Rohit Sharma 264: ఆ ‘264’కు ఏడేళ్లు.. ఆ రోజు రోహిత్ బద్దలుకొట్టిన రికార్డులు ఇవే!
రోహిత్ శర్మ శ్రీలంకపై 264 పరుగులు సాధించి నేటికి ఏడేళ్లు పూర్తవుతుంది. ఆ ఇన్నింగ్స్‌లో రోహిత్ బద్దలు కొట్టిన రికార్డులు ఇవే..
సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు(నవంబర్ 13వ తేదీ).. ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ‘హిట్ మ్యాన్.. హిట్ మ్యాన్..’ అంటూ కేకలు.. అందరి దృష్టి ఒకరి బ్యాట్ మీదనే. బౌండరీ రోప్ దగ్గరికి ఇన్నిసార్లు వెళ్లాలా.. ప్రేక్షకుల మధ్యలో ఇన్నిసార్లు వాలిపోవాలా.. అని బంతే భయపడిన రోజు.. ఆ బంతికే నోరుంటే ‘ఇలా కొడతారేంటి సార్.. పగిలిపోతే ఎవరు రెస్పాన్సిబులిటీ’ అనేదేమో.. ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో 264 పరుగులు సాధించి అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును రోహిత్ తన ఖాతాలో వేసుకున్న రోజు ఇదే.. సాధారణంగా 264 పరుగులంటే వన్డే క్రికెట్‌లో ఒక జట్టు గెలవడానికి సరిపోయే స్కోరు. కానీ అంత స్కోరును రోహిత్ ఒక్కడే చేసి క్రికెట్ నిపుణులను సైతం ఆశ్చర్యపోయేలా చేశాడు.
అంత భారీ స్కోరు చేశాడంటే.. ఆడిన మొదటి బంతి నుంచే విరుచుకుపడి ఉంటాడులే.. అదృష్టం కలిసి వచ్చి ఉంటుందిలే.. అనుకోవడం సహజం. కానీ ఆరోజు అలా ఏమీ జరగలేదు. రోహిత్ శర్మకు ఒక్క అవకాశం మాత్రమే లభించింది. 16 బంతుల్లో నాలుగు పరుగుల వద్ద ఉన్నప్పుడు హిట్ మ్యాచ్ ఇచ్చిన క్యాచ్‌ను తిసార పెరీరా వదిలేశాడు. ఆ క్యాచ్ తనని ఎన్నో రోజులు వెంటాడి ఉంటుంది.
శ్రీలంకతో జరిగిన ఆ మ్యాచ్‌లో రోహిత్ ఆరోజు ఇన్నింగ్స్‌ను చాలా నిదానంగా ప్రారంభించాడు. మొదటి వికెట్‌కు 40 పరుగులు జోడిస్తే... అందులో 28 రహానేవే. రోహిత్ శర్మ మొదటి 50 పరుగులు పూర్తి చేయడానికి 72 బంతులు తీసుకున్నాడు. అయితే 100 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అక్కడి నుంచి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ వేరే లెవల్‌లో సాగింది. 100 నుంచి 150కు చేరడానికి కేవలం 25 బంతులు మాత్రమే రోహిత్.. ఆ తర్వాతి 50 పరుగులను కూడా 26 బంతుల్లోనే పూర్తి చేసుకున్నాడు. 200 పరుగులు పూర్తి చేశాక పూర్తిగా వీడియో గేమ్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు.
కేవలం 15 బంతుల్లోనే 200 నుంచి 250కు చేరుకున్నాడు. 173 బంతుల్లో ఏకంగా 33 ఫోర్లు, 9 సిక్సర్లతో రోహిత్ శర్మ 264 పరుగులు సాధించాడు. 48వ ఓవర్ చివరి బంతికి నువాన్ కులశేఖర బౌలింగ్‌లో ఆఫ్‌సైడ్ వైడ్ లైన్ వెళ్తున్న బంతిని ఫ్లిక్‌తో లెగ్ సైడ్ సిక్సర్ కొట్టిన షాట్ అయితే ఇన్నింగ్స్‌కే హైలెట్. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రోహిత్ భారీ షాట్ కొట్టబోయి అవుటయ్యాడు.
రోహిత్‌కు టీమిండియా గార్డ్ ఆఫ్ హానర్‌ను కూడా ఆ మ్యాచ్‌లో అందించింది. వన్డే క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన రికార్డును కూడా రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌తో సాధించాడు. ఒక ఇన్నింగ్స్‌లో బౌండరీలు, సిక్సర్లతో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ కూడా రోహిత్ శర్మనే. 186 పరుగులను కేవలం బౌండరీలు, సిక్సర్ల ద్వారానే రోహిత్ సాధించాడు. ఆ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. గాయంతో మూడు నెలల పాటు జట్టుకు దూరమయ్యాక రోహిత్ ఆడిన మొదటి మ్యాచ్ ఇదే.
రోహిత్ హీరోయిక్ ఇన్నింగ్స్‌తో భారత్ ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్ల నష్టానికి 404 పరుగులు చేసింది. అందులో రోహిత్‌వే 264 పరుగులు కాగా.. మిగతా జట్టు మొత్తం కలిసి 140 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 251 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో భారత్ 153 పరుగులతో విజయం సాధించింది.
Also Read: మొదటిసారి ఫైనల్స్‌కు న్యూజిలాండ్.. బై.. బై.. ఇంగ్లండ్
Also Read: క్రికెటర్ కుమార్తెకు అత్యాచార బెదిరింపుల కేసులో హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్ !
Also Read: 'హిట్ మ్యాన్' శకం మొదలు..! కెప్టెన్‌గా ఎంపిక చేసిన బీసీసీఐ.. కివీస్ సిరీసుకు జట్టు ఎంపిక
Also Read: కేన్ మామ వర్సెస్ డేవిడ్ భాయ్.. అరెరే.. పెద్ద సమస్యే వచ్చి పడిందే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి