Khammam house demolition: ఖమ్మంలో ఇళ్ల కూల్చివేత వివాదం ఏమిటి? బాధితుల్ని ప్రభుత్వం రోడ్డున పడేసిందా?
Khammam: ఖమ్మం భూదాన భూముల్లో ఆక్రమణల తొలగింపు వివాదాస్పదం అయింది. పేదల ఇళ్లు కూల్చివేశారని పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్నాయి.

Khammam house demolition is causing huge stir : ఖమ్మం నగరాన్ని ఆనుకుని ఉన్నవెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిర్మించుకున్న సుమారు 650 ఇళ్లను రెవెన్యూ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఇంట్లోని సామాన్లు సర్దుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా జేసీబీలతో గూడును నేలమట్టం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ పనులు చేసుకుంటూ, అప్పులు చేసి కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఒక్కో ఇటుక పేర్చుకుని నిర్మించుకున్న ఇళ్లు కళ్లముందే ధ్వంసమవుతుంటే మహిళలు, వృద్ధులు అడ్డంగా పడుతూ రోదించిన తీరు అక్కడి వారిని కలిచివేసింది.
భూదాన్ బోర్డుకు చెందిన భూములు
ఈ భూములు భూదాన్ బోర్డుకు చెందినవని, ఇవి ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. గత ఎనిమిది నెలలుగా పేదలు ఈ భూమిలో గుడిసెలు వేసుకుని, క్రమంగా రేకుల ఇళ్లు, పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. గతంలోనే అధికారులు ఇక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, ఇళ్ల నిర్మాణాలు ఆగకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు ఈ తొలగింపు చర్యలు చేపట్టినట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఇళ్ల కూల్చివేతతో నిరాశ్రయులుగా మారిన పేదలతో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్@KTRBRS pic.twitter.com/KXc0L8KftC
— KTR News (@KTR_News) February 26, 2026
కోర్టు ఆదేశాలు అంటున్న అధికారులు - విపక్షాల ఆగ్రహం
ఈ ఘటనపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా వంటి పార్టీల నేతలు బాధితులకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పేదల ఇళ్లను కూల్చడం అమానుషమని, వారికి ప్రత్యామ్నాయం చూపకుండా ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో తాము పేదలకు అండగా ఉన్నామని, ఇప్పుడు అధికార పార్టీ నాయకులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు.
కోర్టు ఆదేశాల వల్లేనంటున్న కాంగ్రెస్ నేతలు
అధికార కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు. ఇవి భూదాన్ భూములు కావడం వల్ల చట్టపరమైన చిక్కులు ఉన్నాయని, ప్రభుత్వ భూములను ఆక్రమించడం సరైనది కాదని కొందరు నేతలు వివరిస్తున్నారు. అయితే, నిజమైన పేదలకు అన్యాయం జరగకుండా చూస్తామని, అర్హులైన వారికి ప్రభుత్వం తరపున ఇళ్ల పట్టాలు లేదా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని స్థానిక కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఆక్రమణలు మొదలయ్యాయని, సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని వారు పేర్కొంటున్నారు.
నా భర్త చనిపోయాడు.. నాకు ఇద్దరు ఆడపిల్లలు, నాకు కిరాయి కట్టే స్థోమత కూడా లేదు
— ShashanKTRS🚗 (@Shashanktrs8) February 26, 2026
ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో మాకు అర్థం కావడం లేదు
ముగ్గురు మంత్రులు ఉంటే మమ్మల్ని కలవలేదు, మమ్మల్ని కూడా కలవనివ్వడంలేదు
నిన్నటి నుండి అన్నం, నీళ్లు లేకుండా చెట్టు కిందనే ఉన్నాము
ఖమ్మం కలెక్టరేట్… pic.twitter.com/uwNlbpYWU4
ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితులు
ఖమ్మంలో ఇళ్ల కూల్చివేత వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధితులు తమ సామాన్లతో శిథిలాల మధ్యే వర్షంలో కాలం గడుపుతున్నారు. పిల్లల చదువుల కారణంగా తమను కరుణించాలని, తమకు గూడు కల్పించాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని, రాజకీయాల కంటే పేదల బతుకులకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తులు వ్యక్తమవుతున్నాయి.























