Emergency Alert: మీ ఫోన్‌కు ఈ ఎమర్జెన్సీ ప్లాష్ అలర్ట్ వచ్చిందా? కంగారు వద్దు, ఆ మెసేజ్ దేనికంటే?
ఇవాళ మధ్యహ్నం 12.19 గంటలకు దేశ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లకు ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ చూసి వినియోగదారులు అయోమయంలో పడ్డారు.
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లకు ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ పంపించింది. ఈ ఫ్లాష్ మెసేజ్ చూసి వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. జులై, ఆగష్టు నెలల్లో మాదిరిగానే ఇప్పుడు కూడా చాలా మంది యూజర్లకు ఫ్లాష్ మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ వచ్చిన వెంటనే పెద్దగా బీప్ శబ్దం వినిపించింది. ఈ అలర్ట్ ను చూసి చాలా మంది వినియోగదారులు కంగారు పట్టారు. అయితే, ఈ మెసేజ్ తో భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. స్మార్ట్ ఫోన్లలో టెస్ట్ ఫ్లాష్ ద్వారా భారత్ లో అత్యవసర హెచ్చరిక వ్యవస్థను మరోసారి టెస్ట్ చేసినట్లు వెల్లడించింది.
ముందస్తు జాగ్రత్త కోసమే టెస్ట్ మెసేజ్!
భారత టెలీ కమ్యూనికేషన్ విభాగం రా సెల్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్ నుంచి ఈ టెస్టింగ్ మెసేజ్ పంపినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలర్ట్ టెక్స్ట్ సిస్టమ్ ను ఇప్పటికే రెండుసార్లు పరీక్షించగా, మూడో టెస్టింగ్ లో భాగంగా ఈ మెసేజ్ పంపించినట్లు వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను అలర్ట్ చేసేందుకు ఇలాంటి మెసేజ్ పంపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. అందులో భాగంగానే ఇవాళ(శుక్రవారం) మధ్యాహ్నం 12.19 గంటలకు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లలో మెసేజ్ సెంట్ చేసినట్లు తెలిపింది.
అలర్ట్ మెసేజ్ లో ఏం ఉందంటే?
"ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ ద్వారా పంపబడిన శాంపిల్ టెస్ట్ మెసేజ్. దయచేసి ఈ మెసేజ్ ను వదిలేయండి. మీ నుంచి ఎలాంటి యాక్షన్ అవసరం లేదు. ఈ మెసేజ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ TEST Pan-India ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ నుంచి పంపించబడింది. ఇది ప్రజల భద్రతను మెరుగుపరచడంతో పాటు అత్యవసర సమయాల్లో సకాలంలో హెచ్చరికలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది” అని ఫ్లాష్ మెసేజ్ కనిపించింది.
దేశ ప్రజలందరినీ ఓకేసారి అప్రమత్తం చేసే అవకాశం
విపత్తుల సమయంలో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలను ఒకేసారి అప్రమత్తం చేసేందుకు ఓ వ్యవస్థను సిద్ధం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగానే మొబైల్ ఆపరేటర్లు , సెల్ బ్రాడ్ కాస్టింగ్ వ్యవస్థలకు సంబంధించిన అత్యవసర హెచ్చరికల సామర్థ్యాన్ని, ప్రభావాన్ని అంచనా వేస్తున్నట్లు కేంద్ర టెలి కమ్యూ నికేషన్ విభాగం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇలాంటి పరీక్షనుల నిర్వహిస్తున్నట్లు తెలిపింది. భూకంపాలు, సునామీ, వరదలు సహా పలు ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను కాపాడేందుకు, ముందస్తుగా ఇలాంటి హెచ్చరికలను పంపించనున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీతో కలిసి ప్రజలను సురక్షితంగా ఉండేలా అలర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే జూలై 20, ఆగస్టు 17న కూడా దేశ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు ఇలాంటి టెస్ట్ మెసేజ్‌లు పంపినట్లు కేంద్రం ప్రకటించింది.
Read Also: వినియోగదారులను మోసం చేసిన గూగుల్, భారీ జరిమానా
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial