TSPSC Paper Leak: "టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై వెంటనే సీబీఐ విచారణ చేపట్టాలి"
TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై వెంటనే సీబీఐ విచారణ చేపట్టాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి డిమాండ్ చేశారు.
TSPSC Paper Leak: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం యువత రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సుహాసిని రెడ్డి అన్నారు. పేపర్ లీకేజీ ఘటన పై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా నిరుద్యోగ యువతతో కలిసి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పాత జాతీయ రహదారి పై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్బంగా సుహాసిని రెడ్డి మాట్లాడుతూ... ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. జరిగిన పలు పరీక్షల్లో లీకేజీ వ్యవహారం వల్ల నిర్యుదోగులు అయోమయానికి గురవుతున్నారని అన్నారు. ఈ వ్యవహారం పై ప్రభుత్వం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోందని, దీనిపై కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని కోరారు. అలాగే ఈ వ్యవహారంపై సీబీఐ ద్వారా విచారణ చేపట్టి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పేపర్ లీకులకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగులు ఒక్కొక్కరికి 2 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో వల్ల ఆదిలాబాద్ పట్టణంలో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు రాస్తారోకో చేస్తున్న నాయకులను అరెస్ట్ చేసి మావల పోలీస్ స్టేషన్ కి తరలించారు.
ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ రాజశేఖర్ భార్య పిటిషన్
టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసును సీబీఐకి ఇవ్వాలన్న డిమాండ్ తో హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు నిందితుడు రాజశేఖర్ సతీమణి సుచరిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును సీబీఐతో విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో సుచరిత కోరారు. తన భర్తపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని ... ఇప్పటివరకు జరిపిన విచారణను వీడియోలో చూపించాలని కోరారు. ప్రతివాదులుగా డిజిపి, చీఫ్ సెక్రటరీ ,సిట్ , హైదరాబాద్ సిటీ డిసిపి సెంట్రల్ జోన్లను సుచరిత పేర్కొన్నారు. సుచరిత పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. అభ్యంతరాలు ఉంటే సంబంధిత కోర్ట్ ను ఆశ్రయించవచ్ని...సూచించింది.
పేపర్ లీకేజీ కేసు విచారణ సందర్భంగా ప్రొసీజర్ ఫాలో అవుతున్నామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. మరో వైపు ఈ కేసులో సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత బల్మూరు వెంకట్ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పేపర్ లీకేజ్ కేసులో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి పాత్రపై దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు NSUI తెలంగాణ అధ్యక్షుడు బల్మూర్ వెంకట్. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. బల్మూర్ వెంకట్ తో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు పిటిషన్ వేశారు. గ్రూప్ 1 పేపర్ లో ఒకే జిల్లాకు చెందిన 20 మందికి అధిక మార్కులు రావడం అనుమానంగా ఉందని బల్మూర్ వెంకట్ పేర్కొన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో చేసిన వాఖ్యలు కూడా అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇద్దరి పాత్ర మాత్రమే ఉందన్న కేటీఆర్ వాఖ్యలు విచారణను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని బల్మూర్ వెంకట్ పిటిషన్‌లో తెలిపారు. సిట్ దర్యాప్తును ప్రభుత్వం ప్రభావితం చేస్తుందనే అనుమానాలు ఉన్నాయన్నారు. కాగా, మార్చి 21న మంగళవారం పిటిషన్ తరపు వాదనలు వినిపించునున్నారు నేషనల్ కాంగ్రెస్ లీగల్ సెల్ ప్రసిడెంట్ వివేక్ ధన్కా. తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్ పై మార్చి 21న విచారణ జరుపనుంది.