Breaking News Live: సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సమ్మె నోటీసులు ఇస్తాం.. పీఆర్సీ సాధన సమితి
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
LIVE
Background
తెలుగు రాష్ట్రాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అకాల వర్షాల ప్రభావంతో చలి తీవ్రత బాగా పెరిగిందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో ఈశాన్య రుతుపవనాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు వాయువ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు ఏపీలో వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో నేటి నుంచి మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోనూ నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో కొన్ని చోట్ల వాతావరణం పొడిగా మారుతుంది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏపీలో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. అయితే మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఎలాంటి సమస్య ఉండదని అధికారులు సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, యానాం, (పుదుచ్చేరి)లలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. అకాల వర్షాలు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యల్పంగా జంగమేశ్వరపురంలో 17 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నంలో 19.4 డిగ్రీలు, నందిగామలో కనిష్ట ఉష్ణోగ్రత 19.5 డిగ్రీల మేరకు పడిపోవడంతో చలి తీవ్రత అధికమైంది.
తెలంగాణలో వర్షాలు..
ఉత్తర దిశ నుంచి గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత అధికమైంది. తెలంగాణలో మళ్లీ అకాల వర్షాలు కురవనున్నాయి. తెలంగాణను దట్టమైన మేఘాలు కమ్మేస్తున్నాయి. నేటి నుంచి రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కనిష్ట ఉష్ణోగ్రత 15 ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 33.5 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు దిగొచ్చాయి. బంగార ధర వరుసగా మూడో రోజులు పెరిగింది, నేడు మళ్లీ పతనమైంది. మరోవైపు వెండి ధర కూడా పసిడి బాటలో నడుస్తూ దిగొచ్చింది. తాజాగా హైదరాబాద్‌లో రూ.150 మేర పతనం కావడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,500 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.49,640గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.300 మేర తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.69,000 అయింది.
ఏపీ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,650 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.45,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. వెండి 1 కిలోగ్రాము ధర రూ.69,000కు పతనమైంది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్‌లో బంగారం ధర నేడు క్షీణించింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,500.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్‌లో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ తొలి నుంచి ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద నిలకడగా ఉన్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర 22 పైసలు తగ్గగా లీటర్ ధర రూ.107.69 కాగా, డీజిల్‌పై 20 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.94.34 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.107.91 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.94.34గా ఉంది. కరీంనగర్ లో పెట్రోల్ ధర 32 పైసలు తగ్గి, నేడు లీటర్ ధర రూ.108.25 అయింది. 30 పైసలు తగ్గడంతో డీజిల్ ధర రూ.94.65 వద్ద నిలకడగా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో పెట్రోల్‌పై 10 పైసలు పెరిగి లీటర్ ధర రూ.110.61 అయింది. ఇక్కడ డీజిల్ పై 9 పెరగడంతో లీటర్ ధర రూ.96.68 అయింది. అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర 4 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.109.40 అయింది. డీజిల్ పై 4 పైసలు పెరగడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.95.51 కు చేరింది.
శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనం చేసుకోవాలంటే ఇక నుంచి ఆన్ లైన్ బుకింగ్ టికెట్ తప్పనిసరి చేసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి శానిటైజర్ వాడుతూ ఆలయ క్యూలైన్ల నుంచి భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకోవాలని శ్రీశైలం దేవస్థానం ఈఓ లవన్న భక్తులకు సూచించారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు దర్శనం వేళల్లో సామాజిక దూరం (Social Distancing) పాటిస్తూ కరోనా వ్యాప్తి నివారణకు అందరు సహకరించాలని ఈఓ కోరారు.
ములుగు రామలింగేశ్వర స్వామి ఇకలేరు
శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో దాదాపు రెండు శతాబ్దాలుగా ఆస్థాన సిద్ధాంతిగా ఉన్న ములుగు రామలింగేశ్వర స్వామి ఇకలేరు. ఆదివారం సాయంత్రం గుండెపోటుతో చనిపోయారు. ఆలయ ఈవో పెద్దిరాజు, పలువురు ప్రజా ప్రతినిధులు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ములుగు రామలింగేశ్వర స్వామి పంచాంగం అంటే చాలా మందికి నమ్మకం ఉండేది.
సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సమ్మె నోటీసులు ఇస్తాం..
ప్రభుత్వంపై తాము యుద్ధం ప్రకటించలేదని పీఆర్సీ సాధన సమితి స్పష్టం చేసింది. స్టీరింగ్ కమిటీ భేటీ అనంతరం సంఘం నేతలు మీడియాతో మాట్లాడారు. ఉద్యమ కార్యాచరణలో పార్టీలను ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. ఉద్యమం అంటే.. ప్రభుత్వానికి నిరసన తెలిపే కార్యక్రమని.. ప్రభుత్వ వైఖరి తీవ్ర ఆవేదన కలిగిస్తోందని చెప్పారు. రేపు మధ్యాహ్నం 3 గం.కు సమ్మె నోటీసు ఇస్తామని వెల్లడించారు. స్టీరింగ్ కమిటీ సభ్యులను 12 నుంచి 20 మందికి పెంచామని తెలిపారు.
కరోనా బారిన పడిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
అందరిని పలకరించినట్లే కరోనా నన్ను కూడా పలకరించిందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రకటించారు. తనకు కూడ పాజిటివ్ వచ్చిందని చెప్పేందుకు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించడం తో డాక్టర్ల సలహ మేరకు కోవిడ్ టెస్ట్ చేయించుకోగా నాకు పాజిటివ్ గా నిర్దారణ అయింది. నాతో పాటు నా వ్యక్తిగత సహయకుడు అర్జున్ కి కూడ పాజిటివ్ వచ్చిందని చెప్పారు.
కర్నూలు: బైక్ వెనుక చక్రంలో ఇరుక్కుని మూడు నెలల పసికందు మృతి
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ఎర్రదొడ్డిలో విషాదం చోటుచేసుకుంది. మోటర్ బైక్ వెనుక చక్రంలో ఇరుక్కుని మూడు నెలల పసికందు మృతిచెందాడు. బాలుడికి చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు వెళ్లి ఇంటికి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. ఇంటి సమీపంలో తల్లి ఒడి నుంచి జారి చక్రంలో పసికందు ఇరుకున్నాడని సమాచారం.
హెల్మెట్ పెట్టుకోలేదు అన్నందుకు కానిస్టేబుల్‌పై యువకుడి దాడి
కరీంనగర్: హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్నావ్... అన్న పాపానికి ఓ వ్యక్తి కానిస్టేబుల్ని చితకబాదిన సంఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. నగరంలోని కలెక్టరేట్ సమీపంలో ఓ వ్యక్తి పోలీస్ వాహనంపై ప్రయాణిస్తుండగా... మరో కానిస్టేబుల్ హెల్మెట్ పెట్టుకోకుండా ఎందుకు ప్రయాణిస్తున్నావంటూ ప్రశ్నించాడు. నా ఇష్టం నీవెవరు చెప్పడానికంటూ సదరు యువకుడు పోలీస్ కానిస్టేబుల్ పై దాడికి దిగాడు. చుట్టుపక్కల వాళ్లంతా కలిసి ఆపిన కూడా ఆగకుండా కానిస్టేబుల్ ను ఇష్టం వచ్చినట్లు తిడుతూ బెదిరింపులకు దిగాడు. దీంతో అక్కడున్న ప్రజలంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇరువురిని పట్టుకుని పక్కకు తీసుకెళ్లారు. చివరకు పోలీసులు అక్కడకు చేరుకుని గొడవను ఆపివేయగలిగారు. దాడి చేసిన వ్యక్తి ఓ పోలీసు అధికారి కుటుంబానికి చెందిన వ్యక్తిగా స్థానికులు చెపుతున్నారు.