Gmail ID: మీ జీమెయిల్ ఐడీని మార్చుకోవచ్చు - గూగుల్ కొత్త ఫీచర్ - ఇండియన్స్‌కే మొదటి చాన్స్
Google: జీమెయిల్ ప్రారంభమైన కొత్తలో అందరూ విచిత్రమైన పేర్లతో ఐడీలు క్రియేట్ చేసుకుని ఉంటారు. ఇప్పుడు వారందరికి ప్రొఫెషనల్ పేర్లతో ఐడీలు మార్చుకునే అవకాశం కల్పిస్తున్నారు.

Google could finally let you change your Gmail ID: ఫ్యాన్ బాయ్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్, లవర్ బోయ్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ లాంటి యూజర్ నేమ్స్ చాలా మందికి ఉంటాయి. జీమెయిల్ ప్రారంభమైన కొత్తలో రాబోయే రోజుల్లోఅది ఉద్యోగానికి, ఉపాధికి కీలకం అవుతుందని అందరికీ చెప్పుకోవాల్సి వస్తుందని అనుకుని ఉండరు. కానీ ఇప్పుడు ఆ మెయిలే అత్యంత కీలకం. దాన్ని తీసేసి కొత్త మెయిల్ తీసుకుందామంటే అందులో బోలెడంత మెమరీ ఉంటుంది. మార్చుకునే చాన్స్ కూడా ఉండదు. ఇప్పుడు మొదటి సారి గూగుల్ ఐడీని మార్చుకునే అవకాశం కల్పిస్తున్నారు.
గూగుల్ తన యూజర్ల కోసం ఒక చారిత్రాత్మక మార్పును తీసుకురాబోతోంది. ఇప్పటివరకు జీమెయిల్ ఐడీని మార్చుకోవాలంటే కొత్త అకౌంట్ తెరవడం తప్ప మరో మార్గం ఉండేది కాదు. కానీ ఇప్పుడున్న అకౌంట్‌లోనే ఈమెయిల్ అడ్రస్‌ను మార్చుకునే వెసులుబాటును గూగుల్ కల్పిస్తోంది. ముఖ్యంగా గతంలో సరదాగా పెట్టిన ఐడీలను ఇప్పుడు ప్రొఫెషనల్‌గా మార్చుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప సువర్ణావకాశం. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ పాత డేటాను కోల్పోయే ప్రమాదం లేదు. మీరు ఐడీ మార్చుకున్నా మీ పాత మెయిల్స్, ఫోటోలు, డ్రైవ్ ఫైల్స్ అన్నీ సురక్షితంగా ఉంటాయి.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మీరు కొత్త ఐడీకి మారిన తర్వాత కూడా ఎవరైనా మీ పాత ఐడీకి మెయిల్ పంపితే , అది ఆటోమేటిక్‌గా మీ కొత్త అడ్రస్‌కే చేరుతుంది. తద్వారా పాత కాంటాక్ట్స్ మిస్ అవుతాయనే ఆందోళన అవసరం లేదు. అయితే ఈ ఫీచర్‌ను గూగుల్ కొన్ని నిబంధనలతో తీసుకువస్తోంది. ఒక యూజర్ తన జీవితకాలంలో గరిష్టంగా మూడు సార్లు మాత్రమే ఐడీని మార్చుకోవడానికి వీలుంటుంది. అలాగే ఒకసారి మార్పు చేసిన తర్వాత, మళ్ళీ మార్చుకోవాలన్నా లేదా దానిని డిలీట్ చేయాలన్నా కనీసం ఒక ఏడాది పాటు వేచి చూడాల్సి ఉంటుంది. మీరు వదిలేసిన పాత ఐడీని వేరే ఎవరూ వాడుకోకుండా గూగుల్ మీ అకౌంట్‌కే రిజర్వ్ చేసి ఉంచుతుంది.
Google is rolling out a new option that lets users change their Gmail address. Users can switch to a new @gmail.com name without creating a new account. Emails sent to the old address will still arrive in the same inbox. The change is rolling out slowly.#Google #Gmail pic.twitter.com/bYOwrTm5rh
— TechPP (@techpp) December 25, 2025
ప్రస్తుతానికి ఈ ఫీచర్ గురించి గూగుల్ సపోర్ట్ పేజీలో హిందీలో సమాచారం కనిపిస్తోంది, కాబట్టి భారత్‌లోనే ఇది ముందుగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్‌లోని పర్సనల్ ఇన్ఫో విభాగంలోకి వెళ్లి మీ ఈమెయిల్ అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ మార్పు వల్ల యూజర్లకు తమ ఐడెంటిటీని అప్‌డేట్ చేసుకోవడం గతంలో కంటే చాలా సులభతరం కానుంది.





















