Bhatti Vikramarka: ఎన్నికల కోడ్ ముగియగానే ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
Telangana News: ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ లేనే లేదని, ఉన్నది కాంగ్రెస్ అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోస్తామన్నారు.
Indiramma Housing Scheme | మధిర: బీఆర్ఎస్ కు వేసే ఓటు వృథా అని, ఆ పార్టీ అక్కడ లేదు, ఇక్కడ లేదు కానీ గులాబీ శ్రేణులు ఓట్లు ఎందుకు అడుగుతున్నారు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికలు మనందరి భవిష్యత్తుకు సంబంధించినవని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. ఇది చాలా చిన్నదిగానే కనిపించొచ్చు... కానీ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడితే మన ప్రాథమిక హక్కులు కోల్పోతాం అన్నారు. రేపు ప్రజాస్వామ్యం లేకపోతే నాయకులు గ్రామాలకు రారు, ఓట్లు అడగరు, నియంత పాలన కొనసాగుతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే ఇందిరమ్మ ఇళ్ళకు ముగ్గులు పోస్తామన్నారు.
మధిర నియోజకవర్గము చింతకాని మండల కేంద్రం కార్నర్ మీటింగ్ లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని అన్నారు. దేశ సంపద, వనరులు ఈ ప్రాంతం వారికే చెందాలనే లక్ష్యంతో రాహుల్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని పేర్కొన్నారు. దేశ సంపదను ప్రధాని మోదీ తన మిత్రులైన అంబానీ, అదానీ, బడా వ్యాపారులకు దోచి పెడతుంటే చూస్తూ ఊరుకోమన్నారు.
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ..
మన దేశానికి స్వాతంత్రం తెచ్చింది, రాజ్యాంగాన్ని నిర్మించింది, రిజర్వేషన్లు తెచ్చింది, బ్యాంకుల జాతీయకరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలే అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలంటే, మన దేశ ఆస్తులు, వనరులు రక్షించుకోవాలంటే ఎంపీ అభ్యర్థి రఘురామిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య హోరాహోరీ ఉండేది. ఇప్పుడు మూడు పార్టీలు ఏకమయ్యాయి, తెలుగు తమ్ముళ్లు మద్దతు సైతం ఉందన్నారు. ఖమ్మం జిల్లాలో మరో పార్టీ లేదన్నారు. ఎన్నికల్లో అన్ని ఓట్లు ఏకపక్షంగా కాంగ్రెస్ అభ్యర్థికి పడాలన్నారు.
గత పాలకుల్లాగ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర సంపాదన దోచుకోవడం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర సంపదను దోచుకుని అమెరికా, సింగపూర్ లో పెట్టుబడులు పెట్టారని విమర్శించారు. రాష్ట్ర సంపద ప్రజలకే చెందాలని, వారి జీవితాలు బాగుపడాలని ఇందిరమ్మ రాజ్యం కోరుకుంటుందన్నారు.
హామీలు నెరవేర్చాం..
ఎన్నికల ముందు తాము ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచడం, 500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అమలు చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ముగియగానే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోస్తారని శుభవార్త చెప్పారు. గత ప్రభుత్వంలో ఆసరా పింఛన్లు 20వ తేదీన వచ్చేవని, కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయూత పెన్షన్లు మొదటి వారంలోనే వృద్ధులు, వికలాంగుల బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నట్లు చెప్పారు.
రైతుల ప్రభుత్వం కాంగ్రెస్..
కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలోనే రైతులు బాగుపడ్డారని.. నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, ఎస్సారెస్పీ, కోయిల్ సాగర్, కడెం, దేవాదుల ఎత్తిపోతల పథకాలను నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వాలు అని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. కేసీఆర్ మాటలు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ సర్కార్ కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు కుప్ప కూలిందని, లక్ష కోట్ల ప్రజల సొమ్ము నీళ్ల పాలు అయిందన్నారు. రైతులకు విత్తనాల పంపిణీ, వారికి నష్టపరిహారం కూడా చెల్లించి ఆదుకున్నట్లు తెలిపారు.
బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు కట్
కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రిజర్వేషన్లు పోతాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుల గణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం దేశ సంపదను పంచుతామని రాహుల్ చెప్పారు. కుల గణనకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు గుర్తుచేశారు. ఈ విషయాలు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే కేసులు పెట్టి ఢిల్లీ తీసుకుపోతామన్నారని చెప్పారు. రేవంత్ ని ఢిల్లీకి తీసుకుపోతామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.