Happy Birthday Sachin Tendulkar: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ - ఆ ప్రయాణం అనితర సాధ్యం
Sachin Tendulkar Birthday Today: కోట్ల మంది క్రికెట్ అభిమానుల గుండెల్లో కొలువుదీరిన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ నేటితో 51వ వసంతంలోకి అడుగుపెట్టాడు.
![Happy Birthday Sachin Tendulkar: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ - ఆ ప్రయాణం అనితర సాధ్యం Sachin Tendulkar Birthday Today special Story Happy Birthday Sachin Tendulkar: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ - ఆ ప్రయాణం అనితర సాధ్యం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/bdd7980966d862dd134ea1db59fd7c731713935319205872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sachin Tendulkar Birthday Today: భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) పుట్టిన రోజు నేడు. కోట్ల మంది క్రికెట్ అభిమానుల గుండెల్లో కొలువుదీరిన ఈ క్రికెట్ గాడ్.. నేటితో 51వ వసంతంలోకి అడుగుపెట్టాడు. 11 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. మైదానంలో సచిన్ మిగిల్చిన జ్ఞాపకాలు మాత్రం ఇంకా క్రికెట్ ప్రేమికులను వెంటాడుతూనే ఉన్నాయి. 24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో మాస్టర్ బ్లాస్టర్ ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. మరెన్నో అద్భుతమైన విజయాలందించాడు. క్రికెట్‌లో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు సచిన్. ఎవరూ అందుకోలేని రికార్డులు, ఎవరికీ సాధ్యం కాని సుదీర్ఘ కెరీర్ సచిన్ సొంతం. క్రికెట్‌కు ఎన్నో అరుదైన రికార్డులు పరిచయం చేశాడు. క్రికెట్ గాడ్'గా అభిమానుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. 1973 ఏప్రిల్ 24న ముంబైలో సచిన్ జన్మించాడు. సచిన్ తండ్రి రమేష్ తెందూల్కర్, సుప్రసిద్ధ మరాఠీ నవలా రచయిత, కవి. తల్లి రజని, ఆమె ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో పని చేశారు. గురువు రమాకాంత్ అచ్రేకర్ సలహాతో సచిన్, స్టేడియానికి దగ్గరగా ఉండే పాఠశాలకు మారి క్రికెట్లో శిక్షణ తీసుకున్నాడు.
ఈ కెరీర్ అసామాన్యం...
సచిన్ మొత్తం 200 టెస్టు మ్యాచ్‌లలో 15,921 పరుగులు చేశాడు. మొత్తం 463 వన్డేల్లో 18,426 పరుగులు సాధించాడు. ఇంటర్నేషనల్ టీ20లో ఆడిన ఒక్క మ్యాచ్‌లో 10 పరుగులు చేశాడు. టెస్టుల్లో 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు బాదాడు. వన్డేల్లో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు కొట్టాడు. మొత్తంగా 664 మ్యాచ్‌లలో 34,357 పరుగులు సాధించాడు. బౌలింగ్‌లోనూ సచిన్ సత్తా చాటాడు. టెస్టుల్లో 46, వన్డేల్లో 154 వికెట్లు పడగొట్టాడు. ఆడిన ఒకే ఒక్క టీ20 మ్యాచ్‌లోనూ ఒక వికెట్ సాధించాడు.
ఆ కల నెరవేరిన రోజు...
ఐసీసీ వన్డే ప్రపంచకప్ గెలవాలన్న సచిన్ కోరిక 2011లో నెరవేరింది. ధోని కెప్టెన్సీలో టీమ్ ఇండియా ప్రపంచకప్ గెలిచింది. 2012లో వన్డే క్రికెట్‌కి సచిన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. మరుసటి ఏడాదే టెస్టులకు వీడ్కోలు పలికాడు. 25 టెస్టులు, 73 వన్డే మ్యాచ్‌లకు సచిన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఈ ఇన్నింగ్స్ మర్చిపోగలమా..
సరిగ్గా 23 ఏళ్ల క్రితం సచిన్ తన జన్మదినం రోజున ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించాడు. 1998 ఏప్రిల్ 24న దుబాయ్ వేదికగా జరిగిన కొకకోలా షార్జా కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఈ ట్రై సిరీస్ ఫైనల్లో సచిన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 131 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 134 పరుగులతో వీరవిహారం చేసిన మాస్టర్.. ఒంటిచేత్తో భారత్‌ను గెలిపించాడు. సచిన్ ఆడిన ఈ ఇన్నింగ్స్ భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ సిరీస్‌లో మొత్తం 434 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు.
అవార్డులు, గుర్తింపు
సచిన్‌కు 1994లో అర్జున అవార్డు, 1997/98లో ఖేల్ రత్న, 1999లో పద్మశ్రీ, 2008లో పద్మ విభూషణ్, 2014లో భారతరత్న వరించాయి. 2012లో సచిన్ టెండూల్కర్ రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యాడు. అంతే కాకుండా రాజ్యసభకు నామినేట్ అయిన తొలి క్రీడాకారుడిగా సచిన్ గుర్తింపు పొందాడు. క్రికెట్లో తన అనుభవాలతో సచిన్ 'ప్లేయింగ్ ఇట్ మై వే' అనే ఆత్మకథ రాశాడు. సచిన్ జీవితాన్ని 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్' పేరుతో ఓ డాక్యుమెంటరీ మూవీగా మలిచారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)