Rohini Karte 2022: రోహిణి కార్తె ప్రారంభమైంది, ఇంతకీ కార్తెలు అంటే ఏంటి
రోహిణి కార్తె ప్రారంభమైంది. ఎండలు ఇప్పటి వరకూ ఓ లెక్క ఈ 15రోజులు మరో లెక్క. ఇంతకీ కార్తెలు ఎలా వచ్చాయి...
జోతిష్యులు 27 నక్షత్రాలు, గ్రహాల ఆధారంగా జాతకాలు,పంచాంగాలు తయారు చేశారు. సూర్యోదయం సమయానికి ఏ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు. కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో వ్యవసాయ పంచాంగం తయారుచేసుకున్నారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలుచుకుంటున్నారు. అయితే వీరి లెక్కల ప్రకారం సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. అలా సంవత్సరానికి 27 కార్తెలు. తెలుగు రైతులంతా తమ అనుభవం నుంచి సంపాదించుకున్న వ్యవసాయ విజ్ఞానాన్ని కార్తెలుగా వాటిని అందరకీ అర్థమయ్యేలా సామెతల రూపంలో అందరకీ అర్థమయ్యేలా చెప్పారు. అందులో ఒకటి రోహిణి కార్తె.
నాలుగు నెలల ఎండాకాలంలో ఉగాది నుంచి వేసవి తాపం పెరుగుతుంది. దిన దిన ప్రవర్దనమానంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. మాములుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు దద్దరిల్లుతాయి. అన్ని కార్తెల కన్నా రోహిణి కార్తె అంటే బంబేలెత్తిపోతారు. ఈ కార్తెలో ఎండలు మండిపోతాయని చెప్పడానికి బదులు రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయంటారు.అంటే వేడి తీవ్రత ఏ రేంజ్ లో ఉంటుందో అని చెప్పడమే దీని ఉద్దేశం.ఈ ఏడాది మే 25న ప్రారంభమైన రోహిణి కార్తె జూన్ 8 వరకూ ఉంటుంది.
Also Read: మే 30 సోమవారం శనిజయంతి, ఆ రోజు ఇలా చేస్తే ప్రతీదీ శుభమే జరుగుతుంది
27 నక్షత్రాలే 27 కార్తెలు
1.అశ్వని, 2.భరణి, 3.కృత్తిక, 4.రోహిణి 5.మృగశిర 6. ఆరుద్ర 7.పునర్వసు 8.పుష్యమి 9.ఆశ్లేష 10.మఖ 11.పుబ్బ 12.ఉత్తర 13.హస్త 14. చిత్త 15.స్వాతి 16.విశాఖ 17.అనూరాధ 18.జ్యేష్ట 19.మూల 20.పూర్వాషాడ 21.ఉత్తరాషాడ 22.శ్రావణ 23.ధనిష్ట 24.శతభిషం 25.పూర్వాభాధ్ర 26.ఉత్తరాభాధ్ర 27.రేవతి
Also Read: వివాహం, సంతానం, శని బాధలు ఇలా సుందరకాండలో ఏ ఘట్టం చదివితే ఎలాంటి సమస్యలు తీరుతాయో తెలుసా
ఎండలు మండే రోహిణి కార్తెలో పశువులు, పక్షులకు తాగేందుకు ఎక్కడిక్కకడ నీళ్లతొట్టెలు ఏర్పాటు చేయడం చాలా మంచిది. మీరు ప్రత్యేకంగా ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు..కనీసం మీ ఇంటి చుట్టుపక్కలైనా మూగజీవాలకు నీళ్లు అందించండి. ఇదేసమయంలో గొడుగు, చెప్పులు, నీటి కుండ దానం ఇవ్వడంతో పాటూ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల కూడా మీకున్న గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు పండితులు.
Also Read: హనుమాన్ జయమంత్రం, పిల్లలతో నిత్యం ఇది చదివించడం చాలా అవసరం - ఎందుకంటే!