IND vs SA: సూర్యా భాయ్ నయ చరిత్ర , 16 ఏళ్ల ధోనీ రికార్డు బద్దలు
Suryakumar Yadav: ధోని 16 ఏళ్ల రికార్డును సూర్య బ్రేక్ చేశాడు. టీ20 ఫార్మాట్‌లో సౌతాఫ్రికా గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత కెప్టెన్‌గా నిలిచాడు.
దక్షిణాఫ్రికా పర్యటనను భారత జట్టు పరాజయంతో ప్రారంభించింది. మూడో మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా.. రెండో మ్యాచ్‌ను ఆతిథ్య ప్రొటీస్ విజయం సాధించింది. అన్ని విభాగాల్లో రాణించిన దక్షిణాఫ్రికా టీమిండియాపై సాధికార విజయం సాధించింది. టీమ్‌ఇండియా డక్‌వర్త్ లూయిస్ పద్థతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 19.3 ఓవర్లలో 180 పరుగులు చేసింది. ఈ పరిస్థితుల్లో వర్షం కురవడంతో ప్రొటీస్ లక్ష్యాన్ని 15 ఓవర్లలో 152 పరుగులకు నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని 13.5 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమిండియా టీ 20 సారధి సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. పొట్టి క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు.
16 ఏళ్లుగా టీమిండియా కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ టీ20 కెరీర్‌లో 17వ హాఫ్ సెంచరీని చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 36 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్ 5 ఫోర్లు, 3 సిక్సులతో 56 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ధోని 16 ఏళ్ల రికార్డును సూర్య బ్రేక్ చేశాడు. టీ20 ఫార్మాట్‌లో సౌతాఫ్రికా గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. పొట్టి ఫార్మాట్‌లో సఫారీ గడ్డపై హాఫ్ సెంచరీ చేసిన తొలి టీమిండియా కెప్టెన్‌గా నిలిచాడు. 2007లో సౌతాఫ్రికాలో టీ20 మ్యాచ్‌లో కెప్టెన్‌గా ధోని 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ సాధించాడు. ఇప్పటివరకు సఫారీ గడ్డపై టీమిండియా కెప్టెన్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఇదే ఉంది. తాజాగా ధోని రికార్డును సూర్య బద్దలుకొట్టాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా... టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆరంభంలోనే భారత జట్టుకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. యశస్వి జైస్వాల్ , శుభ్‌మన్ ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ చేరిపోయారు. జైస్వాల్‌ను జాన్సన్ అవుట్ చేయగా... గిల్‌ను విలియమ్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ తిలక్ వర్మ 29 పరుగులతో రాణించడం...కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్రీజులో నిలబడడంతో ఇన్నింగ్స్ ముందుకు సాగింది. తిలక్, సూర్య చూడచక్కని షాట్లతో అలరించారు. కొయెట్జీ బౌలింగ్‌లో వరుసగా 6, 4 దంచిన సూర్య.. విలియమ్స్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. జట్టు స్కోరు 55 పరుగుల వద్ద తిలక్ వర్మ పెవిలియన్ చేరాడు.
కానీ ఆ తర్వాత రింకూ సింగ్‌తో కలిసి సూర్య స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పది ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. చివర్లో రింకూ సింగ్ చెలరేగిపోయాడు. కేవలం 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. రింకు సింగ్ 39 బంతుల్లో 68 పరుగులు చేశాడు. చివరి ఓవర్ తొలి మూడు బంతుల్లో భారత జట్టు.. జడేజా, అర్ష్‌దీప్ వికెట్లు కోల్పోయింది. తర్వాత వర్షం రావడంతో ఇన్నింగ్స్ అక్కడే ఆగిపోయింది. దీంతో వర్షం వల్ల టీమ్‌ఇండియా ఇన్నింగ్స్ 19.3 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. వర్షం తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 15 ఓవర్లలో 152 పరుగులుగా నిర్దేశించారు. భారత బౌలర్లు విఫలం కావడంతో ప్రొటీస్ 13.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.