Tirupati Crime News: తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
Andhra Pradesh News | తిరుపతి సంస్కృత వర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి కేసులో ఇద్దరు ప్రొఫెసర్లను పోలీసులు అరెస్ట్ చేశారని డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు.

తిరుపతి: తిరుపతి: తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బీఈడీ విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్ అయ్యారు. విద్యార్థినిపై లైంగిక వేధింపులు నిజమేనని తేలడంతో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. ఈ కేసు వివరాలను ఆయన మీడియాకు తెలిపారు.
కేసు నమోదు, దర్యాప్తు పురోగతి
డీఎస్పీ భక్తవత్సలం వెల్లడించిన వివరాల ప్రకారం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ఒక బీఈడీ విద్యార్థినిని లైంగికంగా వేధించినట్లు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనపై స్వయంగా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు ఇచ్చారని తెలిసిందే. అంతకుముందే విద్యార్థిని గర్భం దాల్చిందని వార్తలు వచ్చాయి. తనకు జరిగిన అన్యాయాన్ని, ఇద్దరు కీచక ప్రొఫెసర్ల లైంగిక వేధింపులపై బాధిత విద్యార్థిని యూనివర్సిటీ వీసీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది.
ఒడిశాకు వెళ్లి విద్యార్థినిని విచారించిన పోలీసులు
దర్యాప్తులో భాగంగా, ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న బాధిత విద్యార్థినిని పోలీసులు విచారించారు. విచారణలో లభించిన సాక్ష్యాధారాల ఆధారంగా, ఈ కేసులో ప్రొఫెసర్‌లు లక్ష్మణ్ కుమార్, శేఖర్ రెడ్డి లను పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ బీఈడీ విద్యార్థినిని లొంగదీసుకొని లైంగిక దాడి చేసినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయిందన్నారు. కేసు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోందని డీఎస్పీ తెలిపారు. మూడు రోజుల కిందట పోలీసులు ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఫోన్లు సీజ్ చేసి, విద్యార్థినితో ఛాటింగ్, ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు సహా బ్లాక్ మెయిల్ మెస్సేజ్‌లు చెక్ చేశారు. అదే సమయంలో ఒడిశాకు వెళ్లిన విద్యార్థిని విచారించి లైంగిక వేధింపులు నిజమేనని పోలీసులు గుర్తించారు.
ఒడిశాకు చెందిన యువతి ఈ ఏడాది జూన్ నెలలో వర్సిటీలో బీఈడీలో చేరింది. ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ తన హోదా అడ్డుపెట్టుకుని విద్యార్థినిని ప్రలోభపెట్టాడు. తన ఆఫీసు రూంలోనే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో అదే విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.శేఖర్‌రెడ్డి ఫొటోలు, వీడియోలు తీశాడు. తమ కోరిక తీర్చకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేసి విద్యార్థినిని శారీరకంగా, మానసికంగా వేధించారు. విద్యార్థిని వీసీకి ఇటీవల ఫిర్యాదు చేయగా లక్ష్మణ్‌కుమార్‌ను పది రోజుల కిందట సస్పెండ్ చేశారు.
ఘటనపై మహిళా కమిషన్ సీరియస్
తిరుపతి సంస్కృత వర్సిటీలో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ తిరుపతి జిల్లా ఎస్పీతో మాట్లాడారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మంగళవారంనాడు ఆదేశించారు. ఈ ఘటన పూర్తి స్థాయి నివేదిక అందించాలని కమిషన్ సభ్యురాలు రుకియాబేగంను కమిషన్ చైర్ పర్సన్ ఆదేశించారు.






















