AUS vs SA : దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా చిత్తు, ప్రొటీస్‌కు వరుసగా రెండో విజయం
ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ రెండో మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికా అదరగొట్టింది. పటిష్టమైన ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది.
వన్డే ప్రపంచకప్ రెండో మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికా అదరగొట్టింది. పటిష్టమైన ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. అన్ని విభాగాల్లో రాణించిన ప్రొటీస్.. కంగారు జట్టుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా సాధికార విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా... సఫారీ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవరల్లో ఏడు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. అనంతరం 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారు జట్టు 177 పరుగులకే కుప్పకూలింది. దీంతో 134 పరుగుల భారీ తేడాతో కంగారు జట్టు దక్షిణాఫ్రికా చేతిలో చిత్తయింది. ఈ గెలుపుతో ప్రొటీస్ ఈ ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఆస్ట్రేలియా వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది.
దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ (109: 106 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్సర్లు) సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రొటీస్ ఓపెనర్లు క్వింటన్ డికాక్, టెంబా బవుమా ప్రారంభంలో కాస్త ఆచితూచి ఆడారు. మొదటి పవర్ ప్లే 10 ఓవర్లు ముగిసే సరికి ప్రొటీస్ జట్టు వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. 15 ఓవర్ల తర్వాత వీరు కాస్త వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. క్వింటన్ డికాక్ ఒక్కసారిగా గేర్లు మార్చాడు. బౌండరీలతో చెలరేగాడు. ఈ క్రమంలోనే 51 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొదటి వికెట్‌కు 108 పరుగులు జోడించిన అనంతరం గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో బవుమా అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రాసీ వాన్ డర్ డుసెన్‌తో కలిసి డికాక్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరు రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడిన డికాక్ 91 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. డికాక్‌ను క్లీన్ బౌల్డ్ చేసి మ్యాక్స్‌వెల్ ఆస్ట్రేలియాకు మూడో వికెట్ అందించాడు. మిగిలిన బ్యాటర్లు కూడా రాణించడంతో ప్రొటీస్ నిర్ణీత 50 ఓవర్లలో 311 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2, మ్యాక్స్‌వెల్ 2 వికెట్లు తీశారు.
అనంతరం 312 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లకు దక్షిణాఫ్రికా బౌలర్లు చుక్కలు చూపించారు. సఫారీ బౌలర్ల విజృంభణతో ఏ దశలోనూ కంగారు జట్టు విజయం దిశగా సాగలేదు. అయిదో ఓవర్లో మిచెల్ మార్ష్‌ను అవుట్ చేసిన జాన్సన్ ఆస్ట్రేలియా బ్యాటర్ల పతనాన్ని ఆరంభించాడు. 27 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కంగారు జట్టు... అదే స్కోరు వద్ద రెండో వికెట్ కూడా కోల్పోయింది. డేవిడ్ వార్నర్‌ను ఎంగిడి పెవిలియన్‌కు పంపాడు. తర్వాత కూడా ఆస్ట్రేలియా వికెట్ల పతనం కొనసాగింది. స్టీవ్ స్మిత్, లబుషేన్ కాసేపు పోరాడినా.. దక్షిణాఫ్రికా బౌలర్ల ముందు నిలవలేకపోయారు. 19 పరుగులు చేసిన స్మిత్‌ను రబాడ, 46 పరుగులు చేసిన లబుషేన్‌ను మహారాజ్ అవుట్ చేశారు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆస్ట్రేలియా 70 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
కానీ మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ జట్టును అదుకునే ప్రయత్నం చేశారు. కానీ 27 పరుగులు చేసి ఓపికగా ఆడుతున్న స్టార్క్‌ను జాన్సన్ బోల్తా కొట్టించాడు. 143 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కూడా కోల్పోయింది. తర్వాత కూడా దక్షిణాఫ్రికా జట్టు పట్టు విడవక పోవడంతో 177 పరుగులకే కంగారు జట్టు కుప్పకూలింది. ప్యాట్ కమిన్స్ పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించేందుకు మాత్రమే ఉపయోగపడింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ 3, మహరాజ్ 2, జాన్సన్ 2, షంషీ రెండు వికెట్లు తీశారు.