Affordable iPhone: ఈ చవకైన ఐఫోన్ ఇంక మనదేశంలో లేనట్లే.. మరో రెండు పాత ఐఫోన్లనూ నిలిపివేసిన యాపిల్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్ తన ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసిన అనంతరం పాత మోడళ్లు అయిన ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్‌లను మనదేశంలో నిలిపివేసింది.
యాపిల్ తన ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లను సెప్టెంబర్ 14వ తేదీన లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ఐఫోన్ మోడళ్లు రూ.69,900 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్లు లాంచ్ చేశాక యాపిల్ తన మూడు ఫోన్ల అమ్మకాలను మనదేశంలో నిలిపివేసింది. వీటిలో మనదేశంలో ఎంతోమంది కొనుగోలు చేసిన ఐఫోన్ ఎక్స్ఆర్ కూడా ఉంది.
ఐఫోన్ ఎక్స్ సిరీస్‌లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. లాంచ్ అయిన రోజు నుంచి మనదేశంలో మోస్ట్ పాపులర్ ఐఫోన్లలో ఒకటిగా ఈ ఫోన్ నిలిచింది. ఈ ఫోన్ ధర కాస్త తక్కువగా ఉండటంతో.. మిడ్ రేంజ్ ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకున్న చాలామంది ఈ ఫోన్ వైపు మొగ్గు చూపారు.
యాపిల్ ఆన్‌లైన్ స్టోర్ నుంచి ఈ ఫోన్‌ను తొలగించారు. అయితే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, రిలయన్స్ వంటి వంటి థర్డ్ పార్టీ ఈ-కామర్స్ వెబ్ సైట్లలో ఈ ఫోన్ ఇంకా అందుబాటులోనే ఉంది. ఇందులో 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.42,999 నుంచి ప్రారంభం కానుంది.
దీంతోపాటు ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లను కూడా మనదేశంలో నిలిపివేశారు. ఈ రెండు ఫోన్లను యాపిల్ ఆన్ లైన్ స్టోర్ నుంచి తొలగించారు. అయితే ఐఫోన్ ఎక్స్ఆర్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఇతర వెబ్ సైట్లు, రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్లు ఇంకా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టాక్ అయిపోయే వరకు వీటిని విక్రయించే అవకాశం ఉంది.
కొత్త ఐఫోన్ 13 మోడళ్ల లాంచ్ కారణంగా ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 11 స్మార్ట్ ఫోన్లపై కూడా డిస్కౌంట్‌ను అందించారు. ఇప్పుడు ఐఫోన్ 12 ధర రూ.65,900 నుంచి ప్రారంభం కానుంది. హైఎండ్ వేరియంట్ అయిన 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.80,900గా ఉంది. ఇక ఐఫోన్ 12 మినీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ ధర రూ.59,900కు తగ్గింది. హైఎండ్ వేరియంట్ ధర రూ.74,900గా ఉంది.
రెండేళ్ల క్రితం లాంచ్ అయిన ఐఫోన్ 11 ధరను కూడా యాపిల్ తగ్గించింది. ఈ ఫోన్ ఇప్పుడు రూ.49,900కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,900గా ఉంది. త్వరలో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కూడా జరగనుంది. దీనికి పోటీగా అమెజాన్ కూడా ఏదో ఒక సేల్ తీసుకువస్తుంది. ఈ సేల్స్‌లో ఈ స్మార్ట్ ఫోన్ల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.
Also Read: ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ఆండ్రాయిడ్ ఫోన్ ఇదే.. ధర ఎంతంటే?
Also Read: రియల్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. రూ.11 వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా!