Virat Kohli Record: సచిన్ సరసన కోహ్లీ, ఎలైట్ క్లబ్ లోకి ప్రవేశం- ఆసీస్ పై ఇద్దరికి మాత్రమే సాధ్యమైన ఘనత
Sachin Vs Virat: క్రికెట్ ప్రపంచంలో రికార్డులను కొల్లగొడుతూ ముందుకు సాగుతున్న భారత స్టార్ కోహ్లీ.. తాజాగా మరో రికార్డులో భాగం పంచుకున్నాడు. దిగ్గజ క్రికెటర్ సచిన్ సరసన తను నిలిచాడు.
Ind Vs Aus Test Series: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా ఒక రికార్డులో భాగం అయ్యాడు. ఇప్పటివరకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కి మాత్రమై సాధ్యమైన ఘనతను తను కూడా సాధించాడు. శనివారం బ్రిస్బేన్ లో ఆసీస్ తో మూడో టెస్టును కోహ్లీ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ద్వారా ఆసీస్ పై వంద అంతర్జాతీయ మ్యాచ్ లు పూర్తి చేసుకున్న రెండో క్రికెటర్ గా నిలిచాడు. గతంలో సచిన్ మాత్రమే కంగారూలపై వందకుపైగా మ్యాచ్ లాడాడు. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో సచిన్.. ఆసీస్ పై 110 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. ఇక కోహ్లీ తాజా మ్యాచ్ తో వందో మ్యాచ్ ను పూర్తి చేసుకున్నాడు.
Virat Kohli becomes the second player, after Sachin Tendulkar, to play 100 matches against Australia in International Cricket 🇮🇳 pic.twitter.com/1auPyzkacp
— Rt_Sports_Tv🇮🇳 (@Rt_Sports_Tv) December 14, 2024
50కిపైగా సగటుతో 17 సెంచరీలు..
ఇక ఇప్పటివరకు ఆసీస్ పై 28 టెస్టులు, 49 వన్డేలు, 23 టీ20లను కోహ్లీ ఆడాడు. ఓవరాల్ గా 117 ఇన్నింగ్స్ లలో బరిలోకి దిగి 50.24 సగటుతో 5326 పరుగులు సాధించాడు. ఇందులో 17 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక ఆసీస్ పై అత్యధిక మ్యాచ్ లు ఆడిన వారి వివరాలు పరిశీలిస్తే, సచిన్ (110), కోహ్లీ (100), వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డేస్మండ్ హేన్స్ (97), భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (91), వెస్టిండీస్ గ్రేట్ సర్ వివియన్ రిచర్డ్స్ (88) మ్యాచ్ లను ఆడారు. ఇక మరో రెండు, మూడేళ్లు కోహ్లీ కనీసం క్రికెట్ ఆడగలడు కాబట్టి, సచిన్ ను అధిగమించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక తాజాగా ఆసీస్ తో సిరీస్ విషయానికొస్తే పెర్త్ లో అజేయ సెంచరీతో కెరీర్ లో 30 శతకాన్నినమోదు చేసిన కోహ్లీ.. మిగతామూడు ఇన్నింగ్స్ లో తేలిపోయాడు. వరుసగా 7, 5, 11 పరుగులతో నిరాశ పరిచాడు.
బ్రిస్బేన్ టెస్టు తొలిరోజు వర్షం అడ్డంకి..
ఇక బ్రిస్బేన్ టెస్టులో ఓవర్ కాస్ట్ కండీషన్లతోపాటు ప్రారంభంలో బౌలింగ్ కు అనుకూలిస్తుందన్న అంచనాతో భారత కెప్టెన్ రోహిత్ టాస్ నెగ్గగానే బౌలింగ్ తీసుకున్నాడు. అయితే అతను అనుకున్నట్లుగా తొలి 13 ఓవర్లలో ఆసీస్ వికెట్లేమీ కోల్పోలేదు. నాథన్ మెక్ స్విన్నీ (4 బ్యాటింగ్), ఉస్మాన్ ఖవాజా (18 బ్యాటింగ్)తో భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. తొలిరోజు ఆటముగిసే సరికి ఆసీస్ వికెట్లేమీ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. బౌలర్లు కూడా చక్కని లైన్ అండ్ లెంగ్త్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆకాశ్ దీప్ స్టంప్ లైన్ లో బౌలింగ్ వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలని చూశాడు. ఇక ఈ మ్యాచ్ లో ఆసీస్ ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. బౌలర్ స్కాట్ బోలాండ్ స్థానంలో జోష్ హేజిల్ వుడ్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఇక బ్రిస్బేన్ లో రాబోయే మూడు రోజులు వర్షం కురుస్తుందని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం వరకు వర్షం మ్యాచ్ కు అడ్డు కలిగించే అవకాశముందని పేర్కొంది. ఇక తొలిరోజు ఆట నష్టంతో రెండోరోజు కాస్త ముందుగానే ఆటను మొదలు పెడతారు. వర్షం అడ్డు రాకుంటే రోజుకు 98 ఓవర్లపాటు బౌలింగ్ చేసే అవకాశముంది. ఐదు టెస్టుల సిరీస్ లో ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ 1-1తో సమంగా ఉంది.
Also Read: మళ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ పేసర్- టీ20 ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ నెగ్గడంలో కీలకపాత్ర