Simhachalam Chandanotsavam 2024: వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనం - సింహాద్రి అప్పన్న చందనోత్సవం గురించి ఈ విషయాలు తెలుసా!
Simhachalam Chandanotsavam : ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజు సింహాచలంలో చందనోత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది మే 10న చందనోత్సవం... ఈ రోజే ఎందుకు నిజరూప దర్శనం ఉంటుంది....
Simhachalam Chandanotsavam 2024 : నారసింహ క్షేత్రాలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే చాలా ఉన్నాయి. అయితే వీటన్నింటికి భిన్నంగా ఉంటుంది సింహాచల క్షేత్రం. వరాహం - నారసింహ రూపం కలసిన రూపం కేవలం సింహాచలంలో మాత్రమే కొలవైంది. వరాహ నరసింహ స్వామి దర్శనభాగ్యం లభించడమే జన్మజన్మల అదృష్టంగా భావిస్తారు. ఇక నిజరూపం దర్శనం అంటే...ఏడాదికి ఓసారి లభించే ఈ అపురూపాన్ని చూసేందుకు భక్తులు పోటీపడతారు. ఆ అపురూపమైన రోజే చందనోత్సవం...ఇది వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ రోజు
Also Read: సింహాద్రి అప్పన్న నుంచి కాటమరాయుడి వరకూ ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ నారసింహ క్షేత్రాలు
చందనోత్సవం ఎందుకు?
హిరణ్యాక్షుడు, హిరణ్య కశిపుడు అనే ఇద్దరు రాక్షసులను హతమార్చేందుకు శ్రీ మహావిష్ణువు ధరించిన వరుస అవతారాలే వరాహం, నారసింహం. అయితే హిరణ్యాక్షుడిని వధించేందుకు వేసిన వరాహ రూపాన్ని పూర్తిగా విరమించకముందే..ప్రహ్లాదుడి పిలుపు మేరకు హిరణ్య కశిపుడి అవతారంలో వచ్చేశాడు. అందుకే ఈ వరాహం-నారసింహం కలసి రూపం కనిపిస్తుంది. అసుర సంహారం తర్వాత నృసింహుడు భీకరరూపం వీడకపోవడం చూసి లోకాలన్నీ వణికిపోయాయి. ఆ సమయంలో బ్రహ్మదేవుడు చందన వృక్షానికి తానిచ్చిన వరం గుర్తొచ్చింది... ఉగ్రం, ఉష్ణం, తాపం నివారించే శక్తిని చందన వృక్షానికి ప్రసాదించింది బ్రహ్మనే. ఆ విషయం ప్రహ్లాదుడికి సూచించడంతో వెంటనే ఆ భక్తుడు చందనసేవ చేసి నారసింహుడి ఉగ్రరూపాన్ని శాంతింపచేశాడు. ఆరోజే అక్షయ తృతీయ. శాంతించిన నృసింహస్వామి ప్రహ్లాదుడి కోరిక మేరకు సింహగిరిపై కొలువయ్యాడు.
Also Read: యాదాద్రి సహా తెలంగాణలో నారసింహస్వామి కొలువైన మహిమాన్వితే క్షేత్రాలివే
స్వామి పుట్టలో ఎందుకున్నారు!
తనను రక్షించమని..తండ్రికి కనిపించమని ప్రహ్లాదుడు ప్రార్థించడంతో వెంటనే గరుత్మంతుడిపైనుంచి స్వామివారు కిందకు దూకారట. ఆ సమయంలో పాదాలు పాతాళంలోకి వెళ్లాయని...అందుకే వరాహ నారసింహుడి పాదాలు ఇక్కడ కనిపించవని చెబుతారు. ప్రహ్లాదుడు తర్వాత ఆ చందన సేవ ఆగిపోయింది..స్వామివారి రూపంపై పుట్టలు పుట్టుకొచ్చాయి. కొంతకాలానికి పురూరవ చక్రవర్తి పుష్పకవిమానంపై వెళుతుండగా ... సరిగ్గా స్వామివారు పుట్టలో నిక్షిప్తమైన ప్రదేశానికి వచ్చేసరికి విమానం ఆగిపోయింది. ఆ రాత్రికి అక్కడే బసచేసిన పురూరవుడికి నారసింహుడు కలలో కనిపించి తన ఉనికి గురించి చెప్పాడు. అలా పుట్టలో ఉన్న స్వామివారిని బయటకుతీసి ప్రతిష్టించి మళ్లీ చందనోత్సవం నిర్వహిస్తున్నారు. 12 అడుగుల పుట్టలో దొరికిన గుర్తుగా 12 మణుగుల చందనాన్ని నారసింహుడికి సమర్పిస్తుంటారు..
Also Read: అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయాలివే!
చందనోత్సవం విధానం ఇదే!
తమిళనాడు నుంచి జాజిపోకల అనే గంధపు చెక్కలు తెప్పించి...ఉత్సవానికి కొన్ని రోజుల ముందు నుంచే ప్రత్యేక పూజలు చేసి గంధం తీయడం ప్రారంభిస్తారు. చందనోత్సవానికి ముందు రోజు రాత్రికి స్వామివారిపై ఉన్న గంధాన్ని తొలగిస్తారు. అక్షయ తృతీయ రోజు తెల్లవారు ఝాము నుంచే నిజరూపం దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మొదట దర్శన భాగ్యం ఆలయ ధర్మకర్తలైన విజయనగర రాజులకే కల్పిస్తారు. అర్థరాత్రి వరకూ నిజరూపం దర్శనం తర్వాత సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం 108 వెండి కలశాలతో పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. ఆ తర్వాత 3 మణుగులు అంటే 120 కిలోల చందనం లేపనంగా పూస్తారు. మళ్లీ నిజరూపం నుంచి నిత్యరూపంలోకి స్వామివారు మారుతారు. అయితే ఈ చందనం ఒక్కసారి కాదు..సంవత్సర కాలంలో మూడుసార్లు పూస్తారు. ఏడాదికి నాలుగుసార్లు ఒక్కోసారి 3 మణుగుల చొప్పున మొత్తం 12 మణుగుల చందనం లేపనంగా పూస్తారు. ఈ మొత్తం చందనాన్ని అక్షయ తృతీయ రోజు వలిచి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.
Also Read: అక్షయ పాత్ర మొదట ఎవరు ఎవరికి ఇచ్చారు - ఇప్పుడా పాత్ర ఎక్కడుంది!
అద్వైత దర్శనానికి ప్రతీక
అక్షయ తృతీయ రోజు కొన్ని గంటలు మాత్రమే కనిపించే స్వామిరూపం ఎలా ఉంటుందో తెలుసా...
వరాహ ముఖం
మనిషి శరీరం
తెల్లని జూలు
రెండు చేతులు
భూమిలో ఉండిపోయిన పాదాలు
...ఈ నిజ రూపాన్ని దర్శించుకునేందుకు లక్షల మంది భక్తులు పోటీపడతారు. ఈ దర్శనం తర్వాత చందన లేపనం చేయగానే లింగరూపంలో కనిపిస్తారు స్వామివారు. ఇదే అద్వైత దర్శనానికి ప్రతీక..
లోకాలనేలే స్వామి చల్లగా ఉన్నప్పుడే జగమంతా చల్లదనం ఉంటుందని భక్తుల విశ్వాసం.. అందుకే ఈ చందనోత్సవం...