Makar Sankranti 2022: బసవన్నగా శివయ్య , హరిదాసుగా శ్రీహరి .. ఆ సంబరమే వేరప్పా…
భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ….ఏ రోజు లెక్క ఆ రోజుదే… ప్రతి క్షణమూ ఆనందమే.. ఆ సంబరాన్ని వర్ణించేందుకు మాటలు చాలవ్. ఈ వేడుకకు మరింత అందాన్నిచ్చే హరిదాసు, డూడూ బసవన్నని ఎవరి రూపాలుగా కొలుస్తారంటే...
భోగి
నలుగుపిండితో స్నానాలు, భోగిమంటలతో...భోగభాగ్యాలు కలిగించే భోగికి స్వాగతం పలుకుతారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లూ, తట్టలూ, విరిగిపోయిన బల్లలు....ఇంకా పాత సామగ్రి మొత్తం మంటల్లో వేస్తారు. పాతను వదిలేసి కొత్తజీవితానికి నాందిపలుకుతారు. నాలుగు మార్గాల కూడలిలో వేసే పెద్ద మంట....అప్పటి నుంచి ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నడనేందుకు సంకేతం. సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ పల్లెల్లో ప్రతి లోగిలి కళకళలాడిపోతుంది. ఇంద్ర ధనస్సు నేలకి చేరిందా అన్నట్టుండే ముగ్గులు.. వాటి మధ్య గొబ్బిళ్లు ముచ్చటగొలుపుతాయ్. సంక్రాంతి వేళ ఊరంతా ఘుమఘుమలే...అరిసెలు, బూరెలు, బొబ్బట్లు, చక్కిలాలు, జంతికలు...ఒక్కో ప్రాంతం వాళ్లకి ఒక్కో స్పెషల్. పెద్ద పెద్ద గాడి పొయ్యిలపై పక్కింటోళ్లు, ఎదురింట్లోళ్లు అంతా ఓ దగ్గర చేరి నోరూరించే పిండివంటలు తయారు చేసే దృశ్యాలు పల్లెలకే సొంతం.
Also Read: సంక్రాంతి అనగానే మహానగరాల నుంచి పల్లెబాట పడతారెందుకు...
సంక్రాంతి
అయ్యగారికి దణ్ణం పెట్టు...అమ్మగారికి దణ్ణం పెట్టూ అంటూ వచ్చే గంగిరెద్దులు పల్లెకి మరో కళ. శివ లింగాకృతికిని గుర్తుచేసే ఎత్తైన మూపురంతో శివునితో సహా సంక్రాంతి సంబరాలకు వచ్చానని చెప్పే సంకేతం బసవన్న.ఇంటి ముందు ముగ్గులో బసవన్న నిల్చంటే ఆనేల ధర్మభద్దమైనదంటారు. పిల్లల్లో సరదాని రెట్టింపు చేసే హరిదాసుల సందడే వేరు. భక్తుల కోసం శ్రీహరే హరిదాసుగా వస్తాడని నమ్మకం. తలమీద గుమ్మడికాయ ఆకారంలో ఉండే పాత్ర భూమికి సంకేతం. ఆ పాత్రను తలమీద పెట్టుకోవడం అంటే....శ్రీ హరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని చెప్పటం. భక్తులంతా సమానమంటూ తరతమ భేదాల్లేకుండా ఇంటిఇంటికీ తిరుగుతాడు హరిదాసు.
Also Read: భోగి పళ్లుగా రేగు పళ్లు ఎందుకు పోస్తారు… వీటికి-దిష్టికి ఏంటి సంబంధం…
కనుమ
పండుగలో మూడో రోజు కనుమ. ఈరోజంతా పంటల పండుగే. వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండే పశువులకు శుభాకాంక్షలు చెప్పే రోజిది. పెరట్లో ఉండే ఆవులు, ఎద్దులను అందంగా అలంకరించి వాటికి పూజ చేస్తారు. పల్లెకు రంగులేసే ఈ పండుగ వేళ కోడిపందాలు, ఎడ్ల పందాలు ప్రత్యేక ఆకర్షణ. సొంతూరు వాళ్లే కాదు....పక్క రాష్ట్రాలనుంచి కూడా ఈ పందాలు చూడాలని ఆరాటపడతారు. ఈ పందాలు సంక్రాంతి సంబరాన్ని రెట్టింపు చేస్తాయి. కోడిపందాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.....అధికారులు ఎన్నిహెచ్చరికలు చేసినా పందెంకోళ్లు కాలు దువ్వక మానవు. కోస్తా జిల్లాల్లో సంక్రాంతి అంటే కోడిపందాలే.
Also Read: అన్నమయ్య పాటల్లోనూ సంక్రాంతి గొబ్బిళ్లకు ప్రత్యేక స్థానం...
ముక్కనుమ
ఇలా మూడు రోజుల పాటు ప్రతిక్షణం ఆనందం నింపే పండుగను ఘనంగా సాగనంపేరోజే ముక్కనుమ. ఇంటి మందు పెద్ద రథం ముగ్గు వేసి ఓ ఇంటిముందు వేసే ముగ్గు కొసని మరొకరు కలుపుతూ ఊరంతా కలసి పెద్ద రథాన్ని తయారు చేస్తారు. ఒకరికొకరు చేదోడు వాదోడుగా అంతా కలసి ఉండాలని సూచించేందుకు రథం ముగ్గు సంకేతం. ఇలా నాలుగు రోజులు నాలుగు క్షణాల్లా గడిచిపోయే వేడుకే సంక్రాంతి.
Also Read: ఏడాదంతా పండుగలే.. మరి సంక్రాంతినే పెద్దపండుగ అంటారెందుకు...
Also Read: గతేడాది ఎలా చేశారో తెలియదు కానీ… ఈ సంక్రాంతికి ఇలా చేయండి
Also Read: తిరుమల శ్రీవారిని మొదటి గడప నుంచి దర్శించుకునే అవకాశం.. సామాన్యుడి కల తీరినట్టేనా....!
Also Read: మకర సంక్రాంతి రోజు సూర్యుడి ఆశీర్వాదం కావాలంటే ఇలా చేయకుండా ఉంటే చాలు...
Also Read: సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కల్యాణం, భక్తులకు ఈ నిబంధనలు తప్పనిసరి...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి