Yadadri Temple: యాదాద్రి సహా తెలంగాణలో నారసింహస్వామి కొలువైన మహిమాన్వితే క్షేత్రాలివే
శ్రీ మహావిష్ణువు అవతారాల్లో నారసింహావతారం ఒకటి. అన్ని అవతారాల్లో ఓదో ఒక రూపంలో కనిపించే స్వామివారు ఈ అవతారంలో సగం నరుడు, సగం సింహ రూపంలో దర్శనమిస్తారు. అందుకే నారసింహ క్షేత్రాలు అత్యంత మహిమాన్వితం.
హిరణ్యకసిపుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మను వరం కోరుకుంటాడు. తనకు మనిషి వలన, జంతువు వలన, పగలు, రాత్రి, ఇంట్లో, బయట, ఆకాశంలో, నేలమీద, చేతితో, ఏ విధమైన ఆయుధంతో కానీ మరణం సంభవించకూడదని వరం కోరుకుంటాడు. అప్పుడు హరణ్యకసిపుడిని సంహరించేందుకు ప్రహ్లాదుడి ప్రార్థన మేరకు నరసింహుడిగా అవతరించిన విష్ణుమూర్తి సాయం సంధ్య సమయంలో ద్వారంపై కూర్చుని గోళ్లతో రాక్షస సంహారం చేస్తాడు. ఆ తర్వాత వికట్టహాసం చేస్తూ కొండల్లో తిరుగుతూ పలు ప్రాంతాల్లో వెలిశారు స్వామివారు. దేశవ్యాప్తంగా నారసింహ క్షేత్రాలు ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్షేత్రాలు మరింత ప్రత్యేకం. వాటిలో తెలంగాణలో యాదాద్రి సహా నాలుగు క్షేత్రాలున్నాయి.
Also Read: రామాయణం, మహాభారతం, భాగవతం ఈ ఒక్క శ్లోకంలో చదివేసుకోండి
తెలంగాణలో నారసింహ క్షేత్రాలు
యాదాద్రి
నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన యాదగిరి గుట్ట హైదరాబాద్ నగరానికి 65 కి.మీ. దూరంలో ఉంది. పూర్వం రుష్యశృంగుని కుమారుడైన యాద రుషి ఈ కొండమీద నరసింహుణ్ణి చూడాలని తపస్సు చేయగా, ఉగ్ర నరసింహుడు ప్రత్యక్షమయ్యాడట. ఆ ఉగ్రరూపం చూడలేక శాంతస్వరూపంతో కనిపించమని యాద రుషి కోరగా స్వామి కరుణించి, లక్ష్మీసమేతుడై కొండపై కొలువుదీరాడట. ఆ తరవాత స్వామిని వేర్వేరు రూపాల్లో చూడాలని మళ్లీ తపస్సు చేయడంతో నరసింహుడు జ్వాలా, యోగానంద, గండభేరుండ, ఉగ్రనారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడనీ చెబుతారు. ఆంజనేయస్వామి గుడి ఉన్న రాతిమీద గండభేరుండ నరసింహమూర్తి, గర్భగుడిలో జ్వాలా, యోగానంద, లక్షీనరసింహమూర్తులు ఉంటాయి. ఉగ్ర రూపం అదృశ్యంగా ఉంటుందట. ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే సకల రోగాలూ నయమైపోతాయనేది భక్తుల నమ్మకం.
ధర్మపురి
కరీంనగర్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీతీరంలో ఉందీ క్షేత్రం. రాక్షసవధ అనంతరం స్వామి ఇక్కడే తపస్సు చేశాడనీ, ఆపై స్వయంభూగా వెలిసి యోగానందుడిగా భక్తుల కోరికలు తీరుస్తున్నాడనేది పౌరాణిక గాథ. ధర్మవర్మ అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించినందుకే ధర్మపురి అని పేరు వచ్చిందనీ, ఆయన తపస్సు చేయడంవల్లే స్వామి ఇక్కడ వెలిశాడనేది మరో కథనం. ఇక్కడ ఆంజనేయుడు క్షేత్రపాలకుడు. యమధర్మరాజు స్వామిని దర్శించి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నాడనీ చెబుతారు. అందుకే ‘ధర్మపురికి పోతే యమపురి ఉండదు’ అనీ అంటారు.
శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి
వరంగల్ జిల్లాలోని మంగపేట మండలము మల్లూరు గ్రామంలో చిన్న గుట్ట పైన అత్యంత మహిమాన్వితమైన శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉంది. ఆలయంలో మూలా విరాట్టు గుహలో కొండకు ఆనుకుని 9 అడుగుల నల్ల రాతి విగ్రహం ఉంది. ఇక్కడ స్వామివారు మోండెం వరకూ నరరూపం, తలభాగం సింహంగా నిజరూపంగా దర్శనమిస్తారు. ఇలా ఉండటానికి కారణం ఒకప్పుడు పుట్టలో ఉండే ఈ స్వామిని భక్తులు తవ్వి బయటకి తీస్తుండగా గునపం స్వామివారి బొద్దు వద్ద తగిలి గాయమైందంటా. అందుకే ఇప్పటికి ఆ ప్రదేశంలో ఆలయ అర్చకులు చందనం పూస్తారు. అందుకే ఈ ఆలయంలోని విగ్రహాన్ని ఎక్కడ తాకిన రాతిని తాకినట్లు కాకుండా సజీవ మానవ శరీరాన్ని తాకినట్లు మెత్తగా ఉన్నట్లు అనిపిస్తుందట. దక్షిణ భారత దేశంలో మరెక్కడా కూడా నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకం చేయడం జరగదు. కాని ఇక్కడ స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం మరొక ప్రత్యేకత.
Also Read: శివాలయంలో ఉండే నవగ్రహాలకే పవర్ ఎక్కువ ఉంటుందా
లింబాద్రి గుట్ట
నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో భింగల్ గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది లింబాద్రి గుట్ట. ఈ గుట్ట మీద కొలువైన శ్రీ లక్ష్మి నారసింహ స్వామి శాంతరూపంలో లక్ష్మీదేవిని తొడపైన కుర్చోబెట్టుకొని భక్తులకి దర్శనం ఇస్తారు. బద్రీనాథ్ క్షేత్రం తర్వాత గర్భాలయంలో స్వామి వారి మూలవిరాట్టు పక్కన నరనారాయణుల విగ్రహాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ క్షేత్రానికి దక్షిణ బద్రీనాథ్‌గా విశిష్టత వచ్చింది.
మట్టపల్లి
పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి మట్టపల్లి పుణ్యక్షేత్రం చాలా విశిష్టమైనది. నల్గొండ జిల్లా, హుజూర్ నగర్ తాలూకాలో వెలసిన క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో ఆలయ నిర్మాణం దాదాపు వెయ్యి ఐదు వందల ఏళ్లకు పూర్వం జరిగింది.ఇక్కడ నరసింహుుడ స్వయంభువు. సప్త బుుషుల్లో ఒకరైన భరద్వాజ మహర్షి ఇక్కడ గుహలో ఉన్న స్వామిని చాలా కాలం పూజించారని చెబుతారు.