CM KCR: అది ఫామ్ హౌస్ కాదు.. ఫార్మర్ హౌస్.. సీదా ఒక్కటే అడుగుతానా వడ్లు కొంటరా? కొనరా?
వడ్ల కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొంటరా.. కొనరా అని ప్రశ్నించారు.
బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సీదా అడుగుతున్న.. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొంటరా? కొనరా? సమాధానం చెప్పేదాకా వదిలి పెట్టను అని కేసీఆర్ అన్నారు. 'ఏదైనా అంటే దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేస్తున్నారు. రాయలసీమకు నీళ్ల గోస ఉన్నది.. నీళ్లు రావాలని నేనే అన్న. రాయలసీమకు వెళ్లి నీరు కావాలని చెప్పిన మాట వాస్తవమే. రాయలసీమకు నీరు ఇవ్వాలని ఈ రోజు కూడా చెబుతున్నా. ఏపీ సీఎంను హైదరాబాద్‌కు పిలిపించుకొని మరీ రాయలసీమకు నీళ్లివ్వాలని చెప్పా. బేసిన్లు, భేషజాలు ఉండొద్దని ఏపీ సీఎంకు చెప్పా. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాష్ట్రాల్లో ఎన్నికలను బట్టి రాజకీయాలు చేస్తుంటాయి. పక్క రాష్ట్రానికి వెళ్లి చేపల పులుసు తింటే తప్పా? బండి సంజయా సొల్లు పురాణం చెబుతున్నారు. ప్రశ్నించిన వాళ్లంతా.. దేశ ద్రోహులా?' అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
బీజేపీ వాళ్లు.. ఎన్నికలున్నప్పుడు.. ఓ జెండా ఎత్తుకుంటారు. తమిళనాడు ఎన్నికలైపోయినయ్ కావేరి నది గురించి మాట్లాడటం మానేశారు. తెలంగాణలో వరి ధాన్యాన్ని కొంటదా? లేదా? అది చెప్పండి. సమాధానం చెప్పేవరకు వదిలి పెట్టం. యాసంగిలో కూడా పంట ఏయ్యమని చెప్పితివిగా ఏమైంది. వడ్లన్ని పక్కకు పోయినాయి. బీజేపీలో మహా పండితులు ఉంటారు కదా.. వడ్లు తప్పా అన్ని మాట్లాడతారు. కేసీఆర్ మీద.. దేశ ద్రోహి అని.. ముద్ర ఏయాలనే చూస్తున్నారు. తెలంగాణలో హనుమంతుడి గుడి లేని ఇల్లు లేదు. కేసీఆర్ సంక్షేమ పథకం.. లేని ఊరు లేదు.
- తెలంగాణ సీఎం, కేసీఆర్
‘భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ వడ్ల గురించి ఒక్క మాట మాట్లాడలే. ఏడాదిగా ఢిల్లీలో రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఉద్యమంలో 600 మంది రైతులు మరణించారు. దీనిపై కేంద్రం మసిపూసి మారేడు కాయ చేద్దామని చూస్తంది. ఏదైనా ప్రశ్నిస్తే దేశద్రోహి అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చినప్పుడు, బిల్లులకు మద్దతిచ్చినప్పుడు దేశద్రోహి కాని కేసీఆర్.. ఇప్పుడు దేశద్రోహి అయ్యాడు. ఎవరు మాట్లాడితే వారు దేశద్రోహులా..? భాజపానే నియమించిన గవర్నర్ సత్యపాల్ మాలిక్, ఆ పార్టీకి చెందిన వరుణ్ గాంధీ కూడా రైతు చట్టాల గురించి ప్రశ్నించారు. వారంతా దేశద్రోహులా..? కేసీఆర్ చైనాలో డబ్బులు దాచుకున్నారని ప్రచారం చేస్తున్నారు.. ఎన్నైనా ఉంటదా గిసోంటిది.' అని సీఎం కేసీఆర్ అన్నారు.
'పంజాబ్‌లో పూర్తిస్థాయిలో ధాన్యం సేకరిస్తున్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేస్తుందా? లేదా? కేంద్రాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. దీనిపై సమాధానం చెప్పేదాకా.. కేంద్రాన్ని, భాజపాను వదిలిపెట్టం. బండి సంజయ్ యాసంగిలో వడ్లు వేయాలని చెప్పిన మాట వాస్తవం కాదా? రాష్ట్రంలో పండే వరి చూస్తా అంటే చెప్పు ఆరు హెలికాప్టర్లు పెడతా. బండి సంజయ్, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు రావాలి. తెలంగాణ ఉద్యమంలో నేనెక్కడ అని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. అసలు ఉద్యమంలో నువ్వు ఉన్నావా? ఉద్యమ సమయంలో నీ పేరైనా తెలుసా?. పెట్రోల్ ధరల గురించి ప్రశ్నిస్తే.. అఫ్గానిస్థాన్ పొండి అంటార్రు. ఉచితాలు ఇచ్చి ప్రజలను సోమరులను చేస్తున్నారని అంటున్నారు.
- తెలంగాణ సీఎం, కేసీఆర్
ఒక్క రూపాయి ఉన్నా రాజీనామా చేస్తా..
గొర్రెల పైసల్లో కేంద్ర ప్రభుత్వానిది రూపాయి ఉన్నా.. తాను రాజీనామా చేస్తా అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గొర్రెల కోసం రుణం తీసుకున్నాం.. బాధ్యతగా తీరుస్తున్నామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాల్లో ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీ అనేక దొంగ లెక్కలు చేసిందని... కర్ణాటకలో దొడ్డిదారిన ప్రభుత్వంలోకి వచ్చిందని విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో గెలవలేదని.. దొడ్డిదారిన సర్కారు నడుస్తోందని పేర్కొన్నారు. ప్రశ్నించేవారిపై ఐటీ, ఈడీ దాడులు చేయించడం బీజేపీ నైజం అని విమర్శించారు.
ఇంకా కేసీఆర్ ఏమన్నారంటే..
కేంద్రం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలను ఇస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టింది. మేం లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చాం. 70 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. జోనల్ చట్టం తీసుకొచ్చాం. ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నాం. జోనల్ విధానం అమలు కారణంగా కాస్త ఆలస్యమవుతోంది. మేం చేయగలిగిందే చెబుతతాం. కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారన్నది జోక్ ఆఫ్ ది మిలీనియం. తెలంగాణ పథకాలను పార్లమెంటులో మెచ్చుకున్నారు. తెలంగాణ ప్రగతిని ఆర్బీఐ కూడా మెచ్చుకుంది. తెలంగాణ సాధించిన ప్రగతిని ఏ భాజపా రాష్ట్రమైనా సాధించిందా? మేం పదవులకు భయపడతామా? కొన్ని కారణాల వలన ఎస్సీని సీఎం చేయలేకపోయాం. మళ్లీ ఎన్నికలకు వెళ్లినా ప్రజలు స్వాగతించారు.
మీకు భయపడడానికి మాకెలాంటి వ్యాపారాలు లేవు. దందాలు లేవు. ఈడీ దాడులకు దొంగలు భయపడతారు. మేమమెందుకు భయపడతాం. మాకేం మనీ ల్యాండరింగులు.. బొండరిగులు లేవు. కేసీఆర్ ఫామ్ హౌస్ దున్నుతా అంటారు. నువ్వేమైనా ట్రాక్టర్ డ్రైవ ర్ వా? అనవసర ప్రయత్నాలు చేస్తే జాగ్రత్త.. ఫామ్ హౌస్ లో నేను.. నేను , నా కొడుకు వ్యవసాయం చేస్తున్నాం. రాష్ట్రం కోసం మా భూములే పోయాయి. మంత్రివర్గంలో అందరూ ఉద్యమకారులే ఉంటారా? మంత్రివర్గంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఇతర పార్టీ నాయకులను తీసుకుంటే తప్పేముంది. అదే మీరు చేస్తే సంసారం.. వేరే పార్టీ చేస్తే వ్యభిచారామా? కాంగ్రెస్ నుంచి వచ్చిన సింథియాను కేంద్రమంత్రిని చేయలేదా?
Also Read:Bandi Sanjay: గంటసేపు కేసీఆర్ అబద్ధాలు.. అవన్నీ నిజమని తేల్చు, నేనే ముక్కు నేలకు రాస్తా: బండి సంజయ్