Bandi Sanjay : విలీన చర్చలు ఫేక్ న్యూస్ - కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం - బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Telangna : కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి ఖచ్చితంగా జైలుకు పంపుతారని బీజేపీ నేత బండి సంజయ్ నమ్మకం వ్యక్తం చేశారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
Telangana Politics : కేటీఆర్ ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉందని.. తనతో సహా బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ హింసించిన, జైల్లో వేసిన తీరును ఎవరూ మర్చిపోలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పై నమ్మకం పోయిన రోజు నుండి కాంగ్రెస్ తో జరగబోయేది యుద్దమేనని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైనా బీజేపీ ధాటికి తట్టుకోలేనంతగా యుద్దం చేస్తామని ప్రకటించారు.
బీఆర్ఎస్ తో బీజేపీ చర్చలు ఫేక్ న్యూస్
బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అని ఆ పార్టీతో పొత్తు లేదా విలీనం చర్చలు జరుగుతున్నాయని జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని బండి సంజయ్ స్పష్టం చేశారు. కవిత బెయిల్ కు, బీజేపీకి ఏం సంబంధమని .. సిసోడియాకు బెయిల్ వస్తే... బీజేపీకి సంబంధముందా అని ప్రశ్నించారు. కోర్టు విషయాలను పార్టీతో ముడిపెట్డడం సరికాదన్నారు. నిజాయితీగా పనిచేసే ఐఏఎస్ లకూ నేటికీ పోస్టింగ్ ఇవ్వడం లేదు.. బీఆర్ఎస్ కు కొమ్ముకాసిన ఐఏఎస్ లకే మళ్లీ మంచి పోస్టింగులిస్తున్నారని.. కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు తేడా లేకుండా పోయిందన్నారు. అతి తక్కువ టైంలో ప్రజా వ్యతిరేకత చురగొన్న ఏకైక పార్టీ కాంగ్రెస్సేనన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. పంచాయతీలకు నిధులిచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు కూడా ప్రోత్సహక నిధులివ్వడం లేదని.. కేంద్ర నిధులతోనే పంచాయతీలు నడుస్తున్నాయన్నారు. మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ, జడ్పీటీసీలే మా బ్రాండ్ అంబాసిడర్లని.. ఏ పార్టీ గెలిస్తే పంచాయతీలు అభివ్రుద్ధి అవుతాయనే గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలని పిలుపునిచ్చారు. పంచాయతీలకు కేంద్రమే నిధులిస్తోందని హరీష్ రావు ఇప్పటికైనా చెప్పడం శుభ పరిణామమన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొనుగోలు దందా బాధ్యతను కాంగ్రెస్ నేతకు అప్పగించిందన్నారు. అయితే తమ్ముడి కోసమే రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లారనడం సరికాదని.. రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు హుందాగా వ్యవహరించాలని బీఆర్ఎస్‌కు సలహాలిచ్చారు.
ఐదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందా ?
కాంగ్రెస్ లో లుకలుకలు మొదలయ్యాయని.. ఇతర పార్టీలను చీల్చి లాభం పొందాలనే ఆలోచన బీజేపీకి లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు ప్రజలు ఐదేళ్ల తీర్పు ఇచ్చారు.. ఐదేళ్లు అధికారాన్ని ఉంచుకుంటారా? వదులుకుంటారా? అనేది ప్రభుత్వ తీరుపై ఆధారపడి ఉందన్నారు. వక్ఫ్ బోర్డు వివాదంపైనా స్పందించారు. అసదుద్దీన్ ఒవైసీ.. ఎన్ని వక్ప్ బోర్డు భూములను కాపాడారో సమాధానం చెప్పాలన్నారు. ఒకచోట ఊరు ఊరంతా వక్ఫ్ బోర్డు భూములేనని చెప్పడం ఎంత వరకు న్యాయమని.. వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి ఎంత మంది పేద ముస్లింలకు ఇచ్చారో చెప్పగలరా అని ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డు భూములను కాంగ్రెస్, ఎంఐఎం నేతలు చాలా చోట్ల కబ్జా చేశారని.. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందితే... వాస్తవాలన్నీ బయటకు వస్తాయన్నారు. హైకమాండ్ ఎవర్నిబీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమిస్తే వారి నేతృత్వంలో పని చేస్తామన్నారు.