(Source: Poll of Polls)
TRS Vs Congress : ఎన్నికల వరకూ పీసీసీ చీఫ్‌గా రేవంత్ ఉంటే వంద సీట్లొస్తాయి - ఈ నమ్మకం కాంగ్రెస్‌ది కాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేది!
పీసీసీ చీఫ్‌గా రేవంతే ఉంటే తమకు వంద సీట్లు వస్తాయని బీఆర్ఎస్ నమ్మకంగా ఉంది. ఇదో రకం మైండ్ గేమ్ అని కాంగ్రెస్ నేతలంటున్నారు.
TRS Vs Congress : రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రేసులోకి వచ్చిందని.. ఆ పార్టీ నేతలు సంబర పడుతున్నారు . బీజేపీ వెనక్కి వెళ్లిపోయిందని.. తాము బలపడ్డామని అనుకుంటున్నారు. వారు అలా అనుకోవడం కామనే. ఎందుకంటే పీసీసీ చీఫ్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాబట్టి. విచిత్రంగా బీఆర్ఎస్ నేతలు కూడా అదే అనుకుంటున్నారు. ఎన్నికల వరకూ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉండాలని కోరుకుంటున్నారు. ఆయనే ఉంటే బీఆర్ఎస్ కు వంద సీట్లు వస్తాయని అనుకుంటున్నారు.రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నర్సాపూర్ లో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ దూకుడుతో తమకు బలం అనుకుంటున్న బీఆర్ఎస్
రేవంత్ రెడ్డి దూకుడుగా ఉంటారు. ఈ దూకుడులో ఆయన చేస్తున్న వ్యాఖ్యలను వివాదాస్పదం చేయడంలో బీఆర్ఎస్ విజయవంతం అవుతోంది. మూడు గంటలు మోటార్ ఆడిస్తే మూడు ఎకరాలకు నీరు సరిపోతాయని.. ఎనిమిది గంటల కరెంట్ రైతులకు సరిపోతుందని అమెరికాలో రేవంత్ అన్న మాటల్ని బీఆర్ఎస్ అతి పెద్ద వివాదం చేసింది. రైతులెవరూ కాంగ్రెస్ కు ఓటు వేయకుండా .. కాంగ్రెస్ వస్తే మూడు గంటల విద్యుత్ మాత్రమే ఉంటుందన్న ప్రచారం జోరుగా చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ కు డ్యామేజ్ చేస్తుందని.. బీఆర్ఎస్‌కు మేలు చేస్తుందన్న అబిప్రాయంతో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కూడా అదే చెబుతున్నారని అంటున్నారు.
రేవంత్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌లో బలమైన వర్గం !
మరో వైపు కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్‌కు వ్యతిరేకంగా బలమైన వర్గం ఉంది. సీనియర్లు ఆయన తీరును వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం పుంజుకోలేదని.. కానీ పుంజుకున్న పార్టీకి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వల్ల నష్టం చేకూరుతోందని... హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా.. రేవంత్ రెడ్డి తమ పరిస్థితి మెరుగ్గా ఉంటుందని.. ఎక్కువ సీట్లు వస్తాయన్న సందేశాన్ని రాజకీయవర్గాలకు పంపుతూండటంతో.. రేవంత్ రెడ్డిని హైకమాండ్ తొలగింపచేసేలా రివర్స్ వ్యూహం పన్నుతున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.
బండి సంజయ్ లాగే.. రేవంత్ నూ టార్గెట్ చేశారా ?
ప్రత్యర్థి పార్టీ నేత అన్న మాటల్ని పట్టుకుని.. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం ద్వారానే.. రేవంత్ అంటే.. ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే కాంగ్రెస్ ఎన్నికలు ఎదుర్కోబోతోందని. తెలిసే.. బండి సంజయ్ విషయంలో చేసినట్లుగానే రేవంత్ నూ కార్నర్ చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని అంటున్నారు. మొత్తంగా తెలంగాణ రాజకీయాలు భిన్నంగా మారుతున్నాయి. ఎవరి ఎవరిపై ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది.