Eetela Rajendar: 'బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకూ వారే సీఎం' - కేసీఆర్ పార్టీలో కన్నీళ్లు పెట్టుకున్నానన్న ఈటల
Eetela Rajendar: తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం చేతిలో చిక్కుకుందని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. సీఎం కేసీఆర్ మాయ మాటలతో దళితులను మోసం చేశారని మండిపడ్డారు.
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకూ కల్వకుంట్ల కుటుంబంలోని వ్యక్తే సీఎం అవుతారని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. ఇతర వర్గాలకు చెందిన వ్యక్తిని సీఎం కానివ్వరని మండిపడ్డారు. చివరకు పార్టీ అధ్యక్ష పదవుల్లోనూ వారి కుటుంబం సభ్యులే ఉన్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పార్టీలో ఉన్నంత కాలం తాను వివక్షకు గురయ్యానని ఈటల చెప్పారు. బడుగులకు అధికారం రాకుండా సీఎం కేసీఆర్ మోసం చేశారని, బీసీలంటే ఆయనకు చిన్నచూపని మండిపడ్డారు.
'ఆ ఒక్క కుటుంబంలోనే వెలుగు'
'ప్రత్యేక రాష్ట్రం వస్తే బడుగులకు అధికారం, జీవితాల్లో వెలుగు వస్తుందన్నారు. కానీ, ఒక్క కేసీఆర్ కుటుంబంలో మాత్రమే వెలుగు వచ్చింది. ఇతర రాష్ట్రాల బీఆర్ఎస్ ఇంఛార్జీలు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులే ఉంటారు. ఇతర వర్గం వారికి అవకాశం ఇవ్వరు. రాజ్యాధికారంలో భాగం ఇస్తామని ఎస్సీలను మోసగించారు. బీసీల పట్ల బీఆర్ఎస్ కు చులకన భావం, చిన్నచూపు ఉంది. దేశానికి ఓబీసీ ప్రధానిని అందించిన ఘనత బీజేపీదే. గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేసిన ఘనత సైతం బీజేపీదే. కేంద్రంలో 70 శాతానికి పైగా అణగారిన వర్గాలకు చోటు దక్కింది.' అని ఈటల తెలిపారు.
కాంగ్రెస్ పైనా విమర్శలు
తెలంగాణలో అణగారిన వర్గాలను కాంగ్రెస్ పార్టీ సైతం చిన్నచూపు చూసిందని ఈటల విమర్శించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు ఎంతమందికి టికెట్లు ఇచ్చారో చూశామని, బీజేపీ మాత్రం బీసీలకు 40 టికెట్లను కేటాయించబోతుందని తెలిపారు. కాబట్టి, బీజేపీకి మద్దతిచ్చి గెలిపించాలని తెలంగాణ సమాజాన్ని కోరుతున్నట్లు ఈటల కోరారు.
'బీజేపీని గెలిపిస్తే బీసీ అభ్యర్థే సీఎం'
కాంగ్రెస్ పార్టీ బీసీలను దగా చేసిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు. 'ఎస్సీని సీఎంను చేస్తానని చెప్పి బీఆర్ఎస్ మోసం చేసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలూ ఎస్సీలను దగా చేశాయి. బీజేపీ తొలిసారి బీసీని సీఎంగా ప్రకటించింది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే బీసీ అభ్యర్థి సీఎం అవుతారు.' అని అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలనకు ప్రజలు స్వస్తి పలకాలని, అవినీతి రహిత పాలన కోసం బీజేపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
Also Read: తెలంగాణలో టీడీపీ పోటీపై ఆదివారం కీలక నిర్ణయం - చంద్రబాబుతో ములాఖత్ తర్వాత కాసాని కీలక వ్యాఖ్యలు !