Vinesh Phogat Silver Medal: వినేశ్ ఫొగాట్ సిల్వర్ మెడల్ పై CAS తీర్పు వాయిదా, అప్పటివరకూ ఎదురుచూపులే
Vinesh Phogat Silver Medal | భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చేసిన అప్పీల్ పై కోర్ట్ ఆఫ్ ఆర్బిటరేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) తమ తీర్పును మరోసారి వాయిదా వేసింది. ఆగస్టు 16న నిర్ణయాన్ని వెల్లడించనుంది.
Vinesh Phogat at Paris Olympics 2024 | పారిస్: భారత రెజ్లర్ వినేష్ ఫొగాట్ సిల్వర్ మెడల్ అప్పీల్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. కోర్ట్ ఆఫ్ ఆర్బిటరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ (CAS) తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు. వినేష్ ఫొగాట్ కు రజత పతకం రావాలని చేసిన అప్పీల్ పై విచారించిన సీఏఎస్ తమ నిర్ణయాన్ని ఆగస్టు 16న వెల్లడిస్తామని పేర్కొంది. 50 కేజీల విభాగంలో సంయుక్తంగా సిల్వర్ మెడల్ ఇవ్వాలని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సీఏఎస్ ను ఆశ్రయించడం తెలిసిందే. మొదట ఈ పిటిషన్ విచారించిన సీఏఎస్ ఇరువైపుల వాదనలు విన్నది. ఆగస్టు 10న తీర్పు వెల్లడించాల్సి ఉండగా, ఆగస్టు 13కి వాయిదా వేసింది. నేడు సైతం సీఏఎస్ తమ నిర్ణయాన్ని వెల్లడించకుండా, ఈ శుక్రవారానికి వాయిదా వేసిందని ఐఓఏ తెలిపింది.
విశ్వక్రీడల్లో కచ్చితంగా పతకంతోనే తిరిగి వస్తానని తల్లికి మాటిచ్చి పారిస్ ఒలింపిక్స్ ఆడేందుకు వినేశ్ ఫొగాట్ వెళ్లింది. ప్రపంచ ఛాంపియన్లు, ఒలింపిక్స్ మాజీ ఛాంపియన్లను సైతం తన ఉడుంపట్టుతో చిత్తుచేసి ఫైనల్ చేరింది. దాంతో పసిడి నెగ్గుతుందని, ఏమైనా పొరపాటు జరిగినా రజత పతకంతో స్వదేశానికి తిరిగొస్తుందని యావత్ భారతావని భావించింది. కానీ ఫైనల్ రోజు బరువు చెక్ చేయగా, నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందని ఒలింపిక్స్ ఫైనల్ ఆడకుండా అనర్హత వేటు పడింది. ఆమె 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో బరిలోకి దిగింది. కానీ అనూహ్యంగా ఫైనల్ కు కొన్ని గంటల ముందు బరువు చెక్ చేసుకోగా, వంద గ్రాములు ఎక్కువ వచ్చింది. రాత్రంతా స్కిప్పింగ్, ఇతరత్రా వ్యాయమాలు చేసి బరువు తగ్గేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. కోచ్, సిబ్బంది పర్యవేక్షణలో ఎంతగానో శ్రమించి వర్కౌట్లు చేసినా ప్రయోజనం లేకపోయింది. నిర్ణీత బరువు కంటే ఎక్కువ వెయిట్ ఉందని వినేశ్ ఫొగాట్ ను నిబంధనల ప్రకారం ఫైనల్ ఆడకుండా డిస్ క్వాలిఫై చేయడంతో యావత్ భారతావని ఆమెకు మద్దతుగా నిలిచింది.
The Court of Arbitration for Sport (CAS) extends till August 16 ( 6 pm-Paris time) the decision on Indian wrestler Vinesh Phogat's appeal to be awarded the joint silver medal in the women's 50kg freestyle category: IOA#ParisOlympics2024
— ANI (@ANI) August 13, 2024
సెమీస్ చేరినప్పుడు, ఫైనల్ చేరిన సమయంలో వినేశ్ ఫొగాట్ నిర్ణీత బరువు ఉంది. దాంతో అప్పటివరకూ నిబంధనల్ని పరిగణనలోకి తీసుకుని తనకు కనీసం రజత పతకమైనా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. అయితే నిబంధనల ప్రకారం నడుచుకుని భారత రెజ్లర్ ను డిస్ క్వాలిఫై చేశామని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వాదిస్తున్నాయి. యూడబ్ల్యూడబ్ల్యూ రూల్ బుక్‌లో కొన్ని లొసుగులు కనిపిస్తున్నాయి.
నిబంధనల్లో లొసుగులు, మనకు కలిసొచ్చేనా ?
యూడబ్ల్యూడబ్ల్యూ నిబంధనల ప్రకారం ఎవరైనా రెజ్లర్ రెపిచేజ్ రౌండ్ ఆడాలంటే తనపై నెగ్గిన రెజ్లర్ ఫైనల్ చేరాలి. అప్పుడు రెపిచేజ్ ఛాన్స్ ద్వారా కాంస్య పతకం కోసం తలపడేందుకు ఛాన్స్ ఉంటుంది. పారిస్ ఒలింపిక్స్‌లో ప్రి క్వార్టర్స్‌లో జపాన్ రెజ్లర్ సుసాకిని వినేశ్ ఫొగాట్ ఓడించింది. క్వార్టర్స్, సెమీస్ లో విజేతగా నిలిచిన భారత రెజ్లర్ ఫైనల్ చేరింది. రూల్స్ ప్రకారం వినేశ్ చేతుల్లో ఓడిన సుసాకికి రెపిచేజ్ రౌండ్ ఛాన్స్ దక్కింది. మరోవైపు యూడబ్ల్యూడబ్ల్యూ రూల్స్ ప్రకారం నిర్ణీత పరిమితి కంటే అధిక బరువుతో ఫైనల్ కు అనర్హత వేటు పడిన వినేశ్ ఫొగాట్ ఫైనలిస్ట్ కాదు. అలాంటప్పుడు వినేశ్ చేతిలో ఓడిన సుసాకికి రెపిచేజ్ రౌండ్ ఛాన్స్ ఎందుకిచ్చారని కాస్ (సీఏఎస్) ఎదుట వాదనలు వినిపిస్తే ప్రయోజనం కలిగే ఛాన్స్ ఉంది.