Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Telangana Panchayat Elections 2025 | తెలంగాణలో తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కనిపించింది. అర్ధరాత్రి 2 వరకు ఫలితాల ప్రకారం, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అధిక సర్పంచ్ స్థానాలు నెగ్గారు.

Congress won majority seats in Telangana Panchayat Elections | తెలంగాణలో జరిగిన తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల హవా స్పష్టంగా కనిపించింది. అర్ధరాత్రి 2 గంటల వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఏకగ్రీవాలను కూడా కలుపుకొని కాంగ్రెస్ మద్దతుదారులు 2,383 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు. సిద్దిపేట జిల్లా మినహా రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన వారు సర్పంచులు కావడంతో తొలి విడత ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి తొలి గోల్ కొట్టారని కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటోంది.
రెండో స్థానానికి పరిమితమైన కారు
పలు చోట్ల ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ గట్టిపోటీ ఇచ్చింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు తెలిపిన 1,146 మంది సర్పంచ్ అయ్యారు. బీజేపీ 200 లోపు స్థానాలు నెగ్గింది. ఈ విడతలో స్వతంత్ర అభ్యర్థులు 455 పంచాయతీల్లో విజయం సాధించగా, వీటిలో సీపీఎం 14, సీపీఐ 16 చోట్లకు పైగా కైవసం చేసుకున్నాయి.
చలి లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు
చలిగాలులు వీస్తున్నప్పటికీ, ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం ఆరు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. కొందరు వృద్ధులు అంబులెన్స్‌లో పోలింగ్ కేంద్రాలకు రాగా, పసి పిల్లలతో మహిళలు, దివ్యాంగులు సైతం పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. మొత్తం 53,57,277 మందికి గాను 45,15,141 మంది ఓటు వేశారు. వీరిలో అత్యధికంగా మహిళలు 23,15,796 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, పురుషులు 21,99,267, ఇతరులు 78 మంది తొలి విడత ఎన్నికల్లో ఓటు వేశారు.
తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో 396 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, 3,834 సర్పంచి, 27,678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 84.28 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88 శాతం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యల్పంగా 71.79 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌కు గట్టి పట్టున్న నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది.
ఏ జిల్లాల్లో ఎవరిది ఆధిపత్యం..
కొన్నిచోట్ల ఓట్ల లెక్కింపులో స్వల్ప తేడా ఉండడం రెండు, మూడుసార్లు రీకౌంటింగ్ నిర్వహించారు. దీంతో లెక్కింపు అర్ధరాత్రి దాటాకా కూడా ఓట్ల లెక్కింపు కొనసాగింది. నల్గొండ, యాదాద్రి, ఖమ్మం, ములుగు, మెదక్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జనగామ, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువ పంచాతీయల్లో విజయం సాధించారు.
హరీష్ రావు అడ్డాలో బీఆర్ఎస్ ఆధిపత్యం..
సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ సత్తా చాటి ఎక్కువ స్థానాలు నెగ్గింది. మహబూబ్‌నగర్, వనపర్తి, హనుమకొండ, మహబూబాబాద్, భద్రాద్రి, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టిపోటీ ఇచ్చింది. వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారు. మొత్తంగా చూస్తే తొలి విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే రెండు రెట్ల స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్‌లుగు గెలుపొందారు.






















