ICC World Cup 2023: కేన్ మామ వచ్చేస్తున్నాడు! , కీలక పోరుకు ముందు జట్టులోకి
ICC World Cup 2023: సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు కేన్ అందుబాటులో ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన బొటవేలికి గాయమైంది. దీంతో రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకున్నాడు.
ఈ ప్రపంచకప్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకుపోయిన న్యూజిలాండ్.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో పరాజయాలతో వెనకడుగు వేసింది. టీమిండియా, ఆస్ట్రేలియా చేతుల్లో ఓటములతో కివీస్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా సెమీస్ చేరాలంటే నవంబర్ ఒకటిన సౌతాఫ్రికాతో జరుగబోయే కీలక మ్యాచ్‌లో విజయం సాధించాల్సి ఉంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు గుడ్ న్యూస్ అందింది. వరుస ఓటములతో కొంత నిరాశతో ఉన్న న్యూజిలాండ్ జట్టులోకి... స్టార్ ఆటగాడు, రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తిరిగి రానున్నట్లు తెలుస్తోంది.
సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు కేన్ మామ అందుబాటులో ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 13న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన బొటవేలికి గాయమైంది. దీంతో రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకున్న విలియమ్సన్ ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు. న్యూజిలాండ్ సౌతాఫ్రికా మ్యాచ్‌లో కేన్ అందుబాటులోకి వస్తే కివీస్ బ్యాటింగ్ లైనప్ బలోపేతం కానుంది. కేన్ తిరిగి జట్టులోకి వచ్చే విషయమై న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. విలియమ్సన్ పూర్తిగా కోలుకుని జట్టులో చేరితే విల్ యంగ్‌పై వేటు పడే అవకాశం ఉంది. కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో న్యూజిలాండ్ గత రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొంది. టీమిండియా, ఆస్ట్రేలియాతో జరిగిన హోరాహోరీ సమరంలో కివీస్ పోరాడి ఓడింది. ఈ రెండు మ్యాచ్‌లకు ముందు పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న న్యూజిలాండ్ ఇప్పుడు మూడో స్థానంలో కొనసాగుతోంది. భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు టాప్-4లో కొనసాగుతున్నాయి. ప్రపంచకప్‌లో ఇకపై అద్భుతాలేవి జరగకపోతే ఈ నాలుగు జట్లు సెమీస్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తుంది. కేన్ విలియమ్సన్ జట్టులో చేరితే కివీస్ బ్యాటింగ్ లైనప్ బలోపేతంగా మారుతుంది. దక్షిణాఫ్రికాతో జరగనున్న మ్యాచ్‌లో కేన్ జట్టులో చేరితే గెలుపు అవకాశాలు మెరుగవుతాయని మాజీలు అంచనా వేస్తున్నారు.
నవంబర్ 1న పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. విలియమ్సన్ గాయం తీవ్రమైనది కాదని.. అతను దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో తిరిగి జట్టులోకి వచ్చే ఆవకాశం ఉందని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపారు. కానీ కేన్ తుది జట్టులోకి వస్తాడో రాడో ఈరోజు వచ్చే వైద్య నివేదికను బట్టి ఉంటుందని స్పష్టం చేశాడు. కేన్ విలియమ్స్‌ను గాయం నుంచి కోలుకున్నాడన్న వార్త సంతోష పెట్టే లోగానే ఇప్పుడు మారో ఆటగాడి గాయం కివీస్‌ను భయపెడుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పేసర్ లాకీ ఫెర్గూసన్ గాయపడ్డాడు. అయితే పెర్గూసన్ స్థానంలో మార్క్ చాప్‌మన్, నిగ్గల్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉందని స్టెడ్ వెల్లడించారు. ఫెర్గూసన్ గాయాన్ని ఇవాళ స్కానింగ్ చేస్తారని.. తీవ్రతను బట్టి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని వివరించాడు. ఫెర్గూసన్ జట్టులోకి తిరిగి రావడానికి వారం సమయం పట్టవచ్చని భావిస్తున్నామని తెలిపాడు. ఫెర్గూసన్ తదుపరి గేమ్‌లో ఆడతాడా లేదా అందుబాటులో ఉంటాడా అనేది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని న్యూజిలాండ్ కోచ్ తెలిపాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ సెమీఫైనల్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది.