ICC Champions Trophy: హైబ్రీడ్ మోడల్ - ఇకపై పాక్‌తో మ్యాచ్‌లకు భారత్‌కు ఆ ప్లస్ పాయింట్ ఉండబోదు, ఐసీసీ నిర్ణయంపై అభిమానుల ఆవేదన
Cricket News: 2017లో చాంపియన్‌గా నిలిచిన పాక్.. సొంతగడ్డపై వచ్చే ఏడాది జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఇందులో ఎనిమిది జట్లు ఆడనున్నాయి.
Ind Vs Pak: వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి అనేక తర్జనభర్జనల మద్య గ్రీన్ సిగ్నల్ లభించింది. ముఖ్యంగా టోర్నీ నిర్వహించే పాకిస్థాన్‌లో భారత్ పర్యటించబోనని తేల్చడంతో టోర్నీ నిర్వహణ సందిగ్ధంలో పడింది. అయితే భారత్ ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించాలనే డిమాండ్‌ను బీసీసీఐ ముందుకు తెచ్చింది. చాలాకాలం మల్లగుల్లాలు పడిన తర్వాత ఐసీసీ ఈ నిర్ణయానికి ఓకే చెప్పింది. అయితే ఇక్కడే పాకిస్తాన్ మెలికపెట్టింది. దీని ద్వారా రోబోయే ఐసీసీ, ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించే ఆసియా కప్ టోర్నీల్లో భారత్‌కు ఉండే సానుకూలత మిస్సయ్యే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ద్వైపాక్షిక సిరీస్‌లు కట్..
నిజానికి 2008 ముంబై దాడుల తర్వాత సీమాంతర ఉగ్రవాదానికి పాక్ కేంద్రం అయిందనే భావనతో ఆ దేశంతో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను బీసీసీఐ తెంచుకుంది. అప్పటి నుంచి ఆ దేశంలో ఇండియా ఆడలేదు. అయితే 2012లో మాత్రం మనదేశంలో పాక్ పర్యటించింది. ఆ తర్వాత ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. కేవలం ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లోనే ఇరుజట్లు పోటీపడ్డాయి. ఇక చివరిసారిగా 2005లో టీమిండియా పాక్‌లో ఆడగా.. ఆ తర్వాత నుంచి ఐసీసీ, ఆసియా కప్ (ఏసీసీ టోర్నీ)ల్లో తటస్థ వేదికపైనే పాక్‌తో భారత్ తలపడుతోంది. అయితే భారత్ ఆతిథ్యం ఇచ్చిన టోర్నీల్లో మాత్రం పాక్ మన దేశానికి వచ్చి ఆడుతోంది. అయితే ఇకపై ఈ పరిస్థితి ఉండబోదని తాజాగా తేటతెల్లమైంది. తమ దేశంలో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి భారత్ హాజరుకాకపోతే, భారత్‌లో జరిగే టోర్నీలో కూడా తాము ఆడబోమని, తాము కూడా తటస్థ వేదికల్లోనే ఆడతామని పీసీబీ మెలికపెట్టింది. దీనికి తప్పనిసరి పరిస్థితుల్లో జై షా నాయకత్వంలోని ఐసీసీ బోర్డు అంగీకరించింది. దీంతో ఇకపై సొంతగడ్డపై పాక్‌తో భారత్ మ్యాచ్‌ల నిర్వహణ ఉండదు.
2026లో టీ20 ప్రపంచకప్..
ఇక 2026లో శ్రీలంకతో కలిసి భారత్ టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తోంది. ఈక్రమంలో ఈ టోర్నీలో భారత్-పాక్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ తటస్థ వేదికపై అంటే లంకలోనో లేక వేరే ఇతర దేశంలో జరిగే అవకాశముంది. ఈ నిర్ణయం 2027 వరకు అమల్లో ఉంటుంది. మరోవైపు 2025 చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. హైబ్రిడ్ మోడల్లో జరిగే ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లు యూఏఈలో జరుగనున్నాయి. ఒకవేళ భారత్ నాకౌట్‌కు క్వాలిఫై అయితే సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు అక్కడే జరుగుతాయి. కాకపోతే పాక్‌లో జరుగుతాయని ఐసీసీ ప్రకటించింది. ఇక హైబ్రీడ్ మోడల్‌కు పరిహారంగా 2028 మహిళా టీ20 ప్రపంచకప్ హక్కులను పాక్‌కు ఐసీసీ కట్టబెట్టింది. ఏదేమైనా ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లో సొంతగడ్డపై పాక్‌తో పోరును చూడలేమని భారత అభిమానులు పేర్కొంటున్నారు. దీంతో ప్రతిష్టాత్మక టోర్నీల్లో సొంతగడ్డ అనుకూలత కూడా మిస్ కానుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.