున్నారని ధ్వజమెత్తారు.