Bandi Sanjay About KCR: టీఆర్ఎస్‌లో చాలా మంది ఏక్‌నాథ్ షిండేలు - బాంబు పేల్చిన బండి సంజయ్ !
Bandi Sanjay Slams CM KCR: టీఆర్ఎస్‌లో చాలా మంది ఏక్‌నాథ్ షిండేలు ఉన్నారని, అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ మాటిమాటికి ఆ పేరు ప్రస్తావించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
జీడిగింజ జీడిగింజ... సిగ్గులేదా? అంటే నల్లగున్న నాకెందుకు సిగ్గు అని అన్నదంట. తెలంగాణ సీఎం కేసీఆర్ సంగతి కూడా అట్లనే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. బీజేపీపై కామెంట్లు చేసే ముందు 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని గుర్తించుకోవాలని, నీ లెక్క తాగి ఫాంహౌస్‌లో పడుకున్నమనుకుంటున్నవా? అంటూ మండిపడ్డారు. కేసీఆర్‌లో ఓటమి భయం మొదలైందని, ఆయన ముఖంలో అది స్పష్టంగా కనిపిస్తుందన్నారు. తెలంగాణ మొత్తం వరదలతో మునిగిపోతోందని.. గంలో రాష్ట్రాన్ని ఇస్తాంబుల్, లండన్, న్యూయార్క్ చేస్త అన్నవ్ కదా.. ఏమైంది, జనం నిలదీస్తారని బయపడి దారి మళ్లించే మాటలు మాట్లాడుతున్నారా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. టీఆర్ఎస్‌లో చాలా మంది ఏక్‌నాథ్ షిండేలు ఉన్నారని, అందుకే కేసీఆర్ మాటిమాటికి ఆ పేరు ప్రస్తావించారని బండి సంజయ్ అన్నారు.
ప్రజలు కష్టాల్లో ఉంటే బయటకు రావు
సీఎం స్థాయి వ్యక్తి సోయి లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. ప్రజలు కష్టాల్లో ఉంటే బయటకు రావు. రైతులు నష్టపోతే బయటకు రావు. నిరుద్యోగులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే బయటకు రాని నువ్వు దేశ్ కీ నేతనా అంటూ ఎద్దేవా చేశారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాళ్లు నోరు తెరిచేలోపు పరిస్థితిని పక్కదారి పట్టించేందుకు ప్రధాని నరేంద్ర మోదీపై, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లపై కేసీఆర్ నీచమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇక్కడ అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతుంటే నిందితులను పట్టుకోలేని నువ్వా ప్రధాని, యూపీ సీఎంల గురించి మాట్లాడేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేయాలంటే భయపడే స్థాయికి యూపీని తీసుకొచ్చిన యోగి గురించి మాట్లాడే స్థాయి కేసీఆర్‌కు లేదన్నారు.
నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా..
దేశ్ కా నేత అని చెప్పుకుంటున్న కేసీఆర్‌కు.. ప్రధాని మోదీతో పోల్చితే నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. మోదీ రోజుకు 18 గంటలు పనిచేస్తే.. .నువ్వు ఫాంహౌజ్ నుండి బయటకే రావు. ప్రజలు నిన్ను నీ కుటుంబాన్ని విసిరిపడేసే రోజులు దగ్గరపడుతున్నయ్. మోదీ విదేశాలు తిరిగి దేశాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతుంటే నువ్వేం చేస్తున్నవ్. ఫాంహౌజ్ లో పడుకుని ఏ సీసాలో ఏ బ్రాండ్ మందు ఉందో తాగి పండుకుంటున్నవ్. నీ బోడి ప్రభుత్వంలో ఉండటం అవసరమా? అని నీ పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు. ఈయన ఆర్ధిక పరిస్థితి మాట్లాడుతున్నడు. కరోనాతో ప్రపంచ దేశాలన్నీ తల్లడిల్లుపోతుంటే.. దేశాన్ని ఆర్దికంగా పటిష్టంగా ఉంచిన ఘనత మోదీ సొంతం. కేసీఆర్ మాత్రం తెలంగాణ ప్రజలను బిచ్చగాళ్లను చేస్తున్నారు.
దమ్ముంటే వీటిపై మాట్లాడు..
‘దేశంలోని ప్రాజెక్టుల గురించి మాట్లాడతవా? నెట్టెంపాడు, కోయిల్ సాగర్, డిండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల గురించి మాట్లాడు దమ్ముంటే.. ఆర్డీఎస్ గురించి మాట్లాడు. కేసీఆర్ వంద సార్లు ఏక్ నాథ్ షిండే పేరు ప్రస్తావిస్తుండు. నీ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు ఉన్నరని తెలిసి భయపడుతున్నడు. అందుకే టెన్షన్ పడి తెల్లారి లేస్తే షిండే గురించి మాట్లాడుతున్నడు. ఉంటదో పోతదో తెల్వని ప్రభుత్వం మీది. మంచి పార్టీలోకి పోవాలని నీ పార్టీలోని ఏక్ నాథ్ షిండేలు ఆలోచిస్తున్నరని తెలిసి ఆ పేరే తీస్తున్నవ్. దళితులకు సీఎం పదవి ఎందుకు ఇవ్వలేదు? రుణమాఫీ ఏమైంది? దళితులకు పది లక్షల సంగతేమైంది? ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు? నీ పాలనలో రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నరు? ముందు వీటికి సమాధానం చెప్పు?. గతంలో మోదీని ఎట్ల పొగిడినవో చూడంటూ’ ఓ వీడియోను ప్రదర్శించిన బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ తీరును ఎండగట్టారు.
వాళ్ల ఆస్తులు అటాచ్..
‘విజయ్ మాల్యా, నీరవ్ మోదీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన సంగతి మర్చిపోయినవా. 19 వేల 111 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 15 వేల 114 కోట్లను వాళ్లు ఆల్రెడీ చెల్లించారు. ఇంకా డబ్బులు కడతాం. అరెస్ట్ చేయొద్దని దండం పెడుతూ బతిమాలుతున్న సంగతి గుర్తుంచుకో. కేసీఆర్ కు మోదీ అంటే భయం. ఆయన వస్తున్నడంటేనే గజగజ వణికిపోతున్నవ్.
తెలంగాణ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి చేతగాక.. దేశం గురించి మాట్లాడుతున్నావు. దేశాన్ని ముందుకు నడుపుతున్న మోదీ గురించి మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు నిన్ను చూసి నవ్వుకుంటున్నరు. నువ్వు నిర్వహిస్తున్న సర్వేల్లోనే నీ పార్టీ మొత్తం ఓడిపోతుందని తేలింది. సిగ్గు లేకుండా చైనా, పాకిస్తాన్, శ్రీలంకను పొగుడుతవా? దేశమ్మీద సీఎంకు అంత కక్ష ఎందుకు? కేసీఆర్‌కు డీఎన్ఏ టెస్ట్ చేయించాలి’ అన్నారు బండి సంజయ్.
అన్ని ఛార్జీలు పెంచావ్..
‘కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్, 200 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు, స్వచ్చ భారత్ వంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. కానీ నీకు మోదీని చూస్తేనే కరోనా వస్తది. నీ మాటలను ఎవరూ నమ్మరు. నువ్వు అన్ని రకాల ఛార్జీలు పెంచినవ్. కరెంట్ ఛార్జీలను 100 శాతం పెంచినవ్. ఆర్టీసీ ఛార్జీలను ఐదుసార్లు పెంచినవ్. ఇప్పటికీ ఉద్యోగులకు సక్కగ జీతాలివ్వడం లేదు? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోకుండా పంజాబ్ పోయి ఇక్కడి జనం సొమ్మును అక్కడ పంచేశావ్. ఇప్పటినుంచైనా కేసీఆర్ హద్దుల్లో ఉండాలి. ఆ పార్టీలో ఏక్‌నాథ్ షిండేలున్నరు. లక్ష్మణ్ గురించి మాట్లాడతవా? ఆయనకు రాజ్యసభ సీటిస్తే నీకెందుకు కళ్లమంట. నీ కుటుంబ అవినీతిని తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అందుకే ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తున్నారని’ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Also Read: CM KCR : అసెంబ్లీ రద్దు చేస్తా, ఎన్నికల తేదీ ఖరారు చేసే దమ్ముందా? - సీఎం కేసీఆర్