Harish Rao: 'హామీల్లో చాంతాడంత చెప్పి చెంచాడంత కేటాయించారు' - బడ్జెట్ పై హరీష్ రావు, కేటీఆర్ తీవ్ర విమర్శలు
Telangana News: తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో అబద్ధాలు చెప్పిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రైతులకు బడ్జెట్ లో రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు.
HarishRao Responds on Telangana Budget 2024: తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ లో రైతులకు మొండిచేయి చూపించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) మండిపడ్డారు. ప్రభుత్వ బడ్జెట్ పై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. డిసెంబర్ 9వ తేదీనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారని ధ్వజమెత్తారు. రుణమాఫీ కోసం రూ.40 వేల కోట్లు అవసరమని.. అయితే బడ్జెట్ లో రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. రైతులకు బడ్జెట్ లో నిధులు కేటాయించనప్పుడు పంటల బీమా, పంటల బోనస్, రైతు భరోసా వంటి పథకాలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.?. రైతులకు ఎన్నికల హామీల్లో చాంతాడంత చెప్పి బడ్జెట్ లో మాత్రం రైతులకు చెంచాడంత పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో అబద్ధాలు చెప్పి.. అసెంబ్లీ బడ్జెట్ ప్రంగంలోనూ అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు. పంటల బోనస్ కు రూ.15 వేల కోట్లు అవసరమని.. కానీ బడ్జెట్ లో కేటాయింపులు ఏమీ లేవని అన్నారు. అమలు సాధ్యం కాని హామీలిచ్చి.. ఇప్పుడు ఆలోచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారెంటీలపై చట్టం చేస్తామని చెప్పి ఇప్పుడు ఎందుకు చేయలేదని నిలదీశారు. కొండంత ఆశ చూపి గోరంత కూడా చేయని బడ్జెట్ ఇది అంటూ ఎద్దేవా చేశారు.
'2 నెలల్లోనే ఆగం చేశారు'
మాజీ సీఎం కేసీఆర్ (KCR) రైతులను రాజుగా చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల్లోనే రైతన్నను ఆగం చేసిందని హరీష్ రావు విమర్శించారు. 'కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం సీఎం ప్రతి రోజూ ప్రజా దర్బార్ నిర్వహించాల్సి ఉన్నా అలా చేయడం లేదు. బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా వంద రోజుల ప్రస్తావన లేదు. ఇళ్ల విషయంలో బడ్జెట్ లో చెప్పినట్లు అమలు కావాలంటే రూ.23 వేల కోట్లు అవసరమైతే కేవలం రూ.7 వేల కోట్లు బడ్జెట్ లో పెట్టారు. నిరుద్యోగ భృతి గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఆటో కార్మికులకు నెలవారీ భృతి, చనిపోయిన కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని కోరితే పట్టించుకోలేదు. రైతులు, నిరుద్యోగులు, మహిళలను ప్రభుత్వం మోసం చేసింది. వారు భేషరతుగా వారికి క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ అబద్ధాలు మాట్లాడి గోబెల్స్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది.' అని హరీష్ రావు మండిపడ్డారు.
కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) పెదవి విరిచారు. సికింద్రాబాద్ లో శనివారం జరిగిన సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్యారెంటీల అమలుకు రూ.1.25 లక్షల కోట్లు అవసరమైతే బడ్జెట్ లో మాత్రం కేవలం రూ.53 వేల కోట్లే కేటాయించారని విమర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపైనా విమర్శలు గుప్పించారు. ప్రతీ మీటరుకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామని అన్నారు. తెలంగాణ జల హక్కులను కృష్ణా బోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ 13న నల్గొండలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.