Weather Alerts: ఎప్పటికప్పుడు వెదర్ అప్ డేట్స్ తెలుసుకోవాలా? మీ ఫోన్ లో జస్ట్ ఈ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది!
వానాకాలం మొదలైన నేపథ్యంలో వాతావరణశాఖ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది. భారీ వర్షం, వరదలు లాంటి వివరాలను అందిస్తుంది. వీటిని వెంటనే తెలుసుకోవాలంటే మీ ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది.
దేశంలో ఈ ఏడాది అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యంగానే వానలు కురుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఉత్తరాదిన కుండపోత వానలు మొదలయ్యాయి. పలు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. యూపీ, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలకు పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని చోట్ల వరదల్లో లారీలు, కార్లు సహా పలు వాహనాలు కొట్టుకుపోయాయి. వంతెనలు, ఇండ్లు కూడా కూలిపోయాయి. మొత్తంగా దక్షిణాదితో పోల్చితే ఉత్తరాది ప్రాంతంలో వర్షాలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి.
వానలు తీవ్రం అవుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తోంది. ప్రతికూల పరిస్థితులను ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తోంది. వీటిని ప్రజలు పాటించాలని సూచిస్తోంది. వాతావరణ శాఖ అందించే ఈ వెదర్ అప్ డేట్స్ ఐఫోన్లతో పాటు ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ తెలుసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం మీరు మీ ఫోన్లలో చిన్న సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది.
వెదర్ అప్ డేట్స్ కోసం ఐఫోన్ లో చేయాల్సిన సెట్టింగ్స్
యాపిల్ ఐఫోన్‌లో ఇన్ బిల్ట్ వెదర్ యాప్‌ను అందించారు. ఇది వరద హెచ్చరికలతో సహా తీవ్ర వాతావరణ పరిస్థితులకు సంబంధించిన నోటిఫికేషన్లను అందిస్తుంది. ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేయడం ద్వారా యాప్ మీ పరిసరాల్లోని ప్రతికూల వాతావరణ పరిస్థితులకు సంబంధించిన నోటిఫికేషన్‌లను ఆటోమేటిక్‌గా పంపుతుంది. మీ ఐఫోన్ లో తీవ్రమైన వాతావరణ హెచ్చరికలను ఎలా పొందాలో చూద్దాం..
*ముందుగా మీ ఐఫోన్ హోమ్ స్క్రీన్‌లో ఉన్న వెదర్ యాప్ ను ఓపెన్ చేయండి.
*యాప్ ఇంటర్‌ఫేస్‌లో దిగువ కుడి మూలలో ఉన్న లిస్ట్ మీద క్లిక్ చేయాలి. ఇది మిమ్మల్ని అడిషన్ ఆప్షన్స్ కు తీసుకెళ్తుంది. ఇందులో తీవ్రమైన వాతావరణ హెచ్చరికలను ఎంచుకోవాలి.
*ఆ తర్వాత నోటిఫికేషన్లపై క్లిక్ చేయాలి. సివియర్ వెదర్ పక్కన ఉన్న స్విచ్‌ను ఆన్ చేయాలి.
*ఇక వరదలతో సహా తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు సంబంధించిన హెచ్చరికలను అనుమతిస్తుంది.
*మీరు తీవ్రమైన వాతావరణ హెచ్చరికలను స్వీకరించాలనుకుంటున్న ప్రదేశాన్ని ఎంచుకోండి.
*ఇక మీరు అలర్ట్ టోన్, వైబ్రేషన్ ఎంపికలను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలను పొందే అవకాశం ఉంటుంది.
వెదర్ అప్ డేట్స్ కోసం ఆండ్రాయిడ్ ఫోన్ లో చేయాల్సిన సెట్టింగ్స్
చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్ తయారీదారులు వారి స్వంత వాతావరణ యాప్‌లను అందిస్తున్నారు. అయితే, ఇన్ బిల్ట్ వెదర్ వార్నింగ్ ఫీచర్ ను కలిగి ఉండకపోవచ్చు. అయితే, గూగుల్ ప్లే స్టోర్‌లోని 'వెదర్ యాప్' హెచ్చరికలతో సహా సమగ్ర వాతావరణ వివరాలను అందిస్తుంది.
*ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్ లోని సెట్టింగులను ఎంచుకోండి.
*సెట్టింగ్‌ల మెనులో క్రిందికి స్క్రోల్ చేయండి. నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేయండి.
*లేటెస్ట్ లేదంటే మోర్ పై క్లిక్ చేయండి.
*సివియర్ వార్నింగ్స్ అప్షన్ ను ఎంచుకోండి.
*ఇకపై మీ స్మార్ట్ ఫోన్ వాతావరణ హెచ్చరికలను అందుకుంటుంది.
Read Also: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, ఇకపై ఫోన్ నెంబర్‌తో వెబ్‌కు లాగిన్ చేసుకోవచ్చు, ఇదిగో ఇలా!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial