Narasimha Swamy Temples In AP : సింహాద్రి అప్పన్న నుంచి కాటమరాయుడి వరకూ ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ నారసింహ క్షేత్రాలు
శ్రీ మహావిష్ణువు అవతారాల్లో నారసింహావతారం ఒకటి. అన్ని అవతారాల్లో ఓదో ఒక రూపంలో కనిపించే స్వామివారు ఈ అవతారంలో సగం నరుడు, సగం సింహ రూపంలో దర్శనమిస్తారు. అందుకే నారసింహ క్షేత్రాలు అత్యంత మహిమాన్వితం.
హిరణ్యకసిపుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మను వరం కోరుకుంటాడు. తనకు మనిషి వలన, జంతువు వలన, పగలు, రాత్రి, ఇంట్లో, బయట, ఆకాశంలో, నేలమీద, చేతితో, ఏ విధమైన ఆయుధంతో కానీ మరణం సంభవించకూడదని వరం కోరుకుంటాడు. అప్పుడు హరణ్యకసిపుడిని సంహరించేందుకు ప్రహ్లాదుడి ప్రార్థన మేరకు నరసింహుడిగా అవతరించిన విష్ణుమూర్తి సాయం సంధ్య సమయంలో ద్వారంపై కూర్చుని గోళ్లతో రాక్షస సంహారం చేస్తాడు. ఆ తర్వాత వికట్టహాసం చేస్తూ కొండల్లో తిరుగుతూ పలు ప్రాంతాల్లో వెలిశారు స్వామివారు. దేశవ్యాప్తంగా నారసింహ క్షేత్రాలు ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్షేత్రాలు మరింత ప్రత్యేకం. వాటిలో ఆంధ్రప్రదేశ్ లో దాదాపు డజను క్షేత్రాలన్నాయి. వాటిలో కొన్ని ప్రముఖ క్షేత్రాల గురించి చూద్దాం.
Also Read: యాదాద్రి సహా తెలంగాణలో నారసింహస్వామి కొలువైన మహిమాన్వితే క్షేత్రాలివే
అహోబిలం
కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవుల మధ్యన ఉన్న ప్రాచీన వైష్ణవ దివ్యక్షేత్రం అహోబిలం. ఇది 108 దివ్య తిరుపతులలో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందింది. నారసింహస్వామి సగం మానవరూపం, మరోసగం సింహం రూపం ఆకారంలో అవతరించిన విష్ణుమూర్తిని చూసిన దేవతలు భగవంతుని ప్రశంసిస్తూ అహో బలా అని కీర్తిస్తారు. కాలక్రమేణా ఆ పిలుపు అబోబిలంగా మారింది. హిరణ్యకశిపుని చంపిన తరువాత, స్వామి రక్త సిక్తములైన చేతుల్ని కడిగిన గుండమే రక్తకుండం. అందులో నీరు ఇప్పటికి ఇప్పటికి ఎర్రగానే కనబడటం విశేషం.
సింహాద్రి అప్పన్న
విశాఖపట్టణం జిల్లాకు దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో సింహగిరిపై వెలసిన దైవం శ్రీ వరాహ లక్ష్మి నరసింహస్వామి. ఉత్తరాంధ్ర వాసులంతా సింహాద్రి అప్పన్నగా పిలుస్తారు. దక్షిణ భారత దేశంలో ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో తిరుపతి తరువాత గొప్ప పేరు పొందిన ఆలయం. ఈ ఆలయంలో నిజ రూపములో కనిపించే స్వామి విగ్రహానికి వరాహముఖం, నరుని శరీరం, సింహ తోక ఉంటుంది. ఈ ఆలయములో శివలింగాకృతిలో ఎప్పుడు చందనంతో కప్పి ఉంటారు స్వామి వారు. ఏడాదిలో ఒక రోజు మాత్రమే చందనపు పొరలు తొలగించుకొని నిజ రూపంతో భక్తులకి దర్శనమిస్తారు. ఏడాదికి కేవలం 12 రోజులు మాత్రమే నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. దీన్నే చందనోత్సవం అని అంటారు.
మంగళగిరి
నవ నారసింహక్షేత్రాల్లో ఒకటైన పానకాల నరసింహస్వామి దేవాలయం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది. కొండ కింద ఉన్న దైవాన్ని లక్ష్మీనరసింహస్వామి గానూ కొండమీద ఉన్న స్వామిని పానకాల స్వామిగానూ పిలుస్తారు. కొండపైన తెరుచుకున్న నోరు ఆకారంలోనే స్వామి దర్శనమిస్తాడు. అక్కడి స్వామికి పానకం అంటే మహాప్రీతి. పానకంతో అభిషేకిస్తే సగం తాగి, మిగిలిన సగాన్ని భక్తులకు ప్రసాదంగా వదులుతాడట. ఎంత పాత్రతో పోసినా సగం తాగి సగం వదలడం ఈ క్షేత్ర విశిష్టత. ఇక్కడ పానకం ఒలికినా చీమలూ ఈగలూ చేరవు.
కదిరి లక్ష్మీనారసింహస్వామి
అనంతపురం జిల్లా, హిందూపురాణానికి తూర్పు దిక్కున సుమారు 90 కీలోమీటర్ల దూరంలో కడపజిల్లా సరిహద్దులో ఉన్న కదరి గ్రామంలో ఉంది లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం. కొండపై భక్తులకు విష్ణుపాదాలు కూడా కనిపిస్తాయి. ఖ అంటే విష్ణుపాదమని, అద్రి అంటే కొండ అని విష్ణుపాదాలు ఉన్న కొండ కనుక ఈ ప్రాంతానికి ఖద్రి లేదా ఖాద్రి అనే పేరు వచ్చిందని అంటారు. ఇంకా కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలం గొడ్డువెలగల సమీపంలోని కొండపై చండ్రవృక్షపు కొయ్య స్తంభం నుంచి నరసింహ స్వామి వెలసినట్లు భక్తుల విశ్వాసం. ఆ కొండను ఆనుకొని కాటం అనే కుగ్రామం ఉండటంతో స్వామిని కాటమరాయుడిగా పిలుస్తారు.
వేదాద్రి
కృష్ణానది ఒడ్డున చిలకల్లుకి పది కిలోమీటర్ల దూరంలో ఉందీ నృసింహ క్షేత్రం. ఇక్కడ నారసింహస్వామి జ్వాల, సాలగ్రామ, యోగానంద, లక్ష్మీనరసింహ, వీర నరసింహ స్వామి అవతారాల్లో దర్శనమిస్తాడు. సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుంచి వేదాలను అపహరించి సముద్రగర్భంలో దాచేయగా- శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకాసురుడిని సంహరించి వేదాలను రక్షించాడు. అప్పుడు ఆ వేదాలు స్వామివారి సన్నిధిలో తరించే భాగ్యాన్ని ప్రసాదించమని కోరగా- నరసింహావతారంలో ఆ కోరిక తీరుతుందని సెలవిస్తాడట. అందువల్లే హిరణ్యకశిపుని సంహారానంతరం స్వామి ఇక్కడ అయిదు అంశలతో ఆవిర్భవించినట్లు చెబుతారు.
వెయ్యినూతుల కోన
కడప జిల్లాలో చిన్నదాసరిపల్లె గ్రామంలో శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ఉంది. వెయ్యి బావులు ఉన్న ప్రదేశం కావడంతో ఈ క్షేత్రం వెయ్యినూతుల కోన గా ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ కాకులు, గద్దలు సంచరించవు.
వరాహ నారసింహస్వామి
ప్రకాశం జిల్లా, ఒంగోలు పట్టణానికి సమీపంలో ఉన్న శింగరకొండ అనే గ్రామంలోని కొండపైన శ్రీ వరాహ నరసింహస్వామి ఆలయం ఉంది. శ్రీరామచంద్రుడు యోగనిద్రలో నృసింహ తేజం పొంది వరాహ లక్ష్మీనరసింహస్వామిని ఈ కొండపై ప్రతిష్టించాడని చెబుతారు. మరో కథనం ప్రకారం పర్ణశాలలో నారద మహాముని తపమాచరించి నృసింహ స్వామిని ప్రసన్నం చేసుకోగా ఆయన కోరిక మేరకే యోగానంద నారసింహస్వామిగా సింగరాయకొండలో వెలిశాడని ప్రతీతి. యోగ ముద్రలో ఉన్నందున ఇక్కడ స్వామి సమక్షంలో అమ్మవారు ఉండరు అని చెబుతారు.
మాల్యాద్రి
ప్రకాశం జిల్లా కందుకూరు-పామూరు రోడ్డులోని వలేటివారి పాలెం సమీపంలో ఉంటుందీ ఆలయం. ఇక్కడి కొండ పూలమాల ఆకారంలో ఉండటంతో ఈ ప్రాంతానికి మాలకొండ, మాల్యాద్రి అని పేరు. అగస్త్య మహాముని మాల్యాద్రిమీద తపమాచరించగా లక్ష్మీనారసింహుడు జ్వాలారూపుడై దర్శనమిచ్చాడనేది పురాణగాథ. అయితే స్వామిని శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలనీ దేవతలూ రుషుల దర్శనార్థం వారంలో ఆరు రోజులూ శనివారం మానవులకీ కేటాయించాలని కోరగా, స్వామి సమ్మతించాడట. అందుకే భక్తులు శనివారంనాడు మాత్రమే స్వామిని దర్శిస్తారు. ఆలయ అర్చకులూ సిబ్బందీ శుక్రవారం రాత్రికి మాలకొండకు చేరుకుని ఉదయాన్నే అభిషేకాలు నిర్వహిస్తారు. సూర్యాస్తమయానికి ఆలయం తలుపులు మూసేసి వెళ్లిపోతారు.
పెనుశిలా లక్ష్మి నరసింహస్వామి
నెల్లూరు జిల్లా గోనుపల్లి గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో పెంచలకోన అనే క్షేత్రంలో పెనుశిలా లక్ష్మి నరసింహస్వామి ఆలయం ఉంది. కృతయుగాన హిరణ్యకశి పుని సంహారానంతరం శేషాచల కొండల్లో ఉగ్ర రూపంలో గర్జిస్తూ సంచరిస్తుండగా- చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తారసపడిందట. స్వామి భీకరరూపం చూసి చెలికత్తెలంతా పారిపోయినప్పటికీ ఆమె మాత్రం నిలబడి ఉండటంతో ఆమె ధైర్యసాహసాలకీ సౌందర్యానికీ ముగ్దుడైన స్వామి శాంతించాడట. తరవాత చెంచురాజుకి కప్పం చెల్లించి వివాహమాడాడనీ, ఆమెను పెనవేసుకుని ఇక్కడే శిలారూపంలో వెలిశాడనీ అందుకే ఇక్కడి స్వామిని పెనుశిల లక్ష్మీనృసింహస్వామిగా కొలుస్తారు.
అంతర్వేది
వశిష్ఠుడి కోరికమేరకు విష్ణుమూర్తి ఇక్కడ లక్ష్మీనృసింహ స్వామిగా వెలిశాడనేది పురాణగాథ. వశిష్ఠమహర్షి ఇక్కడ యాగం చేసినందువల్లే దీనికి అంతర్వేది అనే పేరు వచ్చిం దట. త్రేతాయుగంలో రావణబ్రహ్మను సంహరించిన శ్రీరాముడు బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తిని పొందడానికి ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు పురాణాలు చెబుతున్నాయి. మాఘమాసంలో స్వామివారి కల్యాణోత్సవాలు కన్నులపండుగగా జరుగుతుంది.
ఇంకా ఆంధ్రప్రదేశ్ లో....
కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామ శివారులో వెలసిన మద్దిలేటి నరసింహ స్వామి
నెల్లూరు జిల్లా నరసింహకొండపై వెలసిన వేదగిరి నరసింహస్వామి
తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు దాదాపు 6౦ కిలోమీటర్ల దూరంలో ఉన్న కొరుకొండ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం
అనంతపురం జిల్లా మడకశిర సమీపంలో భక్తరహళ్లిలో ఉన్న నారసింహస్వామి ఆలయం...
ప్రకాశం జిల్లా కందుకూరు-పామూరు రోడ్డులో వలేటివారిపాలెం మండలం పరిధిలో ఉన్న మాల్యాద్రి లక్ష్మీనారసింహస్వామి ఆలయం
ఇలా చెప్పుకుంటూ వెళితే నారసింహక్షేత్రాలు చాలా ఉన్నాయి...మనం చెప్పుకున్నవి కొన్ని మాత్రమే. ఏదో ఒక సందర్భంలో మిగిలిన ఆలయాల గురించి కూడా ప్రస్తావించుకుందాం...