Telangana News: అరుదైన ఘటన - తోకతో పుట్టిన బాలుడు, శస్త్రచికిత్స చేసి తొలగించిన వైద్యులు
Bhuvanagiri News: పుట్టుకతోనే తోకతో జన్మించిన ఓ బాలునికి బీబీ నగర్ ఎయిమ్స్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించారు. ఈ తరహా ఆపరేషన్ బాలుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.
Doctors Removed Tail Of A Boy In Bhuvanagiri: యాదాద్రి భునవగిరి (Bhuvanagiri) జిల్లాలో బీబీనగర్ ఎయిమ్స్ (Bibinagar AIIMS) వైద్యులు ఓ బాలునికి అరుదైన శస్త్రచికిత్స చేశారు. పుట్టుకతోనే తోకతో జన్మించిన బాలునికి ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. గతేడాది అక్టోబర్‌లో ఓ మహిళకు తోకతో ఉన్న బాలుడు జన్మించగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. బాబుకు 3 నెలలు నిండేసరికి అది 15 సెం.మీ కావడంతో కంగారుపడిన తల్లిదండ్రులు ఎయిమ్స్ వైద్యులను సంప్రదించారు. చిన్నపిల్లల శస్తచికిత్స విభాగాధిపతి, అదనపు ప్రొఫెసర్ డాక్టర్ శశాంక్ పండా బాలున్ని పరీక్షించి వెన్నెముకలోని ఐదు వెన్నుపూసలతో అనుసంధానమై తోక బయటకు వచ్చినట్లు గుర్తించారు. వెంటనే తన వైద్యబృందంతో కలిసి ఆపరేషన్ చేసి తోకను విజయవంతంగా తొలగించారు.
క్లిష్టమైన ఆపరేషన్..
ఈ సమస్య (తోక) నాడీ వ్యవస్థతో ముడిపడి ఉన్నందున ఆపరేషన్ క్లిష్టమైందని వైద్యులు తెలిపారు. సాధారణంగా ఈ తరహా శస్త్రచికిత్సల అనంతరం నాడీ సంబంధిత సమస్యలు ఎదురవుతాయని చెప్పారు. ఆరునెలల కిందట జరిగిన ఈ ఆపరేషన్ తర్వాత.. తాజాగా బాలున్ని పరీక్షించిన వైద్యులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రపంచంలో ఇలాంటివి కేవలం 40 కేసులు మాత్రమే ఇప్పటివరకూ గుర్తించినట్లు వైద్యులు పేర్కొన్నారు.
Also Read: Telangana : తెలంగాణలో రేషన్ కార్డు లేకుండానే ఆరోగ్యశ్రీ సేవలు- రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు