Realme V25: 19 జీబీ ర్యామ్, 5జీతో రియల్‌మీ కొత్త ఫోన్ - ధర రూ.24 వేలలోపే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. అదే రియల్‌మీ వీ25 5జీ.
Realme V25 Launched: రియల్‌మీ వీ25 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. రియల్‌మీ వి-సిరీస్‌లో వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ కూడా ఇందులో ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉంది. ఇందులో ఇన్‌బిల్ట్‌గా 12 జీబీ ర్యామ్ అందించారు. అయితే డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ద్వారా మరో 7 జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు. అంటే మొత్తంగా 19 జీబీ ర్యామ్ ఉండనుందన్న మాట.
రియల్‌మీ వీ25 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 1,999 యువాన్లుగా (సుమారు రూ.23,900) నిర్ణయించారు. పర్పుల్ ఎంఎస్ఐ, వీనస్, ఫిర్మనెంట్ బ్లాక్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
రియల్‌మీ వీ25 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3. 0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఎల్టీపీవో డిస్‌ప్లేను అందించారు. ఈ ఫీచర్ ద్వారా మనం ఫోన్‌లో చూసే కంటెంట్ బట్టి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 30 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ మధ్య మారుతూ ఉంటుంది. దీని టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది.
12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ద్వారా ఉపయోగించని స్టోరేజ్‌ను 7 జీబీ వరకు ర్యామ్‌గా మార్చుకోవచ్చు. అంటే మొత్తంగా 19 జీబీ వరకు ర్యామ్ ఇందులో పొందవచ్చన్న మాట. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు డెప్త్ సెన్సార్, మాక్రో సెన్సార్ కూడా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా అందించారు. 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా... బరువు 195 గ్రాములుగా ఉంది.
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!