Pullela Gopichand: క్రికెటర్ అవుదామనుకున్న గోపీచంద్... రాకెట్ ఎందుకు పట్టుకున్నాడు?
డాక్టర్ అవ్వబోయి యాక్టరయ్యాడు. క్రికెటర్ అవుదామనుకుని... ఆ తర్వాత ఏదో కారణంగానో మరో క్రీడను ఎంచుకున్న వాళ్లను మనం చూశాం. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ఈ కోవకు చెందినవాడే.
డాక్టర్ అవ్వబోయి యాక్టరయ్యాడు. క్రికెటర్ అవుదామనుకుని... ఆ తర్వాత ఏదో కారణంగానో, ఇతరుల ప్రోత్సాహంతో మరో క్రీడను ఎంచుకున్న వాళ్లను మనం చూశాం. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ఈ కోవకు చెందినవాడే. అవును, అతడు మొదట బ్యాడ్మింటన్ ప్లేయర్ అవుదామని అనుకోలేదట. క్రికెటర్ అవుదామని అనుకున్నాడట. కానీ, తన సోదరుడి ప్రోత్సాహంతో బ్యాడ్మింటన్ వైపు మొగ్గుచూపాడు.
ఇక అక్కడ నుంచి వెనుదిరిగి చూడలేదు. ఆసక్తిలేని క్రీడ కదా అని ఎక్కడా అసహనం వ్యక్తం చేయలేదు. అంచెలంచెలుగా మెలకువలు నేర్చుకుంటూ రాణిస్తూ వచ్చాడు.
ఈ క్రమంలోనే అతడు 2001లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని ముద్దాడిన రెండో భారత క్రీడకారుడిగా నిలిచాడు. ఆ తర్వాతి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా ఈ టోర్నీలో విజయం సాధించలేదు. సైనా, సింధు, కిదాంబి శ్రీకాంత్ వీరు కూడా టోర్నీ మధ్యలోనే నిష్క్రమించారు. గోపీచంద్ కంటే ముందు ప్రకాశ్ పదుకొణె ఈ టోర్నీలో విజయం సాధించారు. ప్రకాశ్ పదుకొణె వద్దే శ్రీకాంత్ శిక్షణ పొందాడు.
1996లో గోపీచంద్ మొదటిసారి జాతీయ ఛాంపియన్‌షిప్ నెగ్గాడు. 2000 వరకు వరుసగా 5సార్లు ఈ టోర్నీలో నెగ్గాడు. 1994లో గోపీచంద్ గాయాల బారిన పడ్డాడు. సర్జరీ అనంతరం కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. దీంతో రెండేళ్లపాటు బ్యాడ్మింటన్‌కు దూరమయ్యాడు. 2001లో ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ షిప్ అనంతరం వరుస గాయాల బెడద కారణంగా రిటైర్మెంట్ ప్రకటించాడు.
రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా అతనికి బ్యాడ్మింటన్ పై ఆసక్తి తగ్గలేదు. దీంతో హైదరాబాద్‌లో అకాడమీ స్థాపించి శిక్షణ ఇస్తూ తన మక్కువ చాటుకున్నాడు. గోపీచంద్ కోచ్‌గా ఉన్న సమయంలోనే సైనా, సింధు, శ్రీకాంత్ తదితర క్రీడాకారులు భారత్ తరపున అద్భుత విజయాలు సాధించారు. రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు ఫైనల్ చేరి రజతం సాధించింది. ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తొలి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది.
2002లో సహచర క్రీడాకారిణి లక్ష్మీని పెళ్లాడాడు గోపీచంద్. వీరికి గాయత్రి, విష్ణు సంతానం. గాయత్రి ఇప్పటికే బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా పలు పోటీల్లో పాల్గొంటోంది. కుమారుడు విష్ణు గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.
1998 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం, కాంస్యం సాధించిన గోపీచంద్, 1999లో అర్జున అవార్డు, 2001 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 2005లో పద్మ శ్రీ, 2009లో ద్రోణాచార్య, 2014లో పద్మ భూషణ్ అవార్డులు అందుకున్నాడు.
ఒలింపిక్స్ లాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో ఇప్పటి వరకు ఎవరూ స్వర్ణం గెలవలేదు. మరి, గోపీచంద్ దగ్గర శిక్షణ పొందే క్రీడాకారులు ఎవరు స్వర్ణం సాధిస్తారో చూద్దాం. అలాగే గోపీచంద్ తర్వాత ఇప్పటి వరకు ఎవరూ అందుకోని ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌ను ఎవరు గెలుస్తారో వేచి చూద్దాం.