ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ఆండ్రాయిడ్ ఫోన్ ఇదే.. ధర ఎంతంటే?
జర్మనీకి చెందిన నైట్రోకీ అనే సంస్థ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఆండ్రాయిడ్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే నైట్రో ఫోన్ 1.
ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ఫోన్ ఏది అంటే ఎవరైనా టక్కున చెప్పేది యాపిల్ ఫోన్ల గురించే. అయితే మరి ఆండ్రాయిడ్ ఫోన్ల గురించి చెప్పమంటే.. టక్కున ఒక ఫోన్ పేరు చెప్పడం కష్టం. కాస్త ఆలోచిస్తే.. గూగుల్ ఫోన్ల పేర్లు చెప్పవచ్చు. కానీ నైట్రోకీ అనే సంస్థ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఆండ్రాయిడ్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే నైట్రోఫోన్ 1. గూగుల్ పిక్సెల్ డివైసెస్ నుంచి సాఫ్ట్ వేర్ తీసేసి, గ్రాఫీన్ ఓఎస్ అనే ఆండ్రాయిడ్ రోమ్‌ను వేసినట్లు 9టు5 గూగుల్ నివేదించింది.
జర్మన్ కంపెనీ నైట్రోకీ లాంచ్ చేసిన మొదటి స్మార్ట్ ఫోన్ ఇదే. ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లు, పీసీలకు హార్డ్ వేర్ సెక్యూరిటీ కీలను విక్రయిస్తూ ఉంటుంది.
నైట్రో ఫోన్ 1 ధర
ఈ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఫోన్ కావచ్చు. అయితే దీని ధర కూడా చాలా ఎక్కువగానే ఉంది. షిప్పింగ్ చార్జీలు లేకుండా ఈ ఫోన్ ధర 630 యూరోలుగా(మనదేశం కరెన్సీ సుమారు రూ.54,600) నిర్ణయించారు. అయితే ఒకవేళ మీ దగ్గర గూగుల్ పిక్సెల్ 4ఏ స్మార్ట్ ఫోన్ ఉంటే.. మీరు గ్రాఫీన్ఓఎస్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
ఈ ఫోన్‌ను ప్రైవసీ కోసమే రూపొందించారు. కాబట్టి ఇందులో గూగుల్ ప్రొప్రెయిటరీ యాప్స్, సర్వీసులు ఏవీ రావు. అంటే గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఫొటోస్ వంటి వాటికి మీకు యాక్సెస్ లభించబోదన్న మాట. ఈ యాప్స్‌కు సంబంధించిన ఓపెన్ సోర్స్ వెర్షన్లను మీరు ఉపయోగించుకోవచ్చు. బ్రౌజింగ్‌ను సురక్షితం చేయడానికి ఇందులో క్రోమ్ బ్రౌజర్ బదులు.. క్రోమియం బ్రౌజర్‌ను అందించారు.
గూగుల్ సెక్యూరిటీ ప్రొటెక్షన్స్‌ను మించిన భద్రతా ప్రమాణాలతో ఈ గ్రాఫీన్ఓఎస్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. అంటే ఈ డివైస్ మరింత బలమైన ఆండ్రాయిడ్ కెర్నెల్, వెబ్ వ్యూ, కంపైలర్ టూల్ చైన్, ఫైల్ సిస్టం యాక్సెస్‌లపై పనిచేయనుంది. ప్రైవసీని మెరుగుపరచడానికి ఇందులో ఆటోమేటెడ్ షట్ డౌన్ ఆప్షన్ ఉంది. ఐఎంఈఐ నంబర్, మ్యాక్ అడ్రస్ వంటివి మాస్క్ అవుతాయి.
దీంతోపాటు మీరు మీ ఫోన్‌లో పిన్ టైప్ చేసేటప్పుడు ఎవరైనా చూసినా.. వారికి గుర్తు లేకుండా ఉండటానికి, ఆ నంబర్లు వరుసలో కాకుండా ర్యాండంగా డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ప్రైవసీకి పెద్దపీట వేసేవారు ఈ ఫోన్ కొనాలనుకుంటే విదేశాల నుంచి ఆర్డర్ చేసుకోవాల్సిందే!
Also Read: రియల్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. రూ.11 వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా!
Also Read: PUBG New State: పబ్జీ కొత్త గేమ్ వచ్చేస్తుంది.. ఇంకా మెరుగైన గ్రాఫిక్స్, అదిరిపోయే గేమ్‌ప్లే!