Kavitha: కేటీఆర్ నాయకత్వానికి కవిత నో - సీఎం పోస్టుకూ రెడీ - బీఆర్ఎస్‌లో చీలిక తప్పదా ?
BRS: బీఆర్ఎస్ నేకత కవిత ఓ టీవీ చానల్ కు ఇచ్చిన పాడ్ కాస్ట్‌లో సీఎం పోస్టుకూ రెడీ అని చెప్పారు. కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించే ప్రశ్నే లేదంటున్నారు.

BRS Leader Kavitha: భారత రాష్ట్ర సమితిలో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత కేటీఆర్ నాయకత్వాన్ని తాను అంగీకరించే ప్రశ్నే లేదని కల్వకుంట్ల కవిత స్పష్టం చేస్తున్నారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన పాడ్ కాస్ట్‌లో తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో తన పాత్ర ఉందని.. ఇక ముందు కూడా ఉంటుందని.. బీఆర్ఎస్ పార్టీ తనదని కవిత వ్యాఖ్యానించారు. కవిత చేసిన వ్యాఖ్యలు ఆమె రాజకీయ పయనం విషయంలో ఎంత స్పష్టంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
పార్టీకి దూరం చేసే కుట్ర జరుగుతోందంటున్న కవిత
తనను బీఆర్ఎస్ పార్టీకి దూరం చేసే కుట్ర జరుగుతోందని కవిత అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉంటున్న తన అనుచరుల్ని పార్టీ ఆఫీసులోకి రానివ్వడం లేదన్నారు. కవిత మనుషులకు తెలంగాణ భవన్ లో పనేమిటని ప్రశ్నిస్తున్నారని ఆమె అంటున్నారు. పార్టీలో ప్రస్తుతం తనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె నేరుగానే చెబుతున్నారు. కొత్త పార్టీ ఆలోచనల్లేవు అని బలంగా చెప్పారు కానీ.. బీఆర్ఎస్ పార్టీ తనదేనని అంటున్నారు. పార్టీలో తనకెదురైనా.. ఎదురవుతున్న పరిస్థితులు.. తండ్రి కేసీఆర్ కూడా పట్టించుకోవడం లేదని కవిత పరోక్షంగా చెప్పారు.
కేసీఆర్ కు తెలియకుండానే ఫోన్ ట్యాపింగ్
కేటీఆర్‌తో తనకు మాటలు లేవన్న విషయాన్ని అంగీకరించారు. పార్టీ విషయాలను ఇంటర్నల్‌గా మాట్లాడాలని కేటీఆర్ అంటున్నారని..తాను ఇంటర్నల్ గా మాట్లాడినవన్నీ బయటకు వస్తున్నాయన్నారు. తాను రాసిన లేఖ బయటకు ఎలా వచ్చిందని కవిత .. నేరుగా కేటీఆర్‌ను ప్రశ్నించారు. తనను పార్టీకి దూరం చేసేందుకు ఓ శక్తి బలంగా ప్రయత్నిస్తోందని కవిత అనుమానాలు వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలపై తనపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం, ట్రోల్స్ గురించి తండ్రి కేసీఆర్‌కు చెప్పానని.. ఈ ట్రోలింగ్ ను ఆపాలని కఠిన చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కవిత చెబుతున్నారు. ఫోన్ ట్యాప్ విషయంలో తన సన్నిహితులకు సిట్ అధికారులు ఫోన్లు చేసి.. వాంగ్మూలం ఇవ్వాలని కోరారన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటుంది కానీ దానికి తన తండ్రి కేసీఆర్ కు సంబంధం ఉందని అనుకోవడం లేదని.. ఆయన గొప్పవారన్నారు. సమయమే అన్నింటికీ జవాబు చెబుతుందన్నారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయన్న వ్యాఖ్యలపైనా పరోక్షంగా ఆ దెయ్యాలు ఎవరో చెప్పుకొచ్చారు.
కేటీఆర్ కు నాయకత్వం అప్పగిస్తే కవిత జాగృతిని రాజకీయ పార్టీగా చేస్తారా ?
నాయకత్వ రేసులో తాను ఉంటానని కవిత స్పష్టంగా చెబుతున్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆరే నాయకుడని ఇప్పటి వరకూ క్యాడర్ అనుకుంటున్నారు. కానీ కవిత మాత్రం తాను కూడా పోటీ పడతానని అంటున్నారు. జాగృతిని బలోపేతం చేయడం వెనుక అదే వ్యూహం ఉందని భావిస్తున్నారు. కవిత పట్టుదల చూస్తూంటే.. బీఆర్ఎస్ లో రానున్న రోజుల్లో పరిస్థితులు అంత సానుకూలంగా ఉండే పరిస్థితులు లేవని భావిస్తున్నారు.




















