Huzurabad By Poll: దగ్గరపడుతున్న హుజురాబాద్ ఉపఎన్నికల పోలింగ్ ! ప్రస్తుతానికి ఇవీ అభ్యర్థుల బలాలు.. బలహీనతలు !
హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. రెండు పార్టీల అభ్యర్థులకు బలాలు, బలహీనతలు ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.
హుజరాబాద్ ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు , అభ్యర్థులు తమ పూర్తి స్థాయి శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థులు తమ ప్లస్‌లను మరింత పెంచుకుని.. విజేతగా నిలవాలని ప్రయత్నిస్తున్నారు. ఎవరి బలం ఎంత ఉంది..? ఎవరెవరికి ఎంత పట్టు ఉంది..? ఎవరికి సానుకూలత ఉందన్నదానిపై ఏబీపీ దేశం విశ్లేషణ
నియోజకవర్గంతో అనుబంధమే ఈటల ప్రధానబలం !
బిజెపి తరఫున పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ బలం రెండు దశాబ్దాలకు పైగా నియోజకవర్గంతో ఉన్న అనుబంధం. ప్రతి గ్రామగ్రామాన ఓటర్లతో పరిచయం ఉన్న నేత. ఈ అనుబంధమే అన్నిటికన్నా పెద్ద అసెట్ గా ఆయన మలుచుకుంటున్నారు. దీనికి తోడు ఆకస్మికంగా పదవి నుండి తీసివేయడం.. టీఆర్ఎస్‌లో ఏర్పడిన పరిస్థితులు ఆయనకు సానుభూతి తెచ్చి పెట్టాయి. ప్రజలు బిజెపి అనే పార్టీ కంటే ఈటెల రాజేందర్ ని ఎక్కువగా చూస్తున్నారు. దీనికి తోడు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు మొత్తం కూడా ఈటల రాజేందర్ ను టార్గెట్ చేసి తమ ప్రసంగాలు కొనసాగిస్తున్నారు .
Also Read : కేటీఆర్‌వి గాలి మాటలు.. ఈటెల కోసం కాంగ్రెస్ పనిచేయడమా..? సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
ఈటల రాజీనామా వల్లే నిధుల ప్రవాహం అని బీజేపీ విస్తృత ప్రచారం !
తెలంగాణ ఉద్యమంలో తన పాత్రను అలాగే తన కమిట్మెంట్ గురించి పదే పదే ప్రస్తావించడం ద్వారా తనకు ద్రోహం చేశారనే ఆలోచనని ప్రజల్లో వచ్చేలా చేస్తున్నారు. విస్తృత పరిచయాలు లతోపాటు ఆర్థికంగా సామాజికంగా ఎదిగిన ఎందరో ఇప్పుడు ఈటల రాజేందర్‌కి తెరవెనుక ఉండి బాసటగా నిలుస్తారని ఆయన భావిస్తున్నారు. వీటన్నిటికీ తోడు భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా చివరి వరకూ వేచి చూసి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ లో తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఆర్ ఎస్ ఎస్ ను రంగంలోకి దింపింది. నాయకులంతా హుజరాబాద్ లో మకాం వేసి మరి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారం చేస్తున్నారు. మరోవైపు హడావిడిగా తెరమీదకు తీసుకువచ్చిన దళిత బంధు సంబంధించిన వైఫల్యాలను ఎత్తి చూపడం కొంతవరకూ ప్రజల్లోకి వెళ్లిందని చెప్పవచ్చు. ఈటల రాజేందర్ రాజీనామా వల్ల నిధుల వరద పారింది అనేది కాస్త రాజకీయాలు పరిచయమున్న ఎవరైనా వేయగలిగే అంచనా. పెద్ద ఎత్తున నిధులు రావడం ఈటెల రాజేందర్ రాజీనామా వల్లే అని బిజెపి ప్రచారం చేస్తోంది.
Also Read: రేవంత్ రెడ్డిని కలిశాను... తప్పేంటి ? కేటీఆర్‌కు ఈటల కౌంటర్ !
నేతల్ని ఈటల వెంట వెళ్లకుండా చూసుకున్న టీఆర్ఎస్ !
ఈటల రాజేందర్ వర్గానికి చెందిన అత్యంత కీలకమైన నాయకులందరనీ తెలంగాణ రాష్ట్ర సమితి తన అదుపులోనే ఉంచుకోగలిగింది. టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారు సరే... ఇందులో ఎంతమంది నిజమైన కమిట్మెంట్తో పనిచేస్తున్నారు అనేది ఎవరికీ తెలియదు. ఇక మొదటి నుండి కూడా కరుడుగట్టిన కమ్యూనిస్టు గా పేరుగాంచిన ఈటల రాజేందర్ ఆకస్మికంగా రైట్ వింగ్ పార్టీ అయిన BJPలో చేరడం కొంతవరకు అయోమయానికి గురి చేసిందని చెప్పవచ్చు . కేవలం తన అవసరం కోసమే అలా చేశారు అంటూ పెద్ద ఎత్తున హరీష్ రావు తో సహా ఇతర నేతలు ప్రచారం చేయడంతో కొంత వరకు మేధావి వర్గాలలో దీనికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఇక వందల కోట్ల ఆస్తుల తో ఆర్థికంగా బలంగా ఉన్న ఈటెల రాజేందర్ కుటుంబాన్ని మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన తన ప్రత్యర్థి అయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పోలుస్తూ టీఆర్ఎస్ నాయకులు కొంతవరకూ ప్రజల్లో ఒక ఆలోచనని తీసుకొస్తున్నారు.
Also Read: హుజూరాబాద్ లో జోరుగా ప్రచారం... సానుభూతి వర్సెస్ అభివృద్ధి.. గెలుపుకోసం ఎత్తుకుపై ఎత్తులు...!
గెల్లు గెలుపు కోసం శక్తియుక్తులు కేంద్రీకరిస్తున్న హరీష్ రావు !
తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కి ఇది నిజంగా గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఈటల రాజేందర్ లాంటి పెద్ద నాయకుడిని ఢీకొట్టడం సామాన్య విషయం కాదని తెలిసినప్పటికీ, తనకు వచ్చిన అవకాశాన్ని రాజకీయంగా వాడుకోవడంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ కొంత సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆశీస్సులు ఉండటం, పూర్తిస్థాయిలో తన కోసం పనిచేస్తూ క్యాడర్ మొత్తం నియోజకవర్గం వెంట ఉండటం ప్లస్ పాయింట్ గా మారింది .గ్రామ గ్రామాన తిరుగుతూ ఇప్పటికే దాదాపు ప్రచారాన్ని అందరి కంటే పెద్ద ఎత్తున పూర్తి చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ కి పార్టీ అలాగే, నాయకులు ఇస్తున్న అండ దండలే అన్నిటికన్నా పెద్ద బలం అని చెప్పవచ్చు. మరోవైపు తనకు ఉన్న ఉద్యమ నేపథ్యం... మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు అనే ప్రచారం కొంతవరకూ ప్రజల్లోకి ముఖ్యంగా యువత లోకి తీసుకు వెళ్తున్నారు. స్థానికుడు కావడం... ..తన గెలుపు కోసం నియోజకవర్గానికి నిధుల వరద ప్రవహించడం ప్లస్ పాయింట్ అయింది.
గ్రౌండ్ లెవర్ టీఆర్ఎస్ క్యాడర్ సహకరించడమే డౌట్ !
బలహీనతల విషయానికి వస్తే ఇప్పటి వరకు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గంలో అంతటా అంతగా పరిచయం లేని వ్యక్తి కావడం కొంతవరకు మైనస్ అని చెప్పవచ్చు. కేవలం ఈ ఎన్నికల ద్వారా ప్రజలందరికీ తెలుసు అని రాష్ట్ర క్యాడర్ భావన. ప్రచారం ఎంత చేస్తున్నప్పటికీ హరీష్ రావు లాంటి నేతల ముందు గెల్లు శ్రీనివాస్ కి రావలసినంత ప్రచారం రాలేదు అనడం వాస్తవం. అప్పటివరకూ ఈటెల రాజేందర్ వెంట ఉన్న సీనియర్ నేతలు ఆకస్మికంగా వచ్చిన గెల్లు శ్రీనివాస్ కి నిజంగా సహకరిస్తారా అనేది కొంత వరకూ అనుమానించాల్సిన అంశం. గ్రౌండ్ లెవల్ లో క్యాడర్ గనుక సహకరించకపోతే ఓటింగ్ రోజు అనుకున్న ఫలితాలు సాధించడం కష్టం అయ్యే అవకాశం లేకపోలేదు. మరోవైపు ఏకంగా 17 మంది ఎమ్మెల్యేలు మరో ఐదుగురు మంత్రులు కేవలం ఈటెలని ఎదుర్కోడానికి దిగడంతో ఇది ఒక రకంగా ప్రజల్లో వ్యతిరేకత అభిప్రాయాన్ని నెలకొనేలా చేసింది .
Also Read : బహిరంగసభనా ? రోడ్ షోనా ? కేసీఆర్ ప్రచారంపై డైలమా ?
గట్టి పోటీ ఇవ్వడానికి బలమూరి వెంకట్ ప్రయత్నం !
ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బల్మూరి వెంకట్ కి ఈ ఎన్నిక నాయకుడిగా ఎదగడానికి ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. గెలుపు విషయంపై ఏమాత్రం అంచనాలు లేకుండా కేవలం గట్టిపోటీ ఇవ్వడానికి బరిలోకి దిగాడు. హుజరాబాద్ లో గట్టి క్యాడర్ ఉన్న కాంగ్రెస్ కి ఎంతో మంది నాయకులు రాజీనామా చేసి వేరువేరు పార్టీలోకి వెళ్లిపోయారు. అయితే కింది స్థాయిలో మాత్రం కొంత వరకూ బలంగానే ఉందని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. .ఇక పేరున్న నేతలు సైతం తన నామినేషన్ దగ్గర నుండి ప్రచారం వరకు రావడం...పార్టీకి పెరుగుతున్న అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్ కి ఈ పోటి ఒక ప్రయోగమే అవుతుంది. క్యాడర్ మొత్తం చెల్లాచెదురు అయిపోవడం వెంకట్‌కు ఇబ్బందికరంగా మారింది. మిగిలిన వారిని కాపాడుకుంటూ వెళదాం అనుకుంటే అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నుండి వస్తున్న అవకాశాలను కింది స్థాయి నేతలు అందుకుంటున్న నేపథ్యంలో అవి కొంత వరకూ అసాధ్యంగానే మారాయి.
Also Read: హుజురాబాద్‌లో హరీష్ గ్యాస్ బండ గుర్తుకు ప్రచారం చేస్తున్నారా..? ట్రబుల్ షూటర్‌కు కొత్త సమస్య !