తెలంగాణలోని ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం గ్రామం పరిధిలోని రైతుల నుంచి భూసేకరణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా భూసేకరణ జరగాల్సి ఉంది.
Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్‌కి భూములు ఇస్తున్న తెలంగాణా రైతులు! ఎందుకో తెలుసా?
Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్ కి తెలంగాణా రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. దీని వెనుక పెద్ద ఆశయం ఉంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Amaravati Railway Line: రైల్వే డిపార్ట్మెంట్, ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న అమరావతి రైల్వే లైన్ కోసం తెలంగాణ రైతుల నుంచి భూసమీకరణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ -తెలంగాణ బోర్డర్‌లోని ఎర్రుపాలెం గ్రామం పరిధిలోని రైతులు అమరావతి రైల్వే లైన్ కోసం భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇప్పటికే దీనికోసం రైల్వే అధికారులు ఎర్రుపాలెం గ్రామస్తులతో పలు దఫాలు చర్చలు జరుపగా దాదాపు అందరూ ఒప్పుకొన్నట్టు అక్కడి స్థానికుడు, అడ్వకేట్ శ్రీనివాస్ తెలిపారు. నిజానికి ఈ ప్రాజెక్ట్‌లో సంక్లిష్టమైన భాగం ఈ భూ సేకరణ అని రైల్వే భావించింది. ఆంధ్రప్రదేశ్‌లో రైతుల నుంచి ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ సేకరికంచిన భూమి ఉంది. కానీ తెలంగాణలోని ఎర్రుపాలెంలో భూములు అమరావతి రైల్వే లైన్ కోసం ఇస్తారా అని అందరూ అనుమానించారు కానీ తెలంగాణ రైతులు మాత్రం దానికి దాదాపు అంగీకరించడంతో ఈ కొత్త రైల్వే లైన్‌కి అడుగు ముందుకు పడినట్టు అయింది.

ఎర్రుపాలెం గ్రామస్తుల ఆకాంక్ష ఇదే..!
ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం గ్రామానికి శాతాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడికి సమీపంలో ఉన్న జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైంది. ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయినప్పటికీ ఎర్రుపాలెం రైల్వే స్టేషన్‌లో పెద్దగా రైళ్లు ఆగవు. విజయవాడ -భద్రాచలం రోడ్డు మెము, విజయవాడ -డోర్నకల్ ప్యాసింజర్, గోల్కొండ ఎక్స్ ప్రెస్, కృష్ణా ఎక్స్ ప్రెస్ మాత్రమే ఇక్కడ రోజూ ఆగుతాయి. ఈ నాలుగు కాకుండా వారానికి రెండుసార్లు ప్రయాణించే చెన్నై -లక్నో ఎక్స్ ప్రెస్‌కి ఈ స్టేషన్‌లో హాల్ట్ ఉంది. చాలా రోజులుగా ఎర్రుపాలెం సహా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పద్మావతి, శాతవాహన, విజయవాడ -సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్‌లను ఎర్రుపాలెం స్టేషన్‌లో ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ అది ఒక డిమాండ్ గానే ఉండిపోతూ వచ్చింది.

అమరావతి బైపాస్ రైల్వే లైన్ ఈ స్టేషన్ నుంచే ప్రారంభం అవుతుందని రైల్వే ప్రకటించడంతో ఎర్రుపాలెం వాసుల మైండ్‌లో కొత్త ఆశలు చిగురించాయి. ఈ లైన్ వల్ల ఎర్రుపాలెం స్టేషన్ హోదా మారి జంక్షన్ అవుతుంది. దానివల్ల అమరావతి వైవు వెళ్లే కొత్త రైళ్ళతోపాటు ఆల్రెడీ ఉన్న కొన్ని అదనపు రైళ్ళకు కూడా ఈ స్టేషన్‌లో హల్టింగ్ ఇచ్చి తీరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఊరు కూడా డెవలప్ అవుతోందని ఇక్కడి రైతులు భావిస్తున్నట్టు రెడ్డి అనే మరో గ్రామస్తుడు తెలిపారు.

మొదట కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినా మూడు నాలుగు దఫాల మీటింగ్స్ తర్వాత తమ భూములు కొత్త రైల్వే లైన్ కోసం ఇవ్వడానికి ఇక్కడి రైతులు ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న భూములు మార్కెట్ ధరలకు మూడు రెట్లు పరిహారం లభించనున్నట్టు కొందరు గ్రామస్తులు తెలిపారు. భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తమ భూములను ఇవ్వడానికి వీరు ఒప్పుకొన్నారు.
అమరావతిలోనూ భూసేకరణ జరగాల్సి ఉంది.
ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్‌లో కూడా భూసేకరణ జరగాల్సి ఉన్నా అది పెద్దగా సంక్లిష్టం కాదు. ఆల్రెడీ అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన భూమి ఉంది. ఇది కాక మరికొన్ని గ్రామాల్లో భూసేకరణ జరగాల్సి ఉన్నా ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ ఆ పనిలో ఉంది. రైల్వే పరంగా కృష్ణా నదిపై నిర్మించాల్సి ఉన్న కొత్త బ్రిడ్జి ఒక్కటే పెద్ద పని.
2047 కోట్లు.. 57కిమీ దూరం..!
ఈ ప్రాజెక్ట్ కోసం 2047 కోట్ల బడ్జెట్ కేటాయించింది రైల్వే. దీనికి 2024లోనే అప్రూవల్ వచ్చేసింది. తెలంగాణాలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఎర్రుపాలెం నుంచి ఏపీ లోని గుంటూరు జిల్లాకు చెందిన నంబూరు వరకూ అమరావతి రైల్వే లైన్ నిర్మిస్తారు. ఈ రెండు స్టేషన్‌ల మధ్య కొత్తగా 10 స్టేషన్‌లు రానుండగా వాటిలో ఏపీ రాజధాని అమరావతి ఒకటి. 2029 జనవరి నాటికి ఈ రైల్వే లైన్ పూర్తి అయ్యేలా ప్రణాళికలు జరుగుతున్నాయి. త్వరలోనే భూసేకరణ పూర్తి చేసి ఈ రైల్వే లైన్ నిర్మాణానికి శంఖు స్థాపన చెయ్యాలని రైల్వే శాఖ భావిస్తోంది.
Frequently Asked Questions
అమరావతి రైల్వే లైన్ కోసం భూసేకరణ ఎక్కడ జరుగుతోంది?
ఎర్రుపాలెం గ్రామస్తులు తమ భూములు రైల్వే లైన్ కోసం ఇవ్వడానికి ఎందుకు అంగీకరించారు?
కొత్త రైల్వే లైన్ వల్ల ఎర్రుపాలెం స్టేషన్ జంక్షన్ అవుతుందని, ఊరు అభివృద్ధి చెందుతుందని వారు భావిస్తున్నారు. మార్కెట్ ధరలకు మూడు రెట్లు పరిహారం కూడా లభిస్తుంది.
అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్ట్ ఎంత ఖర్చుతో నిర్మిస్తున్నారు మరియు దాని దూరం ఎంత?
ఈ ప్రాజెక్ట్ కోసం 2047 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఇది తెలంగాణలోని ఎర్రుపాలెం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని నంబూరు వరకు 57 కిలోమీటర్ల దూరం నిర్మిస్తారు.
అమరావతి రైల్వే లైన్ ఎప్పుడు పూర్తి అయ్యేలా ప్రణాళికలు జరుగుతున్నాయి?
2029 జనవరి నాటికి ఈ రైల్వే లైన్ పూర్తి అయ్యేలా ప్రణాళికలు జరుగుతున్నాయి. త్వరలోనే భూసేకరణ పూర్తి చేసి నిర్మాణానికి శంఖుస్థాపన చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది.























