BCCI: వరల్డ్ కప్ ముంచుకొస్తోంది - చీఫ్ సెలక్టర్ లేడు - ఆలోపు భర్తీ చేయాలని బీసీసీఐ డెడ్‌లైన్
వన్డే వరల్డ్ కప్ కోసం మిగిలిన దేశాలన్నీ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంటే సంపన్న క్రికెట్ బోర్డుగా పేరున్నా బీసీసీఐకి మాత్రం నాలుగు నెలలుగా ఇప్పటికీ చీఫ్ సెలక్టరే లేడు.
BCCI: డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత ఈ ఏడాది మరో ఐసీసీ టోర్నీ జరుగనుంది. 2011 తర్వాత వన్డే వరల్డ్ కప్ భారత్‌లో జరుగబోతుంది. ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్‌లలో ఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది. అన్నీ సవ్యంగానే సాగుతున్నా ఆతిథ్య దేశంగా ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి మాత్రం కొత్త తలనొప్పి పట్టుకుంది. వన్డే వరల్డ్ కప్ కోసం మిగిలిన దేశాలన్నీ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంటే సంపన్న క్రికెట్ బోర్డుగా పేరున్నా బీసీసీఐకి మాత్రం నాలుగు నెలలుగా ఇప్పటికీ జట్టును ఎంపిక చేసే చీఫ్ సెలక్టరే లేడు.
గతేడాది రెండోసారి ఆలిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికైన చేతన్ శర్మ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ప్రముఖ టీవీ ఛానల్ స్టింగ్ ఆపరేషన్‌లో బీసీసీఐ తీసుకున్న కీలక నిర్ణయాలు, కోహ్లీ - గంగూలీ వివాదం, ఆటగాళ్లు ఫిట్నెస్ కోసం ఇంజెక్షన్లు తీసుకుంటారని చెప్పి నానా రచ్చ చేశాడు. ఈ వీడియోతో బీసీసీఐ పరువు గంగలో కలిసింది. వీడియో వైరల్ అయిన రెండు రోజులకు చేతన్ శర్మ స్వయంగా తన పదవి నుంచి తప్పుకున్నాడు. చేతన్ శర్మ తప్పుకున్నాక ఆ పదవి ఇప్పటికీ ఖాళీగానే ఉంది. నాలుగు నెలల నుంచి సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉన్న శివసుందర్ దాస్.. తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.
కొత్త ఛైర్మన్ ఎంపికకు అప్లికేషన్ జారీ..
వరల్డ్ కప్‌కు మూడు నెలల గడువే ఉండటంతో కొత్త ఛైర్మన్‌ను ఎంపిక చేయడంపై బీసీసీఐ దృష్టి సారించింది. ఈ మేరకు సెలక్షన్ కమిటీలోని సెలక్టర్ పోస్టును భర్తీ చేసేందుకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ ప్రకటనలో సదరు అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలు, చేయాల్సిన విధుల గురించి సవివరంగా తెలిపింది. జూన్ 30లోపు అప్లికేషన్ ఫామ్‌ను నింపి తమకు పంపించాల్సిందిగా స్పష్టం చేసింది. 30 తర్వాత ఐదారు రోజుల్లో ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి కొత్త చీఫ్ సెలక్టర్ ను ప్రకటించే అవకాశముంది. ఆ తర్వాత కొత్త సెలక్షన్ కమిటీ.. ఆగస్టులో ఐర్లాండ్ పర్యటనకు లేదా అన్నీ కుదిరితే వెస్టిండీస్‌తో టీ20 టీమ్ ను కూడా ప్రకటించాల్సి ఉంటుంది.
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) June 22, 2023
BCCI invites applications for one member of Men’s Selection Committee post.
Details 🔽https://t.co/jOU7ZIwdsl
సెలక్షన్ కమిటీ పోస్టుకు అర్హతలు..
- కనీసం ఏడు టెస్టు మ్యాచ్‌లు ఆడి ఉండాలి (లేదా)
- 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి (లేదా)
- అంతర్జాతీయ స్థాయిలో పది వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి.
- క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి ఐదేండ్లు దాటాలి.
- ఏ ఇతర క్రికెట్ కమిటీలలో సభ్యత్వం ఉండకూడదు.
బీసీసీఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తదుపరి ఆలిండియా సెలక్షన కమిటీ చైర్మెన్ గా ఎంపికయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. అయితే వీరూ కోరిన వేతనం దగ్గరే అసలు చిక్కు వస్తోంది. ప్రస్తుతం ఛైర్మన్ ఆఫ్ సెలక్టర్‌కు ఏడాదికి రూ.కోటి వరకు ఇస్తున్నారు. మిగిలిన నలుగురు సెలక్టర్లకు రూ.90 లక్షలు ఇస్తున్నారు. ఇంత తక్కువ మొత్తానికి వీరూ అంగీకరించేలా లేడు. మరి వీరూకి బీసీసీఐ ఇతర ఆదాయ మార్గాలు ఏవైనా చూపుతుందా..? లేక నిబంధనలను సడలించి ఛైర్మెన్ ఆఫ్ సెలక్టర్ వేతనం పెంచుతుందా..? అన్నది త్వరలోనే తేలాల్సి ఉంది.
ప్రస్తుతం సెలక్షన్ కమిటీ :
బీసీసీఐ నిబంధనల ప్రకారం సెలక్షన్ కమిటీలో ఐదుగురు సభ్యులుంటారు. వీరిలో ఒకరు చీఫ్ సెలక్టర్. చేతన్ శర్మ తన పదవి కోల్పోయాక మిగిలినవారు వీళ్లే..
- శివసుందర్ దాస్ (తాత్కాలిక చీఫ్ సెలక్టర్)
- సుబ్రతో బెనర్జీ
- సలిల్ అంకోలా
- శ్రీధరన్ శరత్