Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతూరు ఘాట్ రోడ్‌లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Alluri Crime News | చింతూరు: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చింతూరు ఘాట్ రోడ్‌లో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారని తెలుస్తోంది. నలుగురు పురుషులు
ఐదుగురు మహిళలు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. మారేడుమిల్లి తులసి పాకల వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సు చింతూరు నుంచి మారేడుమిల్లి వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే చింతూరు నుంచి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సు నంబర్ AP 39 UM 6543 అని అధికారులు తెలిపారు.
చిత్తూరు నుండి కోటప్పకొండ,అమరావతి, మంగళగిరి,విజయవాడ, ద్వారకాతిరుమల, పాలకొల్లు, భీమవరం, పెనుగొండ, అంతర్వేది, ద్రాక్షారామం,సామర్లకోట, సింహాచలం, అరసవిల్లి, శ్రీకూర్మం, అరకు మీదుగా యాత్రికులు భద్రాచలం వెళ్తున్నారు. ట్రావెల్స్ బస్సులో బెంగుళూరుకు చెందిన 12 మంది, మిగతా వారు చిత్తూరుకు చెందిన వారు ఉన్నారని సమాచారం.

బస్సు ప్రమాదం కారణంగా చింతూరు-మారేడుమిల్లి మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాయి. ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు జిల్లాకు చెందిన విఘ్నేశ్వర ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు.
బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి
అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు మండలం, తులసిపాకలు ఘాట్ రోడ్‌లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న యాత్రికుల ప్రైవేటు బస్సు లోయలో పడిన ఘటనలో పలువురు మృతి చెందడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

సీఎం చంద్రబాబు వెంటనే అధికారులతో మాట్లాడి, బస్సు ప్రమాదం వివరాలు, క్షతగాత్రులకు అందుతున్న సహాయం గురించి ఆరా తీశారు. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారని, పలువురు మృతి చెందగా, గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించడానికి వారిని ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు అధికారులు వివరించారు.
ఘటనా స్థలానికి తక్షణం వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఏపీ సీఎం ఆదేశించారు.






















