Redmi K50 Ultra: 108 మెగాపిక్సెల్ కెమెరాతో రెడ్‌మీ ఫోన్ లాంచ్ - 120W ఫాస్ట్ చార్జింగ్ కూడా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ కొత్త ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. అదే రెడ్‌మీ కే50 అల్ట్రా.
రెడ్‌మీ కే50 అల్ట్రా స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 6.7 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు.
రెడ్‌మీ కే50 అల్ట్రా ధర
ఈ స్మార్ట్ ఫోన్ నాలుగు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 2,999 యువాన్లుగా (సుమారు రూ.35,400) నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,299 యువాన్లుగా (సుమారు రూ.39,000) ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,599 యువాన్లుగానూ (సుమారు రూ.42,500), 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,999 యువాన్లుగానూ (సుమారు రూ.47,200) నిర్ణయించారు.
ఇందులో ఛాంపియన్ ఎడిషన్ కూడా అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,199 యువాన్లుగా (సుమారు రూ.49,600) ఉంది. మెర్సిడెస్ ఏఎంజీ పెట్రోనాస్ ఎఫ్1 టీమ్ థీమ్‌తో ఈ ఎడిషన్ రూపొందించారు. మిగతా వేరియంట్లు బ్లాక్, బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
రెడ్‌మీ కే50 అల్ట్రా స్పెసిఫికేషన్లు
రెడ్‌మీ కే50 అల్ట్రాలో 6.7 అంగుళాల 12 బిట్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 2,712 x 1,220 పిక్సెల్స్‌గా ఉంది. డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండటం విశేషం. అడాప్టివ్ హెచ్‌డీఆర్, డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10+, ఎస్‌జీఎస్ సర్టిఫైడ్ లో బ్లూ లైట్ మోడ్ వంటి ఫీచర్లు అందించారు.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంను రెడ్‌మీ కే50 అల్ట్రాలో అందించారు. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
డ్యూయల్ సిమ్, వైఫై 6, డ్యూయల్ బ్యాండ్ జీఎన్ఎస్ఎస్, ఎన్ఎఫ్‌సీ, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఐపీ53 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ కూడా ఉంది. సెంటర్డ్ పంచ్ హోల్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 120W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!