IND vs IRE Preview and Prediction : టీ 20 ప్రపంచకప్(T20 World Cup) వేటను టీమిండియా(Team India) నేడు ప్రారంభించనుంది. ఐర్లాండ్(Ireland)తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఐర్లాండ్ చూసేందుకు పసికూనైనా... ధాటిగా ఆడేందుకు ఆ జట్టు ఆటగాళ్లు వెనకడుగు వేయరు. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు షాక్ ఇవ్వాలని ఐర్లాండ్ చూస్తుండగా.... తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించి ప్రపంచకప్ వేటను ఘనంగా ఆరంభించాలని రోహిత్ సేన చూస్తోంది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్... చూసేందుకే భయపడే బౌలింగ్ దళం... మైదానంలో చురుగ్గా కదిలే ఫీల్డర్లతో టీమిండియా చాలా బలంగా కనిపిస్తోంది. టీ 20ల్లో ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్, కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా కనిపిస్తోంది.
కసిగా భారత్
వన్డే ప్రపంచకప్‌లో త్రుటిలో చేజారిన విశ్వ కప్‌ను ఈసారి ఒడిసిపట్టాలని రోహిత్ సేన చూస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించిన భారత బ్యాటర్లు... బౌలింగ్‌కు అనుకూలిస్తున్న అమెరికాలోని పిచ్‌పై ఎలా ఆడతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు ఇదే చివరి పొట్టి ప్రపంచకప్ అని భావిస్తున్న వేళ ఈ ప్రపంచకప్‌లో సత్తా చాటాలని చూస్తున్నారు. బుమ్రా సారధ్యంలోని బౌలింగ్ దళం... ఇప్పటికే బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌లపై ఎలా రాణిస్తారో చూడాల్సి ఉంది. టీమిండియా ఓపెనర్లుగా ఎవరు బరిలోకి దిగుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. రోహిత్ కలిసి యశస్వీ జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారా లేక రోహిత్‌తో కలిసి విరాట్ కోహ్లీ టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడా అన్నది చూడాలి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు ఈ మ్యాచ్‌లో కీలకంగా మారనున్నారు.
రోహిత్ ఏం చేస్తాడో..
గత ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి అనంతరం కన్నీళ్లను దాచుకుంటూ డ్రెస్సింగ్ రూంకు వెళ్తున్న రోహిత్ దృశ్యాలు ఇప్పటికీ అభిమానుల మనసులో అలాగే ఉన్నాయి. ఈ ప్రపంచకప్‌లో కప్పును ముద్దాడి ఆ బాధను మర్చిపోవాలని రోహిత్ చూస్తున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో 765 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన విరాట్ కోహ్లీ కూడా ఫైనల్లో ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నాడు. ఈ ప్రపంచకప్‌ను గెలవాలని కోహ్లీ కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు. అత్యుత్తమ ఆటగాళ్ళతో కూడిన అత్యుత్తమ జట్టు అయిన భారత్‌కు ఐర్లాండ్ ఏ మాత్రం పోటీ ఇస్తుందో చూడాలి. 37 ఏళ్ళ వయసున్న రోహిత్‌కి ఇదే చివరి ప్రపంచ కప్ అన్న ఊహాగానాలు ఉన్నాయి. పాల్ స్టిర్లింగ్, జోష్ లిటిల్, హ్యారీ టెక్టర్, ఆండీ బాల్బిర్నీ వంటి నాణ్యమైన టీ 20 ఆటగాళ్లతో ఐర్లాండ్ జట్టు కూడా పర్వాలేదనిపించేలా ఉంది.
జట్లు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్.
ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, ఆండీ బల్బిర్నీ, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, జోష్ లిటిల్*, బారీ మెక్‌కార్తీ, నీల్ రాక్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.