Breaking News Live: మంత్రి హరీశ్ రావుకు వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలు
ఏపీ, తెలంగాణ సహా అంతర్జాతీయంగా నేడు జరిగే బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
కామారెడ్డి జిల్లాలో నేడు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించనున్నారు. బీబీపేట మండల కేంద్రంలో నిర్మించిన ప్రభుత్వ స్కూలును, డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం కామారెడ్డి పట్టణంలోని కర్షక్ బీఈడీ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరవుతారు.
Also Read: గంటసేపు కేసీఆర్ అబద్ధాలు.. అవన్నీ నిజమని తేల్చు, నేనే ముక్కు నేలకు రాస్తా: బండి సంజయ్
ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జిల్లాల్లో అధికారిక కార్యక్రమాలతో పాటు, పార్టీ కార్యక్రమాలకు సీఎం హాజరవుతారు. వరంగల్ దక్షిణ భాగంలో ఔటర్ రింగ్‌రోడ్డు, వరంగల్ జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు, వరంగల్, హన్మకొండ జంట నగరాల రవాణా, అభివృద్ధికి అవరోధంగా ఉన్న రైల్వేట్రాక్‌ల మీద రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, తదితర అంశాలపై సమీక్ష జరుపుతారు.
Also Read: అది ఫామ్ హౌస్ కాదు.. ఫార్మర్ హౌస్.. సీదా ఒక్కటే అడుగుతానా వడ్లు కొంటరా? కొనరా?
విశాఖలో ఘోర ప్రమాదం
విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటి జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కొక్కిరాపల్లిలో చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కసింకోట మండలం పల్లపు సోమవరం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. సోమవారం అర్ధరాత్రి యలమంచిలిలో తీర్థ మహోత్సవానికి హాజరై ఇంటికి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
పిల్లల ఆస్పత్రిలో ఘోర ప్రమాదం
మధ్యప్రదేశ్ భోపాల్‌లోని కమల నెహ్రూ ఆస్పత్రి పిల్లల వార్డులో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. వార్డులో 40 మంది చిన్నారులు ఉండగా అందులో 36 మంది క్షేమంగా ఉన్నారని రాష్ట్ర మంత్రి ఒకరు తెలిపారు. మృతుల తల్లిదండ్రులకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఆయన ప్రకటించారు. 12 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు శ్రమిస్తున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న రాష్ట్ర మంత్రి విశ్వాస్ సారంగ్.. ఆస్పత్రికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Also Read: యునెస్కో క్రియేటివ్ సిటీస్ జాబితాలో శ్రీనగర్.. క్రాఫ్ట్స్, జానపద కళల కేటగిరీలో స్థానం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మంత్రి హరీశ్ రావు వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలు
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు సీఎం కేసీఆర్ మరో శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈటల రాజేందర్ తొలగించాక వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు సీఎం కేసీఆర్ చూశారు. తాజాగా ఈ శాఖను హరీశ్ రావుకు అప్పగించారు.
కాలువలో పడి ఐదేళ్ల బాలుడు మృతి
కళ్లముందు ఆటలాడుకుంటు తిరిగే ఐదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడి మృతి చెందడంతో తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం గాడిమొగలో విషాదం నెలకొంది. అల్లారుముద్దుగా పెంచుకునే ఐదేళ్ల బాలుడు చెక్కా నరేంద్ర ప్రమాదంలో మృతి చెందటంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చెక్కా గంగాధర్రావు, సోని దంపతుల కుమారుడు నరేంద్ర(5) పక్కనే ఉన్న గాడిమొగ గ్రామంలోని అంగన్వాడీలో చదివిస్తున్నారు. అయితే రోజూ మాదిరిగా అంగన్వాడీ కేంద్రానికి తల్లి తీసుకువెళ్లింది. పాఠశాల గేటు వద్ద వదిలి వెళ్లడంతో నరేంద్ర వెనుకనే తిరిగి ఇంటికి వస్తూ దారిమధ్యలో ఉన్న కాలువలో కాలుజారి పడిపోయాడు. ఇది గమనించిన గ్రామస్తులు కాపాడే ప్రయత్నంచేసినా అప్పటికే బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. ఇటువంటి సంఘటన గతంలో ఒకటి జరిగిందని ఆ కాలువకు ఇరువైపుల గోడను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
హీరో అల్లు అర్జున్ కు టీఎస్ఆర్టీసీ లీగల్ నోటీసులు
ప్రముఖ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, రాపిడో సంస్థకు టీఎస్ఆర్టీసీ లీగల్ నోటీసులు ఇచ్చింది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచిలా ఉన్న రాపిడో బైక్స్ యాడ్ లో నటించిన అల్లు అర్జున్‌కు, యాడ్ రూపొందించిన రాపిడో సంస్థకు నోటీసులు పంపించామని ఆయన తెలిపారు. అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికుల నుంచి అభ్యంతరాలు వచ్చాయని సజ్జనార్ తెలిపారు. ఈ ప్రకటనలో ఆర్టీసీ బస్సులను దోసెలతో పోల్చారని, దీనిపై ప్రయాణికులు, ఉద్యోగుల నుంచి విమర్శలు వస్తున్నాయన్నారు. ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనల్లో నటులు కూడా నటించాలని ఆయన తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలో దారుణం .. ప్రియురాలి గొంతుకోసి చంపిన ప్రియుడు
పెళ్లికి నిరాకరించందనే కారణంగా ప్రియురాలిని గొంతుకొసి హత్యచేసిన సంఘటన పెద్దపల్లి జిల్లా 8 ఇంక్లైన్ కాలనీలో జరిగింది. కెకె నగర్ కు చెందిన గొడుగు అంజలి అనే యువతి తారకరామారావు నగర్ కు చెందిన చాట్ల రాజు అనే యువకుడు మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అంజలిని పెళ్లి చేసుకోవాలంటూ రాజు వేధింపులకు గురిచేయటంతో రెండు సార్లు పంచాయతీ కూడా జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్లిన రాజు అంజలిని కత్తిపీటతో గొంతు కోశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. అంజలి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి... టీఆర్ఎస్ విజయగర్జన సభ వాయిదా
తెలంగాణలో మంగళవారం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ఎలాంటి పబ్లిక్ మీటింగ్‌లు నిర్వహించడానికి వీల్లేదన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక మార్గదర్శకాలే వర్తిస్తాయన్నారు. రాజకీయ సమావేశాలకు అనుమతి లేదన్నారు. డిసెంబరు 10న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో ఈనెల 29న హన్మకొండలో జరగాల్సిన టీఆర్ఎస్ విజయగర్జన సభ వాయిదా పడింది.
సీఎం పర్యటన రద్దు
వరంగల్ లో రేపు చేపట్టనున్న సీఎం కేసీఆర్ పర్యటన రద్దైనట్లు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలిపాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఈ పర్యటన వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కోడ్ అమలులో ఉన్న క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి లేనందున వాయిదా వేశారు.