Bandi Sanjay: గంటసేపు కేసీఆర్ అబద్ధాలు.. అవన్నీ నిజమని తేల్చు, నేనే ముక్కు నేలకు రాస్తా: బండి సంజయ్
సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నేడు (నవంబరు 11) బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు, ఇంధన ధరల తగ్గించాలనే డిమాండ్ వంటి అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఆదివారం సీఎం కేసీఆర్ ఈ అంశాలపై చేసిన వ్యాఖ్యలకు నేడు (నవంబరు 11) బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ అబద్ధాలు మాట్లాడారని కొట్టిపారేశారు.
‘‘కేసీఆర్‌ది నోరా తాటి మట్టా.. గంటసేపు అబద్ధాలు చెప్పారు.. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. హుజూరాబాద్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా సిగ్గు రావడం లేదు. రైతులకు రుణమాఫీ చేస్తానన్నవు. మొదటి రుణ మాఫీకి నాలుగేళ్లు, రెండో రుణమాఫీకి మూడేళ్లు పట్టింది. రైతులంతా కార్లలో తిరుగుతున్నారట. వాళ్ల పేర్లు ఎవరో చెప్పు. నీ పాలనలోనే కొనుగోలు కేంద్రంలో వడ్ల కుప్పపై రైతు గుండెపోటుతో చనిపోయాడు. వడ్ల విషయంలో ఒక్కోసారి ఒక్కో మాట చెబుతున్నావు కేసీఆర్. ఒకసారి సన్నరకం, ఇంకోసారి దొడ్డు రకం.. మరోసారి వడ్లే వెయ్యవద్దని అంటున్నవు. రైతులను నువ్వే నాశనం చేస్తున్నవు. కేంద్ర మంత్రిని కూడా తిడుతున్నడు. 62 లక్షల ఎకరాల్లో వరి సాగైతే ఎక్కడో చూపించు. ప్రతి గింజా నేనే కొంటా అన్నడు. ఇప్పుడు కొనని చెప్తున్నడు.’’
అన్ని మాటలు నువ్వే అంటవ్
‘‘అబద్ధాలు ఆడొద్దు. ప్రగతి భవన్ నుంచి బయటికొచ్చి ముక్కు నేలకు రాయి. ధాన్యం కొనేందుకు కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు పెట్టిందని నువ్వే అంటవు. నేనే ప్రతి గింజా కొంటా అని అంటవ్. కేంద్రం పెత్తనం ఏంటని నువ్వే అంటవ్. మళ్లీ కేంద్రం ధాన్యం కొనట్లేదని నువ్వే అంటవు. వీటికి కేసీఆర్ సమాధానాలు చెప్పాలి. టీఆర్ఎస్ నాయకులు కొంత మంది రైస్ మిల్లర్లతో కుమ్మక్కయ్యారో అనేక ఛానెళ్లలో, పత్రికల్లో వచ్చింది. వానాకాలంలో పంట కొనే విషయంలో కేసీఆర్ అబద్ధాలు చెప్పినట్లుగా కేంద్రం వ్యవహరించలేదు. అంతేకాక, దీనిపై ఢిల్లీ వెళ్లి ఏదో చేస్తడట. ఇంతకుముందు వెళ్లినప్పుడే నిన్ను ఎవ్వరు పట్టించుకోలే. రైతు చట్టాల విషయంలో సుప్రీంకోర్టే స్టే విధించింది. అలాంటిది ఈయన వెళ్లి నిరసన చేస్తడా. ఇన్నిరోజులు ఏం చేశావు?’’
Also Read: కేసీఆర్‌ని టచ్ చేసి బతికి బట్టకడతారా... రేపట్నుంచి కేంద్రానికి చుక్కలు చూపిస్తాం....
‘‘ఈ వ్యవసాయ చట్టాల్లో మార్కెట్ కమిటీలను రద్దు చేస్తామని, కొనుగోలు కేంద్రాల్ని ఎత్తేస్తామని ఎక్కడైనా ఉంటే చూపించు. నేనే ముక్కు నేలకు రాస్తా. రైతాంగానాకి సాష్ఠాంగ నమస్కారం చేస్తా. నువ్వు ఇప్పుడు ఢిల్లీ వెళ్లే ఇన్ని రోజులు ఏం చేసినవని జనం రాళ్లతో కొడతరు.’’
ఇంధన ధరలు ఎందుకు తగ్గించవ్?
తెలంగాణ రాష్ట్రం వ్యాట్ అస్సలు పెంచలేదని కేసీఆర్ చెప్పారు. 2015లో పెట్రోల్‌పై 4 శాతం, డీజిల్‌పై 5 శాతం వ్యాట్ పెంచారు. ఆ జీవో కూడా ఉంది. ఆ మేరకు రూ.4 నుంచి రూ.5 వరకూ పెరిగింది. ఆయన పెంచిన విషయాన్నే మర్చిపోయి ఏదంటే అది అబద్ధాలు చెబుతున్నడు. ఇంధన ధరలు ఎందుకు తగ్గించవో చెప్పాలి. నీ అబద్ధాల కోసం ఒక మంత్రిత్వశాఖ పెట్టాలి. వ్యాట్ అధికంగా విధించే రాష్ట్రాల్లో నెంబర్ 2 రాష్ట్రమే తెలంగాణ. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చాలంటే.. నీ మంత్రి ఎందుకు లేఖ ఇవ్వలే? దేశంలో 24 రాష్ట్రాలు వ్యాట్ తగ్గించినప్పుడు నువ్వు ఎందుకు తగ్గియ్యవు.’’ అని బండి సంజయ్ విమర్శించారు.
‘‘తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు.. రూ.2.52 లక్షల కోట్లు. ఇది పన్నులు, ఇతర ప్రాయోజిత పథకాల కింద ఇచ్చింది. దేశ రక్షణ, జాతీయ విపత్తులపై అదనపు నిధులు వస్తుంటాయి. వీటిలో 1.22 లక్షల కోట్లు కేవలం సంక్షేమ పథకాల కోసమే కేంద్రం ఇచ్చింది. హైదరాబాద్ చుట్టూ ఆర్ఆర్ఆర్ లాంటి భారీ ప్రాజెక్టులు మంజూరు చేసింది.’’ అని బండి సంజయ్ మాట్లాడారు.
Also Read: ఢిల్లీలో ప్రధాని మోదీకి గులాంగిరీ.. ఇప్పుడు పోరాటమంటూ చెవుల్లో పూలు పెడుతున్నారు: రేవంత్ రెడ్డి
Also Read: తెలంగాణ రైతులకు అలెర్ట్... యాసంగిలో వరి వద్దు ప్రభుత్వం కొనదు... మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం
Also Read: ఆర్టీసీ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం... ఎంతెంత పెరిగాయంటే..!